UN Report on Bangladesh Riots : బంగ్లాదేశ్ లో గతేడాది విద్యార్థుల ముసుగులో చెలరేగిన హింసాకాండలో హిందు కుటుంబాలే లక్ష్యంగా అనేక దాడులు జరిగాయని ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది. అలర్లను అడ్డుగా పెట్టుకుని అనేక మతోన్మాద శక్తులు పెచ్చురిల్లాయని తెలిపింది. బంగ్లాలోని హిందువులపై విచక్షణారహిత దాడులు, హత్యలు, మానభంగాలు చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లోని హిందూ సమూహాలు, అహ్మదీయ ముస్లిం వర్గాల మానవ హక్కులకు తీవ్ర ఉల్లంఘనలు జరిగినట్లు తేల్చింది.
హింసాత్మక ఘటనలు మొదలైన తర్వాత జూలై 1 నుంచి ఆగష్టు 15 మధ్య వరకు బంగ్లాదేశ్ లో దాదాపు 1,400 మంది మరణించినట్లు తేల్చారు. వీరితో పాటుగా వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారని, మరింత మంది వికలాంగులుగా మారారని ఐరాస బృందం తేల్చింది. వీరిలో ఎక్కువ మంది బంగ్లా భద్రతా దళాల కాల్పుల్లో మరణించినట్లు నివేదిక అంచనా వేసింది. మొత్తం మృతుల్లో 12-13 శాతం మంది చిన్నారులు ఉన్నట్లు నిపుణుల బృందం తేల్చింది. ఈ నిరసనల్లో 44 మంది పోలీసు అధికారులు సైతం ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుత బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ అభ్యర్థన మేరకు ఆ దేశంలో పర్యటించిన ఐరాస బృందం.. ఈ ప్రత్యేక నివేదికను రూపొందించింది. ప్రభుత్వ కోరిక మేరకు వివిధ అంశాల్లో నిపుణులను బృందాలుగా ఏర్పాటు చేసి అక్కడికి పంపించారు. వీరిలో మానవ హక్కుల పరిశోధకులు, ఫోరెన్సిక్ వైద్యులు, ఆయుధ నిపుణులు వంటి వారున్నారు. వీరంతా.. వివిధ అంశాలను, ప్రభుత్వ నిఘా సమాచారాన్ని, నివేదికల్ని ఆధారంగా చేసుకుని ఈ విషయాలను కనుక్కున్నారు. కాగా.. ఈ మొత్తం దుర్ఘటనలకు అప్పటి అధికార యంత్రాగం, అధికారుల చర్యలే కారణమని తేల్చింది.
బంగ్లా మాజీ ప్రభుత్వం, భద్రతా, నిఘా వర్గాలతో పాటుగా అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న అనేక హింసాత్మక అంశాలతో పాటుగా విద్యార్థుల ఆందోళనలో చోటుచేసుకున్న మానవ హక్కులపై ప్రత్యేకంగా ఐరాస ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. దేశంలో మొదలైన అల్లర్లను అణిచివేసేందుకు అప్పటి ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించిందని తేల్చింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల్ని అణిచివేసేందుకు, సానుభూతిపరులను హింసాత్మకంగా అణిచివేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు అనుమతిచ్చిన్నట్లు గుర్తించింది.
ఈ అల్లర్లను అడ్డుగా పెట్టుకుని హిందువులకు చెందిన ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ఆలయాలపై ప్రణాళికాబద్ధమైన దాడులు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక తేల్చింది. ఠాకుర్ గావ్, లాల్ మొనిర్ హట్, దినాజ్ పూర్, సిల్హెట్, కుల్నా, రంగ్ పూర్ వంటి ప్రాంతాలతో పాటు అనేక ఇతర గ్రామాల్లో హిందువులపై హింసాకాండ కొనసాగినట్లు తెలిపింది. రిజర్వేషన్ల పేరుతో మొదలైన ఉద్యమం క్రమంగా.. మతం రంగుపూసుకోగా ఆదేశంలోని హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డట్టు గుర్తించారు. అలాగే.. ఇక్కడ భారీగా చెలరేగిన హింసకు తట్టుకోలేక.. ఆస్తులు, సంపదలు వదిలేసి దాదాపు 30-40 వేల మంది హిందువులు భారత్ సరిహద్దు దగ్గర ఆశ్రయం పొందారని తెలిపింది. ఈ దాడులకు పాల్పడిన వాళ్లు.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ ప్రాటీ, జమాత్ ఏ ఇస్లామీ సహా.. అనేక ముస్లిం మద్దతుదారులున్నారు, వారి సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయని తేల్చారు.
Also Read : అమెరికాలో ఆగిన పెన్నీ – మరి మన రూపాయి సంగతేంటి? ఒక్క నాణెం ముద్రణకు ఎంత ఖర్చంటే!
బంగ్లాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్క్య సమరయోధుల పిల్లలకు ప్రత్యేక కోటా వ్యవస్థను పునరుద్ధరిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆదేశంలో అల్లర్లు చెలరేగాయి. ఇవి క్రమంగా చిలికి చిలికి గాలివానలా మారగా.. ఏకంగా ఆ దేశ రాజకీయ, సామాజిక అస్థిరతకు కారణమయ్యాయి. లక్షల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు తెలుపగా.. ఆదేశ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశ విడిచి పారిపోవాల్సి వచ్చింది.