Salman Khan firing case : స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులకు సంబంధించిన కేసులో, నిందితుడు అనూజ్ థాపన్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే అతని కస్టడీ మరణంపై తాజాగా బాంబే కోర్టు ఇచ్చిన తీర్పుతో పోలీసులకు ఊరట లభించింది. ఈ కేసులో అనుమానాస్పదంగా ఏమీ కనిపించడం లేదని బాంబే హైకోర్టు పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్ 14 న, సబర్బన్ బాంద్రా ప్రాంతంలో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి బయట కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ షాకింగ్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుజరాత్‌కు చెందిన విక్కీ గుప్తా, సాగర్ పాల్‌లను నిందితులుగా గుర్తించి, అరెస్టు చేశారు. వాళ్ళ ద్వారా దొరికిన లీడ్ తో ఏప్రిల్ 26న పంజాబ్‌లో అనూజ్ థాపన్ పట్టుబడ్డాడు. అయితే ఊహించని విధంగా ఈ ఏడాది మే 1న అనూజ్ థాపన్ పోలీసు కస్టడీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. క్రైం బ్రాంచ్ లాకప్‌లోని టాయిలెట్‌లో అతను ఉరివేసుకుని కనిపించాడు.
దీంతో ఈ కేసులో అనూజ్ థాపన్ తల్లి రీటా దేవి (Reeta devi), తన కుమారుడిని పోలీస్ స్టేషన్ లోనే హత్య చేశారంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మృతిపై దర్యాప్తు చేయమని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆదేశించాలని పిటిషన్‌లో ఆమె హైకోర్టును కోరారు. పోలీసు కస్టడీలో అనూజ్ థాపన్‌పై శారీరకంగా దాడి చేసి, చిత్రహింసలు పెట్టారని ఆమె ఆరోపించారు. అయితే మృతిపై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ ఇందులో పోలీసుల తప్పేమీ ఉన్నట్టుగా కన్పించట్లేదని కామెంట్ చేసింది. ఈ కేసులో న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మాట్లాడుతూ.. అనూజ్ మరణంలో తప్పు జరిగినట్టుగా కనిపించడం లేదని పేర్కొంది.
పోలీసులు అతనిని గాయపరచడానికి ఎటువంటి కారణం లేదని శుక్రవారం కోర్టు పేర్కొంది. తమ దర్యాప్తులో సహాయపడగల వ్యక్తిని పోలీసులు ఎందుకు గాయపరుస్తారు? అనే ప్రశ్న లేవనెత్తింది ధర్మాసనం. అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్ గురించి ప్రస్తావిస్తూ, అతను పోలీస్ స్టేషన్ మొత్తం స్వేచ్ఛగా తిరిగాడని గుర్తు చేశారు. “కొడితే గొడవ చేస్తాడు. కానీ ఆ వీడియోలో అలాంటిదేమీ లేదు. పైగా టాయిలెట్ కి ఆయన వెంట ఎవ్వరూ వెళ్ళినట్టుగా కన్పించట్లేదు. అంటే ఎవ్వరూ అతన్ని ఫాలో అవ్వలేదు” అని చెప్పుకొచ్చారు జడ్జి. ఇక ఆ తల్లి బాధను గుర్తించిన న్యాయమూర్తులు పరిస్థితుల దృష్ట్యా ఇలా జరిగి ఉండవచ్చు అంటూ సర్ది చెప్పారు. కేసు తదుపరి విచారణను జనవరి 24న వాయిదా వేసిన కోర్టు, మేజిస్ట్రేట్ నివేదికను చూడాల్సిందిగా రీటా దేవి తరఫు న్యాయవాదిని కోరింది.
ఇదిలా ఉండగా మరోవైపు సల్మాన్ ఖాన్ ను ఈ కాల్పుల ఘటన నుంచి ఎక్కువైన హత్యా బెదిరింపులు ఇంకా కొనసాగుతున్నాయి. రీసెంట్ ఇలాంటి ఆందోళనకర సంఘటన ఒకటి జరగ్గా, సల్మాన్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని, తాను హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ 8 హిందీ’కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.