Tik Tok Prank Death| సోషల్ మీడియాలో వైరల్ అయిపోయే వీడియోలు పెట్టాలనే పిచ్చి ఈ మధ్య బాగా ముదిరిపోతోంది. కొందరైతే ఈ వీడియోలు, రీల్స్ తీయడానికి ప్రాణాంతకమైన స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కుర్రాళ్లు వైరల్ వీడియో కోసం సరదాగా పక్కింటి యజమానిని ఆటపట్టించడానికి ప్రాంక్ చేశారు. కానీ అనుకోని విధంగా వారిలో ఒకడు చనిపోయాడు. మరొకడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఫ్రెడెరిక్స్‌బర్గ్ నగరం స్పాట్సిల్వేనియా కౌంటీకి చెందిన మైకేల్ బాస్‌వర్త్ అనే 18 ఏళ్ల కుర్రాడు గత శనివారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి డింగ్ డాంగ్ డిచ్ అనే గేమ్ ను ఆడుతూ వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఆ గేమ్ లో మైకేల్, అతని స్నేహితులు ఆ ప్రాంతంలోని ఇళ్ల డోర్ బెట్ మోగించి పారిపోతుంటారు. ఈ గేమ్ రాత్రి 3 గంటల సమయంలో మైకేల్ తన ఇద్దరు స్నేహితులత కలిసి ఆడుతుండగా.. అతని స్నేహితులు టిక్ టాక్ వీడియోలు రికార్డ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మైకేల్, అతని ఇద్దరు స్నేహితులు ఆ ప్రాంతంలో నివసించే టైలర్ చేజ్ బట్లర్ అనే యువకుడి ఇంటి డోర్ బెల్ మోగించారు.
అర్థరాత్రి దాటడంతో టైలర్ తన ఇంట్లో గాఢనిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో మైకెల్, అతని స్నేహితులు టైలర్ ఇంటి డోర్ బెల్‌ని పదే పదే మోగించారు. దీంతో టైలర్ నిద్రలేచి డోర్ తెరడానికి వచ్చాడు. కానీ ఆ సమయంలో ఎవరు? వచ్చి ఉంటారు? అని అనుమానంతో డోర్ తీయలేదు. కెమెరాలో ఎవరో ముగ్గురు తన ఇంటి ముందు దొంగచాటుగా తిరుగుతున్నట్లు అతనికి కనిపించింది. అది చూసి టైలర్ ఎవరో దుండగులు తనపై దాడి చేసి ఇంట్లో దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నరాన భావించాడు.
Also Read: పెళ్లిలో వధూవరుల బంధువుల మధ్య గొడవ.. తందూరి రోటీ కోసం ఇద్దరు హత్య
ఆ భయంతో ఇంట్లో ఉన్న తన తుపాకీ తీసుకువచ్చాడు. ఇంటి బయట మైకేల్, అతని స్నేహితులు మళ్లీ మళ్లీ డోర్ బెల్ మోగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో టైలర్ వారిని దొంగలుగా భావించి సరిగ్గా వారు డోర్ బెల్ మోగించడానికి తిరిగి వచ్చిన సమయంలో ఓపెన్ చేసి వారిపై తుపాకీతో కాల్పుడు జరిపాడు. అంతే ఆ కాల్పుల్లో మైకేల్ ఛాతీ భాగంలో రెండు బుల్లెట్లు దిగాయి.మైకేల్ స్నేహితుడొకడికి భుజానికి బుల్లెట్ తగిలింది. మరో స్నేహితుడు తప్పించుకొని పారిపోయాడు. మైకేల్ అక్కడే కుప్పకూలిపోయి క్షణాల్లో మరణించాడు. పారిపోయిన మైకేల్ స్నేహితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
పోలీసులు మైకేల్ హత్య కేసు, అతని స్నేహితులను చంపేందుకు ప్రయత్నించినందుకు టైలర్ పై హత్యా యత్నం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం టైలర్ ని రిమాండ్ కు తరలించారు. మైకేల్ సమీపంలో మాసాపొనాక్స్ హై స్కూల్ లో చదువుకుంటున్నాడు. అతను ఫుట్ బాల్, రెజ్లింగ్ టీమ్ లో సభ్యుడు. మంచి భవిష్యత్తు ఉన్న మైకేల్ ప్రమాదవశాత్తు మరణించడంతో అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మైకేల్ చనిపయే తరువాతి రోజే అతడు హై స్కూల్ ప్రోమ్ వేడుకలకు తన గర్ల్ ఫ్రెండ్ తో వెళ్లాల్సి ఉంది. కానీ అంతలోనే విషాద ఘటన జరిగింది.