Putin Warns Trump Safety| “అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలివి, అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు, కానీ ఆయన ప్రమాదంలో ఉన్నారు. ఆయనకు ప్రాణహాని ఉంది” అని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. గురువారం కజకస్తాన్ లోని ఒక సమావేశంలో పాల్గొన్న తరువాత పుతిన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆ సమయంలో పుతిన్ మాట్లాడుతూ.. “ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులు ఆయనతో పోరడడానికి అనాగరికంగా ప్రవర్తించారు. ఆయనను హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. ఒకసారి కాదు పలుమార్లు. నా దృష్టిలో ఆయనకు ప్రాణ హాని ఉంది. అమెరికా చరిత్రలో ఇలాంటి బాధాకరమైన ఘటనలు చాలా జరిగాయి. ట్రంప్ ఒక తెలివైనవారు అని నమ్ముతున్నాను. ఈ విషయాల్లో ఆయన జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను.” అని చెప్పారు.
జూలై నెలలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వేదికపై ఉన్న సమయంలో ఆయనపై కాల్పుుల జరిగాయి. సెప్టెంబర్ నెలలో ఫ్లోరిడాలోని ఒక గోల్ఫ్ కోర్స్ లో ట్రంప్ ఉన్న సమయంలో ఒక వ్యక్తి ఆయనపై తుపాకీతో గురి చూస్తుండగా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి.
Also Read: కాల్పుల విరమణ తూచ్.. లెబనాన్‌పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్!
పుతిన్ పై కూడా ఆయన రాజకీయ శత్రువులు చాలాసార్లు హత్యయత్నాలు చేశారు. ట్రంప్ పై జరిగిన హత్యయత్నం గురించి గతంలో కూడా పుతిన్ మాట్లాడారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్ కుటుంబం, ఆయన పిల్లలపై కూడా రాజకీయంగా విమర్శలు చేయడాన్ని పుతిన్ తప్పుబట్టారు. రష్యాలో అయితే ఎంతటి బందిపోటు దొంగలైనా కుటుంబాలపై దాడులు చేయరని అన్నారు.
ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ క్షిపణుల సాయం చేయడంపై పుతిన్ స్పందించారు. “బైడెన్ చర్యలతో యుద్ధం ఇంకా తీవ్రమవుతుంది. ఇది ట్రంప్ ఒకరకంగా ఉపయోగపడుతుంది. బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ రద్దుచేస్తారు. లేదా బైడెన్ చేసిన తప్పులకు ట్రంప్ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ సమస్యకు పరిష్కారం కోసం ట్రంప్ ప్రయత్నిస్తే.. ఆయనతో చర్చలకు రష్యా సిద్ధంగా ఉంది” అని తెలిపారు.
మరోవైపు బైడెన్ తన పదవికాలం ముగిసేలోపే ఉక్రెయిన్ కు వీలైనంత ఎక్కువ ఆర్థిక సాయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఆయన ప్రభుత్వం ఉక్రెయిన్ కోసం దూరశ్రేణి భారీ క్షిపణుల కోసం 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఆయుధాలు సమకూర్చుకోవడంతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైన్యంలో ఎక్కువమంది యువకులను భర్తీ చేయాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. సైన్యంలో చేరే యువకులు సంఖ్య 25 నుంచి తగ్గించి 18 చేయాలని దీంతో సైన్యంలో ఎక్కువ మంది యువతని భర్తీ చేయవచ్చని తెలిపింది. కానీ జెలెన్‌స్కీ గతంలో ఇలాంటి నిర్ణయాలకు దూరంగా ఉన్నారు. బైడెన్ పదవికాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఈ సమయంలోనే రష్యాపై వీలైనంత ఒత్తిడి చేయాలని ఆయన భావిస్తున్నారు.