Donald Trump New Rules: డాలర్ డ్రీమ్స్..! సగటు భారతీయుడి కల..! తమ పిల్లల్ని బాగా చదివించి, యూఎస్ పంపించాలని కలలు కంటారు పేరెంట్స్. అప్పుచేసో, ఆస్తులమ్మో అమెరికా పంపిస్తారు. ఒకసారి యూఎస్ వెళ్తే చాలు లైఫ్ సెటిల్ అనుకుంటారు. ఐతే ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అమెరికా అంటేనే భయపడాల్సి వస్తోంది. ట్రంప్ ఏ ముహూర్తాన అడుగుపెట్టారో గానీ, డాలర్ డ్రీమ్స్… కలలుగానే మిగిలిపోతున్నాయి.
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిందీ మొదలు ట్రంప్ టార్గెట్, విదేశీ విద్యార్థులు. సాకులు వెతుక్కొని మరీ సాగనంపుతున్నారు. ఎలాగైనా చేసి వారిని వెనక్కి పంపాలని కంకణం కట్టుకున్నారో ఏమో.. దొరికినవారిని దొరికినట్టు స్వదేశాలకు పంపిస్తున్నారు. ఇన్నాళ్లు స్టూడెంట్ వీసాతో వెళ్లి జాబ్‌లు చేసేవారిని టార్గెట్ చేసిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడు క్యాంపస్‌లో చదివే స్టూడెంట్స్‌ను సైతం విడిచిపెట్టడం లేదు. అమెరికా ప్రభుత్వం ఒత్తిళ్లతో యూనివర్సిటీలు సైతం చేతులెత్తేస్తున్నాయి. ఇటీవల ఏ కారణం లేకుండా మిచ్‌గాన్ యూనివర్సిటీలో చదివే కొందరు విద్యార్థులను టెర్మినేట్ చేసింది హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్. ఈ విషయాన్ని విద్యార్థులకు మెయిల్స్ ద్వారా పంపించింది యూనివర్సిటీ. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది ఆ యూనివర్సిటీ.
మిచ్‌గాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కటే కాదు. వివిధ యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థులకు ఇలాంటి మెయిల్స్ వెళ్తున్నాయి. దాంతో ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు, వారి పేరెంట్స్‌లో ఆందోళన మొదలైంది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. విద్యార్థులకు వర్క్ వీసాలను అందించే OPTని కూడా రద్దు చేసే ఆలోచనలో ఉంది ట్రంప్ సర్కార్. సాధారణంగా అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు ఆప్షనల్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ ఉంటుంది. అంటే చదువు పూర్తైన తర్వాత మరో నాలుగేళ్లు అక్కడే పనిచేసుకోవచ్చు. ఐతే దీన్ని రద్దు చేసేందుకు బిల్లు తెస్తున్నారు ట్రంప్. ఒకవేళ OPT రద్దైతే.. భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్ తగిలినట్లే. దాదాపు మూడున్నర లక్షల మంది ఎఫెక్ట్ అవుతారు. అమెరికాలో కోర్సు పూర్తైన వెంటనే రావాల్సి ఉంటుంది.
తాజాగా విదేశీయులకు మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. అక్రమంగా ఉంటున్నవారంతా అమెరికా విడిచి వెళ్లాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. టికెట్ కొనే స్తోమత లేకుంటే.. రాయితీ కూడా ఇస్తామని ప్రకటించింది. లేదంటే ఫైన్ వేయడంతో పాటు జైలుశిక్ష సైతం వేస్తామని హెచ్చరించింది. జరిమానా కట్టే వారు, జైలు శిక్ష అనుభవించిన వారు భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతారని తేల్చి చెప్పింది.
Also Read: ఇండియన్స్‌ను టార్గెట్ చేస్తున్న అమెరికా ప్రభుత్వం.. చిన్న తప్పులకు భారీ జరిమానాలు
దాంతో పాటు అమెరికాలో 30 రోజులకు మించి నివాసం ఉంటున్న విదేశీయులు.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. లేదంటే నేరంగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు ఎక్కువగా ఉన్నా.. రోజుకు 998 డాలర్లు అంటే 86 వేల రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది హోంల్యాండ్ సెక్యూరిటీ. సొంతంగా దేశం వీడకపోతే వెయ్యి నుంచి 5వేల డాలర్ల ఫైన్ విధించబోతున్నట్లు మరోసారి గుర్తు చేసింది. H1-బీ వీసా, స్టూడెంట్ వీసా వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది.