HBD Naga Vamsi : ఒక ఆలోచన నమ్మి సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదు. ఖలేజా సినిమాలో త్రివిక్రమ్ రాసినట్లు “ఊరికే డబ్బులు ఎవరు ఇవ్వరు, దోబ్బమంటారు”. అలా ఒక దర్శకుడిని నమ్మాలి అంటే విపరీతమైన నమ్మకం ఉండాలి. అంతేకాకుండా ఆ దర్శకుడు కథను చెప్తున్నప్పుడే వెండితెరపై నిర్మాత ఆ కథను ఊహించుకోగలగాలి. ఈ రోజుల్లో అలాంటి విజన్ ఉన్న నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.
జులాయి సినిమాతో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యానర్లో సూర్యదేవర రాధాకృష్ణ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. దాదాపు కొన్నేళ్లు క్రితం రాధాకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తీవ్రమైన నష్టాలు చవిచూసి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ జులాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. అయితే హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ లో ఓన్లీ త్రివిక్రమ్ మాత్రమే సినిమాలు చేస్తారు. కానీ ఆయా నిర్మాతలకు అంతమందితోని పనిచేయాలని ఆలోచన ఉంటుంది.
అందుకే సితార ఎంటర్టైన్మెంట్స్ పుట్టింది
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ త్రివిక్రమ్ కి అంకితం చేసేసారు. అయితే మిగతా హీరోలతో ప్రాజెక్టులు కూడా చేయాలి కాబట్టి దానికి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను చాలా విజయవంతంగా నడిపించాడు నాగ వంశీ. చాలామంది దర్శకుల చూపులన్నీ కూడా ఒక్కసారిగా నాగవంశీపైన పడ్డాయి. ఇప్పటివరకు సితార ఎంటర్టైన్మెంట్స్‌లో రణరంగం, బుట్ట బొమ్మ వంటి సినిమాలు మినహాయిస్తే భారీ డిజాస్టర్ అయిపోయిన దాఖలాలు లేవు. అంత పగడ్బందీగా ప్రతి సినిమాను ముందుకు నడిపిస్తున్నాడు నాగ వంశీ.
డైరెక్టర్లను వెయిట్ చెయ్యనివ్వడు
మామూలుగా ఒక దర్శకుడు సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు లేట్ అవుతూ ఉంటుంది. అయితే కొంతమంది దర్శకులు అదే ప్రాజెక్టు పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా ఓకే అయింది అంటే దర్శకుడు అంత ఖాళీగా ఉండడు. ఈ లోపు వేరే సినిమాను కూడా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తాడు. ‘అనగనగా ఒక రాజు’ సినిమా లేట్ అవుతున్న తరుణంలో మ్యాడ్ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా మారిపోయాడు. ‘కింగ్డమ్’ సినిమా లేట్ అవుతున్న తరుణంలో గౌతం తిన్ననూరితో ‘మ్యాజిక్’ అనే మరో సినిమాను చేసేసాడు. ఇలా దర్శకులను ఎంకరేజ్ చేసే నిర్మాతలు అతి తక్కువ మంది ఉంటారు ఈ రోజుల్లో.
“నా సినిమాలకు రివ్యూలు రాయొద్దు”
మా సినిమాను మీడియా భుజాల మీద మోసుకెళ్లింది. మీడియా లేకపోతే ఈ రోజు మా సినిమా లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అని సరైన కంటెంట్ ఉంటే అది ఎంతవరకు వెళ్తుందో అనేది మాట్లాడేది నాగ వంశీ. తన సినిమా ప్రెస్ మీట్ లోనే నా సినిమాకి రివ్యూలు రాయొద్దు అని చెప్పడానికి చాలా గట్స్ కావాలి. అలా అని చెప్పి మిగతా వాళ్ళు రివ్యూలు మానేస్తారా అంటే ఖచ్చితంగా మానరు. మీ రివ్యూల వలన నా సినిమాకు వచ్చిన నష్టం ఏమీ లేదు అని చెప్పడం కేవలం నాగ వంశీకి మాత్రమే సొంతం.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది వాళ్లు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు ? ఈ మాట మాట్లాడితే నన్ను ట్రోల్ చేస్తారు అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో నాగ వంశీ మాట్లాడిన మాటలు చాలామందికి కరెక్ట్ కాకపోయినా కూడా కొంతమందికి కనెక్ట్ అవుతాయి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు కదా అని అనిపిస్తాడు. అలానే పెద్ద పెద్ద నిర్మాతలతో దీటుగా డిస్ట్రిబ్యూషన్ లో పోటీ పడతాడు. డిస్ట్రిబ్యూటర్స్ ను ఎగ్జిబిటర్స్ ను ఎలా కాపాడుకోవాలో కూడా బాగా తెలుసు. తన బ్యానర్ లో ఒక చిన్న సినిమా వచ్చినా కూడా దానికి ఒక గోడల ముందు నిల్చుని సినిమాను ముందుకు తీసుకెళ్తాడు. ఇలాంటి గట్స్, కమిట్మెంట్స్ ఉన్న నిర్మాతలు అరుదుగా కనిపిస్తారు. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అటువంటి నిర్మాత వంశీ ఉండడం కొంతమంది దర్శకులకు మేజర్ ప్లస్ పాయింట్. అలానే వరుసగా సినిమాలు తీయడం వలన ఇండస్ట్రీ కూడా మంచి ప్లస్. ఏదేమైనా ” ప్రస్తుత తెలుగు సినిమా నిర్మాతల యందు వంశీ వేరయ్య”.