Saif Ali Khan: మామూలుగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఇళ్లు ఫుల్ సెక్యూరిటీతో ఉంటాయి. వారు అనుమతి లేకుండా ఎవరూ లోపలికి రావడం కుదరని పని. కానీ అంత సెక్యూరిటీ మధ్య కూడా అప్పుడప్పుడు కొన్ని ఊహించని ఘటనలు చోటచేసుకున్నాయి. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఇంట్లో జరిగిన దొంగతనం కూడా అలాంటిదే. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో కొందరు దొంగలు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేసి దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ దొంగతనానికి సంబంధించిన వివరాలను తాజాగా మీడియాకు అందజేశారు ముంబాయ్ డీసీపీ.
దోపిడి ప్రయత్నం
అసలు అంత సెక్యూరిటీతో ఉన్న ఇంట్లోకి దొంగలు ఎలా చొరబడ్డారా అనే అనుమానం అందరిలో ఉంది. అయితే దొంగలు ఫైర్ ఎస్కేప్ మార్గం నుండి లోపలికి వచ్చారని ముంబాయ్ డీసీపీ దీక్షిత్ గేదం తెలిపారు. ఇదొక దోపిడి ప్రయత్నంలాగా అనిపిస్తుందని పోలీసులు అనుమానిస్తు్న్నారు. ఈ కేసుపై అప్పుడే 10 డిటెక్షన్ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని డీసీపీ బయపెట్టారు. త్వరలోనే దొంగలను పట్టుకొని వారిని అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి అసలు ఈ దొంగతనం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయంపై డీసీపీ దీక్షిత్.. ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. ఇక సైఫ్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ముందురోజే మకాం
సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఈ దాడిలో ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. ఫైర్ ఎస్కేప్ మెట్లు ఎక్కి ముందు రోజే ఆ దుండగులు ఇంట్లోకి ప్రవేశించారని తెలుస్తోంది. తెల్లవారుజామున సరైన సమయం చూసి దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో రాత్రంతా ఆ ఇంట్లోని దాక్కొని ఉన్నారట దొంగలు. ముందుగా తెల్లవారుజామున దాదాపు 2 గంటలకు సైఫ్ కొడుకు జై రూమ్‌లోకి చొరబడ్డారు దొంగలు. జే కేర్‌టేకర్ గట్టిగా అరవడంతో సైఫ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో దొరికిపోతామనే భయంతో సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేశారు దుండగులు.
Also Read: సైఫ్ అలీ ఖాన్ హెల్త్ అప్డేట్… సర్జరీ తరువాత పరిస్థితి ఎలా ఉందంటే ?
ఆసుపత్రికి తరలింపు
దొంగతనానికి వచ్చిన దుండగులు సైఫ్ అలీ ఖాన్‌పై విచక్షణా రహితంగా దాడిచేశారు. తనను కత్తితో పొడిచారు. కత్తిపోట్లతో ఉన్న సైఫ్‌ను కుటుంబ సభ్యులు.. ముంబాయ్‌లోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి 2.30 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. బాండ్రాలోని సద్గురు షరన్ బిల్డింగ్‌లోని 12వ అంతస్తులో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. తనపై దాడి చేసి దోపిడీకి ప్రయత్నం చేశారని తెలుస్తోంది. ఆ సమయంలో సైఫ్‌ను అడ్డుకోవడం కోసం తనను కత్తితో పొడిచారు. దాని వల్ల తీవ్ర గాయాలపాలైన సైఫ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు సైఫ్‌కు సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు అప్డేట్ ఇచ్చారు.