Paresh Rawal: కేవలం హీరో, హీరోయిన్లకు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇండస్ట్రీలోనే కాదు.. ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. అలాంటి వారిలో పరేష్ రావల్ కూడా ఒకరు. బాలీవుడ్‌లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పరేష్.. సౌత్ భాషల్లో కూడా సినిమాలు చేశారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆయన చెప్పే విషయాలు, సమాజం గురించి ఆయన మాట్లాడే మాటలు.. చాలామందిని ఆకట్టుకుంటాయి. అలాంటి పరేష్ రావల్ తాజాగా తన కెరీర్‌లోని చేదు అనుభవం గురించి పంచుకున్నాడు.
కాలికి గాయం
సినిమా షూటింగ్స్ అనేవి ఎంత జాగ్రత్తగా జరిగినా కూడా నటీనటులకు, టెక్నీషియన్లకు గాయాలు అవ్వడం చాలా కామన్. ఒక్కొక్కసారి ఈ గాయాలు చాలా తీవ్రంగానే అవుతుంటాయి. అలా ‘ఘటక్’ సినిమా షూటింగ్ సమయంలో పరేష్ రావల్‌కు కూడా గాయాలు అయ్యాయని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. 1996లో విడుదలయిన ఈ సినిమాను రాజ్‌కుమార్ సంతోషి డైరెక్ట్ చేయగా అప్పటికీ పరేష్ రావల్‌కు నటుడిగా అంతగా గుర్తింపు రాలేదు. ఆయనతో పాటు మరెందరో సీనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. ఆ మూవీ సెట్‌లో తనకు జరిగిన గాయం గురించి గుర్తుచేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పరేష్.
అతడి సలహా
‘ఘటక్’ మూవీ సెట్‌లో తన కాలికి గాయం కాగా అది నయం అవ్వడం కోసం తన మూత్రం తానే తాగేవాడని చెప్పుకొచ్చాడు పరేష్ రావల్. ఇది విన్న ప్రేక్షకులు షాకవుతున్నారు. అసలు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు. అజయ్ దేవగన్ తండ్రి వీరు దేవగనే తనకు ఈ ఐడియా ఇచ్చాడని, ఈ ఐడియా వల్లే తాను తన కాలికి గాయం తగ్గడం కోసం తన మూత్రం తాను తాగానని గుర్తుచేసుకున్నాడు. ప్రతీరోజూ తన మూత్రాన్ని బీరులాగా తాగగా.. తన కాలి గాయం కూడా త్వరగా నయం అయిపోయిందని చెప్పుకొచ్చారు పరేష్ రావల్ (Paresh Rawal). దీంతో ఇదేదో వింతగా ఉందే అంటూ నెటిజన్లు ఈ వీడియో వైరల్ చేసేస్తున్నారు.
Also Read: నాని ‘ప్యారడైజ్’లో బాలీవుడ్ విలన్.. ఇక సినిమా మొత్తం రక్తపాతమే
గుర్తుండిపోయే నటన
1982లో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు పరేష్ రావల్. గుజరాతి సినిమాలో యాక్టర్‌గా తన జర్నీ ప్రారంభించగా 1984లో తనకు మొదటిసారి బాలీవుడ్‌లో అవకాశం దక్కింది. బాలీవుడ్‌లో అవకాశం వచ్చిందన్న మాటే గానీ చాలా ఏల్ల వరకు తనకు అసలు గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించే అవకాశం రాలేదు. కానీ మెల్లగా తన నటనతో ప్రేక్షకుల మైండ్‌లోనే కాదు.. మేకర్స్ దృష్టిలో కూడా రెజిస్టర్ అవ్వడం మొదలుపెట్టారు. 1994లోనే ఏకంగా రెండు సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. దాంతో పాటు పద్మ శ్రీ కూడా అందుకున్నారు. వీటితో పాటు ఆయన మరెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాలీవుడ్‌లో వెలిగిపోతున్నారు.