Iran – Syria : మధ్యప్రాశ్చ దేశమైన సిరియాలో సుదీర్ఘ అంతర్యుద్ధం ముగిసి బషల్ అల్ అసద్ నుంచి తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో.. అక్కడ అతివాద గ్రూపు.. ఇన్నాళ్లు తమకు వ్యతిరేకంగా వ్యవహరించిన దేశాలపై సరికొత్త డిమాండ్లతో ముందుకు వస్తోంది. అందులో భాగంగా.. ఇరాన్ దేశంలో తనకు 300 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో ఈ దేశాల మధ్య ఏం జరుగుతోందనే చర్య దౌత్య వర్గాల మధ్య జరుగుతోంది.
దాదాపు 13 ఏళ్లుగా సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇందులో.. బషర్ అల్ అసద్ పాలనకు ఇరాన్ పూర్తి మద్దతుగా నిలిచింది. తిరుగుబాటుదారుల్ని అణిచివేసేందుకు, వారిని తుడిచిపెట్టేసేందుకు అనేక రకాలుగా సహాయసహకారాలు అందించింది. కానీ.. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల్లో దేశంలోని అంతర్యుద్ధాన్ని కట్టడి చేయడంతో అసద్ విఫలమవ్వడంతో దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇక అధికారాన్ని చేపట్టిన కొత్త ప్రభుత్వం… ఇరాన్ ముందు నష్టపరిహార డిమాండ్ ను ఉంచింది. ఇరాన్ కారణంగా.. తన దేశానికి తీవ్ర నష్టం జరిగిందని అందుకు గానూ 300 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేసింది.
అంతర్యుద్ధం సమయంలో ఏకపక్షంగా వ్యవహరించడం, వారి మద్ధతున్న సాయుధ దళాల వల్ల సిరియా మౌలిక వసతులకు కలిగిన నష్టాన్ని భర్తి చేసేందుకు ఈ పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సొమ్ముల్ని రాబట్టుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తామని సిరియా పాలకులు ప్రకటించారు. దీంతో.. ఇరాన్ పై సిరియా మధ్యంతర ప్రభుత్వం ఒత్తిడిపై తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇదే సమయంలో సిరియా తనకు అప్పుపడిందని ఇరాన్ అధికారులు అంటున్నారు. బషల్ అల్ అసద్ పాలన సమయంలో దేశీయ అవసరాల కోసం వివిధ రూపాల్లో లబ్ధి పొందిందని చెబుతున్నారు. ఇందుకు గానూ ఇరాన్ ప్రభుత్వం 30 – 50 బిలియన్ డాలర్లను తిరిగి కోరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపించుకోవడం, నష్టపరిహారం, అప్పుల పేరుతో డబ్బుల్ని డిమాండ్ చేయడం ఆసక్తిగా మారింది.
అయితే.. సిరియాలో అంతర్యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ తీవ్ర ప్రయత్నాలే చేసింది. అసద్ పాలనకు మొదటి నుంచి మద్ధతుగా నిలిచిన ఇరాన్ పాలకులు.. అనేక రూపాల్లో సహాయసహకారాల్ని అందించారు. తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రత్యక్షంగా నిధుల్ని అందించడంతో పాటు చమురు రవాణా, సైనిక మద్దతు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టింది. 2012 మరియు 2021 మధ్యకాలంలో.. ఇరాన్ సుమారు $ 11 బిలియన్ డాలర్ల విలువైన చమురును సిరియాకు అందించిందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి లీకైన పత్రాల ద్వారా వెల్లడైంది.
ఇదే సమయంలో ఇరాన్ ఆర్థిక సహాయానికి ప్రతిగా వ్యూహాత్మక వాటాలను కోరింది. సిరియాలోని పరిశ్రమల్లో వాటాలు, చమురు క్షేత్రాలు, గనులు, పవర్ స్టేషన్లు, ఓడరేవుల్లో వాటాలు సహా అనేక రకాలుగా లబ్ధిపొందేందుకు ప్రయత్నించింది. కానీ.. అంతర్జాతీయంగా ఇరాన్ పై ఉన్న ఆర్థిక ఆంక్షల కారణంగా ఇరాన్ అనుకున్న మేర సిరియా నుంచి లబ్ధిని పొందలేకపోయిందని విశ్లేషకులు చెబుతుంటారు.
Also Read : ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం
అయితే ప్రస్తుతానికి ఇరుదేశాలు చేస్తున్న డిమాండ్లు కేవలం రాజకీయ ప్రకటనలుగానే చూడాలంటున్నారు విశ్లేషకులు. అక్కడి రాజకీయ అస్థిరత, సిరియాలోని మధ్యంతర ప్రభుత్వానికి UN గుర్తింపు లేకపోవడంతో ఈ వాదనలకు చట్టబద్ధత ఉండదు అంటున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) లేదా ద్వైపాక్షిక చర్చల ద్వారా మధ్యవర్తిత్వం వంటి మార్గాల ద్వారా పరిష్కారానికి అవకాశం లేదంటున్నారు. కాగా.. ప్రస్తుత ఇరుదేశాల ప్రకటనలను దౌత్యపరమైన ఉద్రిక్త, రెచ్చగొట్టే చర్యలుగానే అభివర్ణిస్తున్నారు.