Suhasini Maniratnam: ఈమధ్య కాలంలో యంగ్ హీరోయిన్లతో పోలిస్తే సీనియర్ హీరోయిన్లే.. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కునే సమస్యల గురించి మాట్లాడడానికి ముందుకొస్తున్నారు. ఒకప్పటి నుండి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వచ్చాయి. మహిళలకు సేఫ్టీ అనేది ఏ విధంగా మారింది అనేవి ఓపెన్‌గా మాట్లాడుతున్నారు సీనియర్ నటీమణులు. అలాంటి వారిలో సుహాసిని కూడా ఒకరు. ఇప్పటికే ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కునే పరిస్థితుల గురించి ఎన్నోసార్లు ఆమె అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పేసిన సుహాసిని.. తాజాగా మాలీవుడ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పర్సనల్ సరిహద్దులు ఉండవు
ఖుష్భూ, భూమి పెడ్నేకర్, దర్శకుడు ఇంతియాజ్ అలీ, సుహాసిని (Suhasini) కలిసి గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (International Film Festival) ఈవెంట్‌లో సినిమాలో మహిళల సేఫ్టీ గురించి చర్చించారు. ఇతర భాషా పరిశ్రమలతో పోలిస్తే మలయాళ సినిమాలో పనిచేసే మహిళలకు సేఫ్టీ తక్కువ అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు సుహాసిని. ‘‘సినిమా అనేది ఇతర రంగాలలాగా కాదు. పని అయిపోగానే ఇంటికి వచ్చేయడం లాంటిది జరగదు. ఒక్కొక్క సినిమా కోసం 200 నుండి 300 మంది వరకు కష్టపడుతుంటారు. వారంతా ఒక కుటుంబం లాగా కలిసిపోతారు. అలాంటి వాతావరణంలో తెలిసో తెలియకో కొన్ని పర్సనల్ హద్దులను దాటేస్తుంటారు’’ అని వివరించారు సుహాసిని.
Also Read: రూటు మార్చిన సన్నీ లియోన్.. డూప్ లేకుండా యక్షన్ సీన్స్, పాన్ ఇండియా మూవీ కోసమే ఈ కష్టాలు
అతడిని తరిమేశాం
అలా ఒకసారి హద్దులు దాటిన వ్యక్తిని మేము సినిమా సెట్ నుండి తరిమేశాం అని గుర్తుచేసుకున్నారు సుహాసిని. ‘‘200 మంది ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి ఎలాంటి రూల్స్ లేకుండా జీవిస్తున్నప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. అదే సమస్య. ముఖ్యంగా మలయాళ సినీ పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. తమిళ సినిమాలు చేసేటప్పుడు చెన్నైలో ఉన్న ఇంటికి వెళ్తాం. తెలుగు సినిమాలు చేసేటప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఇంటికి వెళ్తాం. కన్నడ సినిమాలు చేసేటప్పుడు బెంగుళూరులోని ఇంటికి వెళ్తాం. హిందీ సినిమాలు చేసేటప్పుడు ముంబాయ్‌లోని ఇంటికి వెళ్తాం. కానీ మలయాళ సినిమాలు చేసేటప్పుడు అలా కాదు’’ అని తెలిపారు సుహాసిని.
ఒకే ప్రాంతంలో ఉండాలి
‘‘మలయాళ సినిమాలు చేసేటప్పుడు ఎవరి ఇంటికి వారు వెళ్లడానికి పూర్తిగా వీలు ఉండదు. ఎందుకంటే వారి ఇల్లు తిరువనంతపురంలో ఉండొచ్చు, కాలికట్‌లో ఉండొచ్చు, కొచ్చిలో ఉండొచ్చు. దానివల్ల ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు సరిహద్దులు అనేవి దాటడానికి ప్రయత్నిస్తారు’’ అని అన్నారు సుహాసిని. అంతే కాకుండా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకునేవారికి ఆమె సలహా కూడా ఇచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చే ముందే ఇక్కడ పని ఎలా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యమని, ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం సరైన మనుషులను మాత్రమే నమ్మమని సలహా ఇచ్చారు. సుహాసిని ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రేక్షకులు మిక్స్‌డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. మాలీవుడ్‌పై ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలా పెద్దది అని ఫీలవుతున్నారు.