Firing on Fishermen : శ్రీలంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి చేపల వేట సాగిస్తున్నరంటూ.. ఐదుగురు భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ కాల్పులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి విషయాల్లో మానవత్వంతో వ్యవహరించాలి తప్పా బలప్రయోగం ఆమోదయోగ్యం కాదంటూ హెచ్చరించింది. ఇప్పుటికే.. ఇరుదేశాల మధ్య చేపల వేట, మత్స్యకారుల విషయమై అమల్లో ఉన్న ఒప్పందాలను గౌరవించాలని, పాటించాలని సూచించింది. అలా కాదని.. అమాయక మత్స్యకారులపై కాల్పులు జరపడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బుధవారం నాడు భారత్ కు చెందిన తమిళ జాలర్లు శ్రీలంక వైపుగా చేపల వేటకు వెళ్లారు. వీరు అంతర్జాతీయ జలాల హద్దులు దాటి తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారనే కారణంగా.. జాలర్లపై లంక నేవీ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటన డెల్ఫ్‌ట్ దీవికి (Delft Island) సమీపంలో జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా ఇందులో.. ఇద్దరు భారత జాలర్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) న్యూదిల్లీలోని శ్రీలంక తాత్కాలిక హైకమిషనర్‌ను పిలిపించి నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బల ప్రయోగం, కాల్పులతో బెదిరించడం ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
డెల్ఫ్‌ట్ దీవికి (Delft Island) సమీపంలో మొత్తం 13 మంది భారతీయ మత్స్యకారులను లంక నావికా దళం నిర్బంధించింది. ఈ సమయంలోనే శ్రీలంక నావికా దళం కాల్పులు జరిపినట్లు భారత ప్రభుత్వానికి సమాచార అందింది. గాయపడిన ఇద్దరు జాలర్లు జాఫ్నా టీచింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు మత్స్యకారులకు స్వల్ప గాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తునట్లు తెలుస్తోంది.
మత్స్యకారులపై కాల్పుల విషయం తెలిసిన వెంటనే.. జాఫ్నాలోని భారత కాన్సులేట్ అధికారులు గాయపడిన మత్స్యకారులను ఆసుపత్రిలో పరామర్శించారు. వారికి కావాల్సిన అన్ని సదుపాయాల్ని సమకూర్చినట్లు తెలిపిన భారత అధికారులు, మత్స్యకారులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇదే విషయమై.. న్యూదిల్లీలోని శ్రీలంక తాత్కాలిక హైకమిషనర్‌ను మంగళవారం నాడు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. వారి దౌత్య అధికారి దగ్గర ఈ సంఘటన విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
కొలంబోలోని భారత హైకమిషన్ కూడా ఈ విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. జీవనోపాధి సమస్యలను దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులకు సంబంధించిన సమస్యలను మానవీయ, మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన అభిప్రాయపడింది. బలాన్ని ఉపయోగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న అవగాహనలను ఖచ్చితంగా పాటించాలి అంటూ విదేశాంక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ సంఘటన పాక్ జలసంధిలో వివాదాస్పద ఫిషింగ్ హక్కులపై భారత మత్స్యకారులు, శ్రీలంక నావికాదళం మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ఓ చిన్న ఉదాహరణే అంటున్నారు భారత జాలర్లు. భారత మత్స్యకారుల అరెస్టులు, నిర్బంధాలు నిరంతరం ఈ ప్రాంతంలో సాధారణంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకున్న 41 మంది భారతీయ జాలర్లను చెన్నై విమానాశ్రయానికి తరలించారు. వీరిలో రామనాథపురం జిల్లాకు చెందిన 35 మంది మత్స్యకారులను 2024 సెప్టెంబరు 8న కచ్చతీవు సమీపంలో సీమాంతర చేపల వేటపై అరెస్టు చేశారు. కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాల జోక్యాలతో వీరి విడుదల సాధ్యమైంది. అంతకు ముందు జనవరి 16, 2024లో నిర్బంధంలోని మరో 15 మంది భారతీయ మత్స్యకారులు విడుదలైయ్యి.. చెన్నైకి తిరిగి వచ్చారు. సెప్టెంబర్ 27న మన్నార్ ద్వీపానికి చెందిన ఎనిమిది మంది, నవంబర్ 11న నాగపట్నం జిల్లా నుంచి, 12వ తేదీన ఈ మత్స్యకారులను వేర్వేరు ఘటనల్లో అరెస్టు చేశారు.

Share