Indus Water Treaty| జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే ఉగ్రవాదులకు సాయం చేసిన పాకిస్తాన్ ను శిక్షించేందుకు ఎన్నడూ లేని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా అమలులో ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు మోదీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో క్యాబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఘటన అనంతరం పాకిస్తాన్ పై తీసుకునే చర్యల్లో ఒకటిగా భారత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అసలు ఈ సింధు జలాల ఒప్పందం ఏమిటి? దాని తాత్కాలిక నిలిపివేత పాకిస్థాన్‌పై ఎలా ప్రభావం చూపవచ్చనేది చర్చనీయంశంగా మారింది.
సింధు జలాల ఒప్పందం ఏంటి?
సింధు నదీ జలాల వినియోగానికి సంబంధించి భారతదేశం, పాకిస్థాన్ మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో 1960 సెప్టెంబర్ 19న ఒక ఒప్పందం కుదిరింది. చరిత్ర ప్రకారం ఆ రోజు పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్.. ఈ ఒప్పందానికి అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు. సింధు నది, దాని ఐదు ఉపనదులు అయిన.. ఝీలం, రావి,బియాస్, సట్లెజ్, చీనాబ్ లపై రెండు దేశాలకు ఉన్న హక్కులు, బాధ్యతలను ఈ ఒప్పందం స్పష్టంగా పేర్కొంది.
ఈ ఒప్పందం ప్రకారం.. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ జలాల వినియోగంపై భారతదేశానికి పూర్తి హక్కులు ఉన్నాయి. అయితే పశ్చిమ నదులైన సింధు, ఝీలం, చీనాబ్‌పై ప్రధాన హక్కులు పాకిస్థాన్‌కు ఉన్నప్పటికీ.. వాటిపై భారతదేశం నిర్దిష్ట పరిమితుల మధ్య జలవిద్యుత్ ఉత్పత్తి, గృహ వినియోగం, సాగు అవసరాల కోసం నీటిని వినియోగించకునేందుకు ఒప్పందం ప్రకారం అనుమతి ఉంది. ఈ ఒప్పందం అమలు కోసం, పర్యవేక్షణ, వివాద పరిష్కారానికి ‘శాశ్వత సింధు కమిషన్’ ఏర్పాటైంది.
ఒప్పందం తాత్కాలికంగా అమలు చేయకపోతే ఏం జరుగుతుంది?
భారత్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా అమలు చేయకపోవడం వల్ల పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇండస్ వాటర్ కమిషనర్‌గా పనిచేసిన ప్రదీప్ కుమార్ సక్సేనా.. ప్రస్తుతం భారత దేశానికి ఉన్న అవకాశాలను వివరించారు. “భారతదేశం ఎగువ ప్రవాహ దేశంగా ఉండడం వల్ల.. అవసరమైతే ఈ నిర్ణయం ఒప్పందం రద్దుకు తొలి అడుగు కావచ్చు” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒప్పందంలో రద్దు గురించి స్పష్టమైన నిబంధనలు లేకపోయినప్పటికీ.. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 62 ప్రకారం.. పరిస్థితుల్లో కీలకమైన మార్పులు వచ్చినపుడు ఒప్పందాన్ని ముగించవచ్చని ఆయన అన్నారు.
పాకిస్థాన్‌కు గట్టి దెబ్బ..
ఇక ఒప్పందం నిలిపివేయడంతో.. భారత్ నిర్మించిన లేదా నిర్మించబోయే ప్రాజెక్టులపై పాకిస్థాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం తగ్గుతుంది. ఉదాహరణకు.. కిషన్‌గంగ ప్రాజెక్టులో రిజర్వాయర్ ఫ్లషింగ్‌పై ఉన్న ఆంక్షలు ఇక ఉండకపోవచ్చు. అంటే, నీటిని అవసరమైనప్పుడే నిల్వ చేసుకోవచ్చు, ఇది పాకిస్థాన్ వ్యవసాయ కాలంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే, నీటి నిల్వపై, రిజర్వాయర్ల నిర్వహణపై ఉన్న నియంత్రణలు కూడా తొలగిపోతాయి. వరదల సమాచారం పాకిస్థాన్‌కు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇక భారత్‌కి ఉండదు. ఇది రుతుపవన కాలంలో పాక్‌కు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
Also Read: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ముస్లిం.. పోనీవాలాకు నివాళులర్పించిన కశ్మీర్ సిఎం
నీటి కొరత: వ్యవసాయం, తాగునీటి అవసరాలు, జలవిద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా సింధు, చీనాబ్, ఝీలం నదులపై పాకిస్థాన్ ఆధారపడి ఉంది. నీటి ప్రవాహం తగ్గితే, దేశవ్యాప్తంగా నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
ఆర్థిక వ్యవస్థపై దెబ్బ: నీటి సరఫరా కట్ చేస్తే.. వ్యవసాయ ఉత్పత్తి దెబ్బతిని, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముంది. విద్యుత్ ఉత్పత్తి తగ్గితే, పరిశ్రమలు, గృహ వినియోగంపై ప్రభావం పడుతుంది.
దౌత్య పరమైన సమస్యలు: ఈ చర్యపై పాకిస్థాన్.. ప్రపంచ బ్యాంకును, అంతర్జాతీయ న్యాయ సంస్థలను ఆశ్రయించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది భారత్–పాక్ మధ్య దౌత్యపరమైన వివాదాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. స్వాతంత్య్రం తర్వాత సింధు బేసిన్ విభజన సమస్యకు పరిష్కారంగా తయారైన ఈ ఒప్పందం.. ప్రస్తుతం ఉగ్రవాద దాడుల ఫలితంగా తిరిగి వివాదాస్పదంగా మారే అవకాశముంది.
ప్రాంతీయ ఉద్రిక్తతలు: ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సింధూ నది జలాల ఒప్పందం స్థిరత్వాన్ని ఇచ్చింది. ఇప్పుడు భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం, ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది. పరిస్థితులు ఉద్రిక్త మవుతయ్యే ప్రమాదమూ ఉంది.