చైనా మరోసారి భారత్‌ను ఆందోళనకు గురిచేసేలా ఓ భారీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును బ్రహ్మపుత్ర నది (చైనాలో యార్లాంగ్ జాంగ్‌బోగా పిలుస్తారు) మీద నిర్మించేందుకు మొదలుపెట్టింది. ఈ నది భారత రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మీదుగా ప్రవహిస్తుంది. అందుకే చైనా ఈ నదిపై ఇష్టారీతిన ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
టిబెట్ ప్రాంతంలోని నింగ్చీ నగరంలో ఈ డ్యామ్ నిర్మాణానికి చైనా ప్రధాని లీ కియాంగ్ శనివారం భూమిపూజ చేశారు. మొత్తం రూ. 167.8 బిలియన్ డాలర్ల (సుమారుగా రూ. 14 లక్షల కోట్లకు పైగా) అంచనాతో ఈ డ్యామ్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఐదు చోట్ల హైడ్రోపవర్ స్టేషన్లను కూడా నిర్మించనున్నారు.
2023లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. ఈ ప్రాజెక్టు పూర్తైతే ప్రతి ఏడాది సుమారు 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. ఇది చైనా దేశంలోని 30 కోట్ల మందికి సరిపడే విద్యుత్. ఇందులోని ఎక్కువ భాగాన్ని చైనా విదేశాలకు ఎగుమతి చేయాలని భావిస్తోంది.
భారత్ కు తీవ్ర నష్టం.. ఎలాగంటే?..
బ్రహ్మపుత్ర నది భారతదేశానికి అత్యంత ముఖ్యమైన నీటి వనరు. చైనా ఈ డ్యామ్‌ను పూర్తిగా నియంత్రిస్తే, అవసరమైన సమయంలో నీటిని ఆపేసి, ఇరు దేశాల మధ్య ఘర్షణ సమయంలో ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే.. భారత భూభాగం ముంపునకు గురిచేయొచ్చు. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. గతేడాది డిసెంబర్ 18న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఈ విషయాన్ని లేవనెత్తారు.
పైగా భూకంపాలు ఎక్కువగా వచ్చే టిబెట్ ప్రాంతంలో ఇంత పెద్ద నిర్మాణం నిర్మిస్తుండటం వల్ల కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఇది హిమాలయాల్లో నిర్మితమవుతున్న తొలి డ్యామ్ కాదు. కానీ ఈ స్థాయిలో భారీగా ఉండటం, పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది.
పర్యావరణం రాజకీయ ప్రభావాలు
ఈ డ్యామ్ నిర్మాణం వల్ల కేవలం నీటి సమస్యే కాదు, పర్యావరణానికి, జలవనరుల పట్ల దేశాల మధ్య నమ్మకానికి కూడా ప్రభావం పడుతుంది. హిమాలయ ప్రాంతం ఇప్పటికే పర్యావరణపరంగా సున్నితమైనది. ఇక్కడ భారీ నిర్మాణాలు చేయడం ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ వారంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిసినప్పుడు, ఇరు దేశాలు.. సరిహద్దుల వద్ద నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పరస్పర గౌరవం అవసరమని స్పష్టంగా చెప్పారు.
Also Read: కర్ణాటక సిఎం చనిపోయారా? మెటా కంపెనీ బ్లండర్‌పై మండిపడ్డ సిద్దరామయ్య
చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ఈ భారీ డ్యామ్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావొచ్చు. కానీ ఇది భారత్‌కు ఆర్థికం, భౌగోళికం, పర్యావరణం, జలవనరుల పరిరక్షణకు ముప్పుగా మారే అవకాశం ఉంది. అందుకే భారత ప్రభుత్వం ఈ డ్యామ్ విషయంలో తగిన చర్యలు తీసుకుంటోంది. ఈ డ్యామ్ భవిష్యత్తులో భారత్-చైనా సంబంధాలకు ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.