PM Modi Pakistan Lex Fridman|భారత్ పొరుగుదేశమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. వారితో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా.. అవి విఫలమయ్యాయని అన్నారు. ప్రతిసారి శాంతి చర్చలు చేసినప్పుడు, ద్రోహమే ఎదురైందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ఎప్పటికైనా జ్ఞానోదయం పొంది, శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.
అమెరికాకు చెందిన కృత్రిమ మేధా పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్ మ్యాన్ పాడ్ క్యాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడారు. “నా శక్తి పేరులో లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలోనే ఉంది. నేను ప్రపంచ నేతలతో చేయి కలిపినప్పుడు, అది మోదీ చేస్తున్నది కాదు, 140 కోట్ల మంది భారతీయులు చేస్తున్నట్లే. శాంతి గురించి మేం మాట్లాడినప్పుడు, ప్రపంచం మా మాట వింటుంది. ఎందుకంటే గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ జన్మించిన నేల ఇది,” అని ఆయన అన్నారు.
Also Read: ఇండియాను ఫాలో అవుతున్న ట్రంప్.. అమెరికాలో వారికి ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు!
2014లో భారత్, పాకిస్తాన్ కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో.. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని ప్రధాని మోదీ తెలిపారు. శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారి శత్రుత్వం, మోసమే ఎదురైందని ఆయన అన్నారు. ఇప్పటికీ నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది. శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రజలు శాంతి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని, కలహాలు, అశాంతితో వారు అలసిపోయారన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా తాను ప్రధాని అయిన తరువాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి దౌత్యపర సంకేతాలు ఇచ్చామని ప్రధాని మోదీ చెప్పారు. విదేశాంగ విధానంపై గతంలో తన విధానాన్ని ప్రశ్నించినవారు, సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడాన్ని చూసి ఆశ్చర్యపోయారని గుర్తుచేశారు. భారత విదేశాంగ విధానం ఎంత పటిష్ఠంగా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనమన్నారు. శాంతి, సామరస్యానికి భారత్ నిబద్ధతతో ఉందని ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపిందని, అయినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని అన్నారు.
“దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలకు అడుగులు వేశాం. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు, అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలలో అందంగా రాసుకున్నారు,” అని మోదీ పేర్కొన్నారు.
చైనాతో పోటీ ఎప్పుడూ ఉంటుంది..
విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవడంపైనే తమ దృష్టి ఉంటుందని, అసమ్మతికి బదులు చర్చలకే తాము ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ.. భారత్, చైనా ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామని అన్నారు. పోటీతత్వం చెడు కాదని, అది ఎన్నడూ సంఘర్షణకు దారి తీయకూడదన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాల సహకారం ఎంతో అవసరమని ఉద్ఘాటించారు.