Top 10 Wealthiest Countries : మనకు శక్తివంతమైన దేశాలు, ప్రమాదకర దేశాలూ తెలుసు. మరి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపాదిస్తున్న ప్రజలున్న ధనిక దేశాలు ఏవో తెలుసా. ఇంకేముంటాయి.. అగ్రరాజ్యం అమెరికా, చైనా అనుకుంటున్నారా.? అయితే.. మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. దేశాల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ధనిక దేశాలుగా ఉండడం వేరు.. ఆ దేశంలోని ప్రజల సగటు సంపాదన, కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండడం వేరు. వాస్తవానికి దేశాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటేనే.. ఆ దేశాలు శక్తివంతమైనవని అర్థం. మరి.. అమెరికా వంటి దేశాన్ని కూడా వెనక్కి నెట్టి ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచిన దేశాలేంటో, అక్కడి ప్రజల కొనుగోలు సామర్థ్యం ఏంటో తెలుసా.. లేదంటే ఈ స్టోరీ చదివేయండి.
2025లో వివిధ దేశాల ఆర్థిక స్థితిగతుల్ని, పరిస్థితుల్ని పరిశీలించిన తర్వాత GDP ప్రకారం అత్యంత ధనిక దేశాలతో పాటుగా తలసరి కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ప్రకారం అత్యంత సంపన్న దేశాలను హైలైట్ చేసింది. ఈ జాబితాలో మనం అనుకుంటున్న అమెరికా, చైనా, భారత్ వంటి స్థానాలు వెనకే ఉంటున్నాయి. మరి మనం అనుకోని దేశాలు, మనకు తెలియని దేశాలు ఈ జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్నాయి. అదేగా విచిత్రం అంటే.. దేశాల ఆర్థిక బలాలు, అక్కడి ప్రజల ఆర్థిక బలాల్ని అంచనా వేస్తూ విడుదల చేసిన ఈ బాబితాలో చోటు సంపాదించిన దేశాలను, అక్కడి ప్రజల సగటు వార్షిక సంపాదన గురించి తెలుసుకోండి.
1. లగ్జెంబర్గ్
ఆ జాబితాలో మొదటి స్ధానంలో నిలుస్తున్న దేశం ఏంటో తెలుసా.. లగ్జెంబర్గ్. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? అవును.. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంపాదన ఉంది ఇక్కడి ప్రజలకే. అందుకే.. జాబితాలో లగ్జెంబర్గ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ సగటున పౌరుల ఏడాది సంపాదన ఎంతో తెలుసా.. 1,54,910 డాలర్లు, అంటే మన కరెన్సీలో.. ప్రస్తుత మార్పిడి ప్రకారం దాదాపుగా రూ. 1.27 కోట్లు. అవును.. ఇక్కడి ప్రజలు ఏడాదికి ఇంత మొత్తంలో సంపాదిస్తుంటారు. లగ్జెంబర్గ్ యూరోపాలోని అతిచిన్న దేశమే అయినా.. అధిక జీవన ప్రమాణాలతో ప్రశాంతమైన, సురక్షితమైన దేశం. ఇక్కడ ఫైనాన్స్ అంటే బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, స్టీల్ ఉత్పత్తి, టెక్, టూరిజం రంగాల ద్వారా ప్రజలు ఉపాధీ పొందుతుంటారు. అందుకే.. ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్ని సైతం వెనక్కి నెట్టేసి.. ముందు వరుసలో నిలుస్తోంది.
2. సింగపూర్
అత్యంత సంపన్న దేశాల్లో రెండో స్థానంలో నిలుస్తోంది.. సింగపూర్. ఇక్కడి ప్రజల తలసరి జీడీపీ ఎంతో తెలుసా.. రూ.1.33 కోట్లు. ఏడాదిలో అక్కడి ప్రజల సగటు సంపాదనే ఇంత మొత్తంలో ఉంటుంది అంట. అత్యంత పరిశుభ్రమైన, ఆర్థికంగా బలమైన దేశాల్లో సింగపూర్.. మిగతా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంటుంది. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాల్ని నడిపించేందుకు.. చాలా దేశాల పారిశ్రామిక వేత్తలు పోటీ పడుతుంటారు.
3. మకావ్
చైనా ప్రత్యేక పరిపాలన ప్రాంతమైన మకావ్.. ప్రపంచంలోని అత్యధిక ఆదాయ దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ సగటు పౌరుడి ఆదాయం $140,250, అంటే సుమారు ₹1.15 కోట్లు. ప్రపంచంలోనే అతిపెద్ద కాసినో, గేమింగ్ హబ్‌గా పేరొందిన మకావ్, పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాల్లో అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తోంది.
4. ఐర్లాండ్
యూరోప్‌లో ఉన్న ఐర్లాండ్.. జనాభా ప్రపంచంలో ఎక్కువ ఆదాయం ఉన్న జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక్కడ సగటు వార్షిక ఆదాయం $131,550, అంటే సుమారు ₹1.08 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలైన గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కంపెనీలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. తక్కువ కార్పొరేట్ టాక్స్ ఉండటం ఇక్కడి ఆర్థిక స్థితిని బలోపేతం చేశాయి.
Also Read : Pakistan train hijack: పాకిస్తాన్ ట్రైన్ హైజాక్.. 27 మిలిటెంట్లు, 30 సైనికులు మృతి.!
5. ఖతర్
ఇక.. ఎక్కువగా సంపాదిస్తున్న జనాభా ఉన్న దేశంగా అరబ్ దేశమైన ఖతర్.. ఈ జాబితాలో చోటు సంపాదించింది. ఇక్కడ సగటు ఆదాయం $118,760, అంటే మన కరెన్సీలో సుమారు ₹97 లక్షలు. ఖతర్ ప్రధానంగా చమురు & నేచురల్ గ్యాస్ ఉత్పత్తుల ద్వారా సంపదను పొందుతోంది. తక్కువ జనాభా, అధిక ఆదాయ వనరుల కారణంగా ఖతర్ ప్రజల సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు నాణ్యమైన జీవన ప్రమాణాల్ని అందుకుంటున్నారు.
6. నార్వే
ప్రపంచంలోని అత్యధిక జీవన ప్రమాణాలు ఉన్న దేశాల్లో నార్వే కూడా ఒకటి. ఇక్కడ సగటు ఆదాయం $106,540, అంటే సుమారు ₹87 లక్షలు. నార్వే చమురు, గ్యాస్, ఫిషింగ్, హైటెక్ ఇండస్ట్రీలలో ముందంజలో ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇక్కడి ప్రజలకు భద్రత కల్పిస్తున్నాయి. ఈ దేశం చిన్నదైనా, ప్రపంచంలోనే అత్యంత అధిక ఆదాయం ఉన్న దేశాల్లో ఒకటిగా జాబితాలో స్థానం సంపాదించింది.
7. స్విట్జర్లాండ్
బ్యాంకింగ్, టెక్నాలజీ రంగంలో అగ్రగామి దేశాల్లో ఒకటైన స్విట్జర్లాండ్ అత్యంత ధనిక దేశాల్లో ఏడో స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ సగటు ఆదాయం $98,140, అంటే సుమారు ₹80 లక్షలు. ప్రపంచంలోని బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్, హైటెక్ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ప్రజలు అధిక ఆదాయంతో హాయిగా జీవిస్తున్నా, దేశంలో జీవన ప్రమాణ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. సంపాదనకు తగ్గట్టుగానే ఖర్చులు భారీగా ఉంటుంటాయి. ఎవరైనా.. విదేశీ పర్యాటకులు ఇక్కడికి వెళితే.. ఖర్చు గట్టిగానే అవుతుంటుంది మరి.
8. బ్రూనై దారుస్సలాం
అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అంచనాలు, గణాంకాల ప్రకారం.. అతిచిన్న దేశమైన బ్రూనైలో.. ప్రజల సంపాదన భారీగానే ఉంటోంది. సంపాదన వారీగా చూస్తే.. ఇక్కడి ప్రజలు.. ప్రపంచంలోనే ఎనిమిదో అత్యంత ఎక్కువ సంపాదిస్తున్న ప్రజలు. ఇక్కడ సగటు ఆదాయం $95,040 డాలర్లుగా ఉంది. అంటే సుమారు ₹77 లక్షలు. సగటున ఇక్కడ ప్రజలు.. ఏడాదికి ఇంత మొత్తం సంపాదిస్తుంటారు. చమురు & గ్యాస్ రంగాల్లో ప్రధానంగా ఆదాయాన్ని పొందుతున్న ఇక్కడ ప్రజలు.. అనేక సేవల్లో ప్రభుత్వమే ఉచితంగా సేవలు అందిస్తుంది. పైగా.. ఇక్కడి ప్రజలు తక్కువ పనితో అధిక ఆదాయాన్ని పొందుతున్న జాబితాలో ముందు స్థానాల్లో నిలుస్తున్నారు.
9. గయానా
అమెరికా, చైనా వంటి బడా దేశాలు చోటు సంపాదిస్తాయనుకున్న జాబితాలో.. అవి కాకుండా అనేక దేశాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. వాటిలో.. దక్షిణ అమెరికాలోని గయానా తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ సగటు ఆదాయం $91,380, అంటే సుమారు ₹74 లక్షలు. గయానా చమురు & గనులు ద్వారా అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోంది.
10. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా.. అత్యంత ఎక్కువ సంపాదిస్తున్న పౌరులున్న దేశాల్లో పదో స్థానంలో నిలుస్తుంది. ఇక్కడి ప్రజల సగటు తలసరి ఆదాయం పరంగా $89,680 డాలర్లుగా ఉన్నారు. అంటే.. సుమారు రూ.72 లక్షలు సంపాదిస్తున్నారు అన్నమాట. టెక్నాలజీ, ఫైనాన్స్, ఇండస్ట్రీ, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. అయినా.. ఇక్కడి ప్రజలు సంపాదన పరంగా చూసే… ప్రపంచంలోనే పదో స్థానంలో ఉన్నారు.
ఇక.. భారత్ విషయానికి వస్తే… ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. తలసరి GDPలో వెనుకబడి ఉంది. ఇక్కడ జన సంఖ్య ఎక్కువగా ఉండడంతో దేశ జీడీపీ భారీగానే ఉంటుంది కానీ.. వ్యక్తిగత ఆదాయం విషయానికి వస్తే మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ తలసరి GDP $11.94 వేలుగా ఉండటంతో జాబితాలో చాలా వెనుకబడి ఉంది. ఈ జాబితాలో 124వ ర్యాంకును దక్కించుకుంది.
ఎలా నిర్థరిస్తారు.?
స్థూల దేశీయోత్పత్తి (GDP) ఒక దేశం మొత్తం ఆర్థిక ఉత్పత్తిని సూచిస్తుంది. అంటే ఇందులో.. దేశంలో మొత్తంగా ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువను గణిస్తుంటారు. అలా వచ్చిన దేశ GDPని ఆ దేశంలోని జనాభాతో భాగిస్తే సగటు సంపదపై స్పష్టత వస్తుంది. అంటే.. ఆ సంపదను దేశంలోని ప్రజలందరికీ సమానంగా పంచితే, సగటున ఒక్కొక్కరి సంపాదన ఎంత అనేది తెలుస్తుంటుంది. అత్యంత ధనవంతమైన దేశాలు అని అంటే సాధారణంగా మొత్తం జీడీపీ (Total GDP) పరంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలను సూచిస్తారు. అందుకే.. అత్యంత ధనిక దేశాలు, అత్యంత తలసరి జీడీపీ ఉన్న దేశాలు వేరువేరుగా ఉంటుంటాయి.
Also Read : Ukraine Agrees Cease Fire: అమెరికా ఒత్తిడికి లొంగిన ఉక్రెయిన్.. యుద్ధం ఆపడం ఇక రష్యా చేతుల్లో