StarGate AI Project | క్యాన్సర్ మహమ్మారిని సమర్థవంతంగా గుర్తించి, 48 గంటల్లోనే వ్యాక్సిన్‌ను కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా తయారుచేసే అవకాశం ఉందని టెక్నాలజీ దిగ్గజాలు ఓపెన్‌ఏఐ, సాఫ్ట్‌బ్యాంక్, ఒరాకిల్ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ టెక్ దిగ్గజ కంపెనీలన్నీ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్న ‘స్టార్‌గేట్’ అనే ఏఐ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఇది సాధ్యమేనని తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. స్టార్ గేట్ అనే పేరుతో ఈ ప్రాజెక్టును బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఒరాకిల్ సీఈఓ ల్యారీ ఎల్లిసన్, సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కొత్త వెంచర్‌కు సంబంధించిన కీలక వివరాలను ట్రంప్ ప్రకటించారు. ‘స్టార్‌గేట్’ ప్రాజెక్ట్ ద్వారా టెక్సాస్‌లోని పెద్ద డేటా సెంటర్ల సాయంతో కృత్రిమ మేధ (AI)లో విప్లవాత్మక ఆవిష్కరణలు చేపట్టాలని, ఇందుకోసం 500 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో 43 లక్షల కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 10 డేటా సెంటర్లు నిర్మించిన ఈ సంస్థలు త్వరలో ఈ సంఖ్యను 20కి పెంచాలని నిర్ణయించినట్లు తెలిపాయి.
Also Read: టిక్ టాక్ ఇక మస్క్ చేతికి?.. విక్రయించే యోచనలో చైనా
ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్ట్ వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అంతేకాక, క్యాన్సర్‌ను వేగంగా గుర్తించడానికి, అలాగే సరైన సమయంలో నయం చేయడానికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది” అని అన్నారు. అలాగే సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ ఈ ప్రాజెక్ట్‌ను అమెరికా స్వర్ణ యుగానికి అరంభంగా వర్ణించారు.
అనంతరం, ఒరాకిల్ సీఈఓ ల్యారీ ఎల్లిసన్ క్యాన్సర్‌ను నిర్ధారించే విధానం గురించి వివరించారు. “క్యాన్సర్ ట్యూమర్స్ రక్తంలో తేలియాడుతున్నప్పటికీ, ఏఐ సాయంతో అవి ముందుగానే గుర్తించబడతాయి. ఇవి గుర్తించిన తరువాత, రక్తపరీక్షల ద్వారా క్యాన్సర్‌ను త్వరగా నిర్ధారించవచ్చు. ఆ తర్వాత, వ్యక్తికి వ్యాక్సిన్ అందించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ను ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో తయారుచేస్తాం, ఇది 48 గంటల్లోనే పూర్తి అవుతుంది” అని ఆయన చెప్పారు.
ఎద్దేవా చేసిన ఎలన్ మస్క్
భారీ ఏఐ ప్రాజెక్టు ప్రారంభ ప్రకటన చేసిన ఓపెన్ ఏఐ కంపెనీపై ప్రపంచలోనే అత్యంత ధనవంతుడు అయిన ఎలన్ మస్క్ ఎద్దేవా చేస్తూ కామెంట్ చేశారు. 500 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు ఖర్చు చేస్తామని ఓపెన్ ఏఐ సిఈఓ శామ్ ఆల్ట్ మెన్ ప్రకటించగా.. అంత డబ్బు వారి వద్ద లేదని మస్క్ చురకలంటిస్తూ.. ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్ కు చెందిన ఎంఎన్‌సి సాఫ్ట్ బ్యాంక్ పెద్ద ఎత్తున నిధులు సమీకరిస్తుండగా.. ఒరాకిల్, ఎంజిఎక్స్, మైక్రోసాఫ్ట్, ఎన్‌విడియా లాంటి కంపెనీలో తమ వంతు వాటాతో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కోసం తొలివిడతలో వీరంతా కలిసి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు సమకూర్చినట్లు తెలిపారు. మిగతా 400 బిలియన్ డాలర్లు మరో నాలుగు సంవత్సరాల్లో విడతల వారీగా సమకూరుస్తామని ఈ కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
అయితే ఓపెన్ ఏఐతో విభేదాల కారణంగా వేరుపడిన ఎలన్ మస్క్ ఈ కంపెనీలన్నీ కలిసినా అంత ధనం సమకూర్చలేవని ఎద్దేవా చేశారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ భారీ ఏఐ ప్రాజెక్ట్ కు సహకరిస్తుండగా.. ఆయన సన్నిహితుడైన మస్క్ మాత్రం ఈ ప్రాజెక్ట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోస్ట్ లు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.