Pakistan Jail Indian Suicide| ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 180 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్లలోనే మగ్గుతున్నారు. శిక్షా కాలం పూర్తైనప్పటికీ.. వీరంతా బందీల జీవితం గడపాల్సి వస్తోంది. వారి విడుదలకు ఆ దేశానికి చెందిన అధికారులు పలు కారణాలతో ఆలస్యం చేస్తూ వస్తున్నారని విమర్శలున్నాయి. ఈ సమయంలో మరో భారతీయ మత్స్యకారుడు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కస్టడీలో భారత మత్స్యకారుడు మృతిచెందడం గత రెండేళ్లలో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం.
గత రెండేళ్లలో సుమారు తొమ్మిది మంది భారతీయ మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో మృతిచెందినట్లు కథనాలు రావడం ఆందోళనకర విషయం. ఈ నేపథ్యంలో తాజాగా మరో భారతీయ మత్స్యకారుడు అక్కడ మృతి చెందారు. అది కూడా పాకిస్తాన్ జైల్లోని బాత్ రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు.
వాస్తవానికి భారత్ – పాకిస్తాన్ జల సరిహద్దులపై సరిగా అవగాహన లేకుండా చేపల వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కినవారు భారీ సంఖ్యలో ఉన్నారు. భారతీయ అధికారుల లెక్కల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1 నాటికి పాకిస్తాన్ జైల్లో సుమారు 266 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. ఇదే సమయంలో, భారత్ కు చెందిన మత్స్యకారుడు గౌరవ్ రామ్ ఆనంద్ (52) ను సరిహద్దులు అతిక్రమించాడని పాక్ బలగాలు 2022లో అదుపులోకి తీసుకున్నాయి. ఆ తరువా అతడిని అరెస్ట్ చేసి కరాచీ జైలుకు పంపారు. నాటి నుంచి ఆనంద్ అక్కడి జైల్లోనే మగ్గుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాత్ రూమ్ లోకి వెళ్లిన ఆయన, తాడుతో ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
అతడు బాత్ రూమ్ కి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానించిన జైలు అధికారి లోపలకు వెళ్లి చూడగా.. అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఈ విషయం.. పైఅధికారులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసేంతవరకూ మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్ లో ఉంచనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
Also Read: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 50 వేల ఎకరాల అడవి దహనం.. 27 మంది మృతి
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది. ఈ లెక్కల ప్రకారం పాకిస్తాన్ జైళ్లలో భారతీయ ఖైదీలు 266 మంది ఉండగా, భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన ప్రభుత్వం చెబుతోంది.
జనవరిలోనూ పాక్ జైలులో ఓ భారతీయుడు మృతి
జనవరి 2025లో ఇలాగే ఒక భారతీయుడు పాకిస్తాన్ జైలులో మరణించాడు. శిక్షా కాలం పూర్తయినప్పటికీ విడుదల చేయడంలో జాప్యం కారణంగా ఓ భారత మత్స్యకారుడు పాకిస్తాన్ జైల్లో ప్రాణాలు కోల్పోయాడు.
భారత్ కు చెందిన మత్స్యకారుడు బాబును 2022లో ఓ కేసులో పాకిస్తాన్ అధికారులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అతడు కరాచీలోని ఓ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో అతడి శిక్షా కాలం ఇటీవలే పూర్తయింది. అయినప్పటికీ బాబును విడుదల చేయకుండా పాకిస్తాన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈక్రమంలోనే జనవరి 23న, అతడు జైల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు భారత ప్రభుత్వానికి చెందిన అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, అతడి మరణానికి గల కారణాలు తెలియరాలేదు.