China Population Declining Divorce Increasing | ప్రపంచ వాణిజ్యంలో నానాటికీ ఎగుమతులతో దూసుకుపోతున్న చైనా. లోలోపల కుచించుకుపోతోంది. అక్కడ ప్రజలు యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారు. భార్య, పిల్లలు వద్దు. కుటుంబం వద్దు. ఏక్ నిరంజన్ అంటూ జీవితాంతం ఒంటరిగానే బతికేస్తామంటున్నారు. అందుకే పెళ్లిళ్లు చేసుకున్నా కలిసుండలేక వివాహ బంధానికి ఎక్కువ మంది చైనీయులు గుడ్ బై చెప్పేస్తున్నారు.
ఈ పరిస్థితి వల్ల చైనాలో సంతానోత్పత్తి తగ్గిపోయింది. పెళ్లిళ్ల సంఖ్య భారీగా తగ్గుతోంది, వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఇప్పుడు చైనాలో పెళ్లిళ్ల కంటే విడాకుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటీవలి సామాజిక పరిణామాలను పరిశీలిస్తే.. చైనా సమాజం గంభీరమైన సమస్యలను ఎదుర్కొంటోందని తేలింది.
చైనా వైవాహిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కుప్పకూలింది. గత సంవత్సరం వివాహాల సంఖ్య రికార్డ్ స్థాయిలో తగ్గింది. చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. వివాహ నమోదులలో 20 శాతం తగ్గుదల నమోదైంది. గత సంవత్సరం 7.68 మిలియన్ల జంటలు వివాహం చేసుకున్నారు, కానీ ఇప్పుడు ఈ సంఖ్య 6.1 మిలియన్లకు తగ్గింది. పెళ్లిళ్లు తగ్గడం చూస్తున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు “ఒకే బిడ్డ” నీతిని అనుసరించిన చైనా ప్రభుత్వం, ఇప్పుడు వివాహాలు చేసుకోవాలని పిల్లల్ని కనాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది.
Also Read: ట్రంప్ బాటలో యుకె.. బ్రిటన్‌లో భారతీయ రెస్టారెంట్లపై దాడులు.. టార్గెట్ వారే!
విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల ప్రకారం, 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా వివాహాలు 12.2 శాతం మాత్రమే తగ్గాయి. కానీ 2013లో చైనాలో వివాహాల సంఖ్య 13.47 నమోదుకాగా.. గత సంవత్సరం అంటే 2024లో అందులో సగం (6.1 మిలియన్లు) కూడా లేదు. ఇదే ధోరణి కొనసాగితే.. చైనా ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడిపోతుందని చైనా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనాలో విడాకుల సంఖ్య కూడా పెరుగుతోంది. గత సంవత్సరం 2.6 మిలియన్లకు పైగా జంటలు విడాకులు తీసుకున్నారు. ఇది 2023 కంటే 1.1 శాతం ఎక్కువ. 2023లో కంటే 2024లో చైనాలో 28,000 విడాకుల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
విడాకులు సంఖ్య ప్రతీ సంవత్సరం పెరిగిపోతుండడంతో చైనా ప్రభుత్వం 2021లో 30 రోజుల కూలింగ్ పీరియడ్ ప్రవేశపెట్టింది. అంటే ఆవేశంలో గొడవలు పడి విడిపోయే జంటలు.. విడాకుల కోసం కోర్టు వరకు వచ్చాక.. తిరిగి వారిద్దరూ 30 రోజుల పాటు కలిసి ఉండాలని చట్టం తీసుకువచ్చింది. కానీ ఈ నిబంధన వల్ల వేధింపులకు గురయ్యే మహిళలకు ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇదే కాకుండా చైనా ప్రభుత్వం జనాబా పెంచడానికి, పెళ్లిళ్లు చేసుకోమని ప్రజలను ప్రోత్సహించడానికి గత కొన్ని సంవత్సరాల్లో చర్యలు చేపట్టింది. వాటిలో ముఖ్యమైనవి..
సామూహిక వివాహాలు జరిపించడం. యువత కోసం డేటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం, బ్రైడ్ ప్రైస్ (కన్యాశుల్కం) అంటే వరుడు చెల్లించే సంప్రదాయ కట్నం విధానం నిషేధమైనా కొందరు ఇంకా ఆ సంప్రదాయాన్ని పాటిస్తుండడంతో ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకున్నవారికి, పిల్లలు కన్న దంపతులకు నగదు కానుకల అందిస్తోంది. 2022 నుంచి ఈ ప్రోత్సహకాలు అమలులో ఉన్నాయి. 2021 నుంచి ముగ్గురు పిల్లలు కనండి అని ప్రభుత్వం చెబుతోంది.
కానీ ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా.. చైనా యువత మాత్రం పెళ్లి చేసుకోరా బాబు.. అని అడిగితే.. ముఖం చాటేస్తున్నారు. ఎక్కువ మంది చెప్పే కారణాలు.. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరిగిపోవడం, సమాజంలో ఆర్థిక అసమానలు పెరిగిపోవడం. యువతులు కూడా తాము పెళ్లి చేసుకుంటే కంటే ఉద్యోగాలు చేయలేమని.. పిల్లలు, వారి పెంపకం భారంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పెళ్లి తరువాత గర్భం దాలిస్తే.. ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని చాలామంది చెబుతుతన్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మరో రెండు, మూడు దశాబ్దాల్లోనే చైనాలో యువత కంటే వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆ సమయంలో దేశాభివృద్ధి ఆగిపోయే ప్రమాదముంది.