Singer Pravasthi: బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతీ రియాలిటీ షోలో కనిపించేదంతా నిజం కాదని చాలామంది ప్రేక్షకులకు తెలియదు. వాళ్లు బుల్లితెరపై ఎలాంటి ఎమోషన్ పండించినా.. అవన్నీ నిజమే అని నమ్మే ప్రేక్షకులు ఇంకా ఉన్నారు. అలా చాలామంది ఆడియన్స్ ఇలాంటి బుల్లితెర షోలకు చాలా కనెక్ట్ అవుతారు. అందుకే ఆ షోలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అలాంటి వాటిలో ‘పాడుతా తీయగా’ కూడా ఒకటి. అసలు సింగింగ్ షోలలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయింది ‘పాడుతా తీయగా’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించిన ఈ షో ఇప్పటికీ కొనసాగుతుండగా మొదటిసారి దీనిపై ఒక సింగర్ తీవ్రమైన ఆరోపణలు చేసింది.
తీవ్రమైన ఆరోపణలు
‘పాడుతా తీయగా’లో తాను కూడా ఒక సింగర్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ప్రవస్తి ఆరాధ్య. ఇప్పటికే తను ఒక సీజన్‌లో సింగర్‌గా ప్రేక్షకులను మెప్పించగా ఇప్పుడు మరొక సీజన్‌లో కూడా కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యింది. కానీ ఈ సీజన్‌లో తను త్వరగా ఎలిమినేట్ అయ్యింది. తను బాగానే పాడుతుంది కదా అయినా ఎందుకు ఎలిమినేట్ అయ్యిందని మ్యూజిక్ లవర్స్ ఈ విషయంపై చర్చించుకున్నారు కూడా. అయితే తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే అంటూ, ‘పాడుతా తీయగా’కు సంబంధించిన చేదు నిజాలు బయటపెడతానంటూ ముందుకొచ్చింది ప్రవస్తి ఆరాధ్య. అందులో భాగంగా సింగర్ సునీతపై తీవ్రమైన ఆరోపణలు చేసింది.
చాలా ఇబ్బందిపెట్టారు
తాజాగా ‘పాడుతా తీయగా’కు సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్‌కు కీరవాణి గెస్ట్‌గా వచ్చారు. సునీత సైతం ఈ షోకు ముందు నుండే జడ్జిగా వ్యవహరిస్తోంది. అయితే వీరిద్దరూ తనను బాడీ షేమింగ్ చేశారని తీవ్రమైన ఆరోపణలు చేసింది ప్రవస్తి. ‘‘బాలుగారు ఉన్నప్పుడు షో చాలా బాగుండేది. కావాలంటే మీరు అన్ని సీజన్స్ చూడండి. ఇప్పుడంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. పాడుతున్నప్పుడు ఎక్స్‌పోజింగ్‌గా ఉండే బట్టలు వేసుకోమనేవారు. ముఖ్యంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టేవారు. నాలాంటి పర్సనాలిటీకి ఇంక ఎలాంటి బట్టలు ఇవ్వాలంటూ కాస్ట్యూమ్ డిజైనర్ నా మొహం మీద చెప్పేవాడు’’ అంటూ షో బాగోతం అంతా బయటపెట్టింది ప్రవస్తి ఆరాధ్య.
Also Read: బొడ్డు కిందకి చీరలా? ప్రవస్తి ఫోటోలు రిలీజ్ చేసిన ‘పాడుతా తీయగా’ టీమ్..
ఎక్కువ టార్చర్
‘పాడుతా తీయగా’లో కీరవాణి (Keeravani) పాటలు పాడితేనే ఎక్కువగా మార్కులు వేస్తారు అంటూ ప్రవస్తి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తనపై నెగిటివిటీ వస్తోంది. అయినా తను మాత్రం ఈ షోపై ఆరోపణలు చేయడం ఆపలేదు. ‘‘ఆ షోలో అందరికంటే సునీత (Sunitha) ఎక్కువ టార్చర్ చేసేది. నేను ఎవ్వరికీ భయపడను. ఏం జరిగినా అందరికీ తెలియాలనే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంత పెద్ద సింగర్స్‌పై ఇలాంటి ఆరోపణలు చేయడానికి నీ అనుభవం ఎంత అని అడుగుతున్నారు. నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి అనుభవంతో పనేముంది’’ అని ప్రశ్నించింది ప్రవస్తి. అంతే కాకుండా ఈ షో నుండి వచ్చే ఎపిసోడ్‌లో ఇద్దరు ఎలిమినేట్ అవుతున్నారని ముందే బయటపెట్టింది. ప్రవస్తి ఇలా చేయడం వల్ల తనపై చాలా నెగిటివిటీ వస్తున్నా.. తను చెప్పింది నమ్మి సపోర్ట్ చేస్తున్నవారు కూడా చాలామందే ఉన్నారు.