No Need Canada Imports| కెనడా, మెక్సికో, చైనా లాంటి దేశాల నుంచి ఇకపై అమెరికాకు సరుకులు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని.. తాము స్వయం సమృద్ధి సాధిస్తామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు.
కెనడా, మెక్సికో దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాల పెంపు అమలును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయంపై ఆయన వెనక్కి తగ్గారు. ఆ దేశాల నుంచి దిగుమతి అయ్యే పలు సరకులపై సుంకాల పెంపు కార్యక్రమాన్ని ఒక నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కెనడా అగ్రరాజ్యంపై విధిస్తున్న సుంకాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ ఉత్పత్తులతో సంబంధం లేకుండా అమెరికా అడవుల్లోని కలపను వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కెనడాలోని ఒంటారియో ప్రిమియర్ అమెరికాకు కరెంటు సరఫరా నిలిపివేస్తామని బెదిరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిసింది.
కెనడాపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
‘కెనడా అధిక సుంకాలు విధిస్తుంది. మా దేశ పాల ఉత్పత్తులపై 250 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. కలపపై కూడా అత్యధికంగా సుంకాలు విధిస్తోంది. ఆ దేశ కలపపై ఆధారపడకుండా మా (అమెరికా) అడవుల్లోని కలపను వినియోగించేలా ఉత్తర్వులపై సంతకం చేస్తాను. మా దగ్గర అత్యుత్తమ కలప ఉంది. ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించుకోగలం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి పరస్పర సుంకాలు విధించనున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: ట్రంప్ మళ్లీ ఎసేశాడు.. ఈసారి పాకిస్తాన్‌కు ఝలక్
మెక్సికోపై సుంకాల వాయిదా
మెక్సికోకు సంబంధించిన పలు సరకులపై కూడా సుంకాల విధింపు కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బాతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్రమ చొరబాట్లు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు.
అమెరికా వాణిజ్య యుద్ధం
కెనడా, మెక్సికోతో పాటు చైనాపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ఆ దేశాలతో వాణిజ్య యుద్ధానికి దారితీసింది. దీంతో ఆ దేశాలు ప్రతీకార సుంకాలు విధించే పనిలో పడ్డాయి. అమెరికా నుంచి దిగుమతి అయ్యే 107 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై కెనడా 25 శాతం సుంకం విధించింది. ఈ క్రమంలో కెనడా ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో కొనసాగడానికి సుంకాల వివాదాన్ని ట్రూడో వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కెనడా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలని తాను ప్రయత్నించినప్పటికీ, అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు.
ట్రంప్ దెబ్బకు రిపోర్టర్ల ఎదుటే ఏడ్చేసిన కెనడా ప్రధాని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు బలంగా తాకింది. మరికొన్నాళ్లలో పదవి నుంచి వైదొలగనున్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘వ్యక్తిగతంగా నేను నిత్యం కెనడా ప్రయోజనాలే తొలి ప్రాధాన్యంగా పనిచేశాను. నాకు ప్రజల మద్దతు ఉంది. నా చివరి రోజుల్లో కూడా ప్రజలను వదిలేయలేదు. భవిష్యత్తులో కూడా వారిని కిందపడనీయను’’ అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక కెనడా, మెక్సికోకు అదనపు టారిఫ్‌ల నుంచి ఒక నెల రోజుల పాటు ట్రంప్ ఊరటనిచ్చిన విషయంపై చాలా నిస్పృహగా స్పందించారు.
రష్యాపై ఉక్రెయిన్ యుద్ధాన్ని, పశ్చిమ ఆసియా సంక్షోభాలు, ట్రంప్ ప్రభుత్వాన్ని కష్టకాల సమయంగా ట్రూడో అభివర్ణించారు. కెనడా ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తానని వెల్లడించారు. ట్రంప్ విధించిన సుంకాలు బలంగా ఎదుర్కొనేందుకు కెనడా కూడా ప్రతీకార సుంకాలు, ఇతర చర్యలను చేపడుతుందన్నారు.
సహకారం ముఖ్యమన్న ట్రూడో
“కెనడా, మెక్సికోలు సంపన్నంగా ఉంటేనే ‘అమెరికా ఫస్ట్’ సాధ్యమవుతుందని ట్రూడో అభిప్రాయపడ్డారు. మనలో (అభివృద్ధి చెందిన దేశాల్లో) ఒకరు విజయం సాధించి, మరొకరు ఓడిపోతే దారుణంగా ఉంటుందన్నారు. అంతకంటే ఇద్దరూ విజేతలుగా ఉండటమే మేలని అభిప్రాయపడ్డారు. అదే నిజమైన అంతర్జాతీయ సంబంధాలని ట్రూడో అభిప్రాయపడ్డారు. ట్రూడోకు కెనడాలో ప్రజాదరణ గణనీయంగా పడిపోయినట్లు సర్వేల్లో తేలడంతో జనవరి 6వ తేదీన లిబరల్ పార్టీ నేతగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.