Trump 24 Hours Ukraine War Stop| తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని (Russia Ukraine war) ఒక్క రోజులోనే ఆపేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధ్యక్ష పదవిలో ఉన్న ఆయన ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మాటల్లో కొంచెం వ్యంగ్యం దాగి ఉందని.. అత్యుత్సాహం చూపానని తాజాగా అంగీకరించారు. అయితే యుద్ధ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నానని.. ఆ దిశగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు (Trump on Russia Ukraine war).
అతిశయోక్తి కలిగించే ప్రకటనలు చేయడం ఆయనకు కొత్తేం కాదు. అయితే యుద్ధం గురించి అలా చేసిన వ్యాఖ్యను ఆయన అంగీకరించడం గమనార్హం. ‘ఫుల్ మెజర్’ టెలివిజన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ట్రంప్ స్పందించారు. గతంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిసేలోగా యుద్ధం కొలిక్కి రాకపోతే.. నేను అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైతే.. ఒక్క రోజులో శాంతి పరిష్కారాన్ని చూపుతా. సులభమైన చర్చలతో రెండు దేశాల మధ్య వివాదానికి తెర పడుతుంది’’ అని తెలిపారు. 2020లోనే తాను మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి ఉంటే.. ఈ సంక్షోభం ఏర్పడేదే కాదన్న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: లొంగిపోతే వదిలేస్తాం లేకపోతే.. ఉక్రెయిన్ సైనికులకు పుతిన్ వార్నింగ్
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు స్వయంగా వెల్లడిస్తూ హర్షం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణకు సంబంధించి రష్యా నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని, మాస్కోతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని అన్నారు. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌ను కనికరించాలని పుతిన్‌కు తాను విజ్ఞప్తి చేసినట్లు ఈసందర్భంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించిన సంగతి తెలిసిందే.
అమెరికాలో మోదీకి గుంతలు కనిపించకూడదనుకొన్నా : ట్రంప్
ట్రంప్ (Donald Trump) అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి అనూహ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో భేటీ అయ్యేందుకు అమెరికాకు వచ్చిన భారత ప్రధాని మోదీ, ఇతర ప్రపంచ నేతలకు టెంట్లు, గ్రాఫిటీ (రాతలు), గుంతలు కనిపించకూడదనుకొన్నామన్నారు. అందుకే రాజధాని వాషింగ్టన్ డీసీ (Washington DC) నగరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు.
‘‘మేం మా నగరాన్ని శుభ్రం చేస్తున్నాం. నేరాలు లేకుండా చూసుకుంటాం. ఇక్కడ రాసే రాతలను చెరిపేస్తాం. ఇప్పటికే గుడారాలను తొలగిస్తున్నాం. దీనిపై అధికారులతో కలిసి పని చేస్తున్నాం. వాషింగ్టన్ డీసీ మేయర్ ఈ విషయంలో మంచి పనితీరు చూపించారు. స్టేట్ డిపార్ట్‌మెంట్ కార్యాలయం ఎదురుగా ఉన్న టెంట్లు నగరా అందాన్ని చెడగొడుతున్నాయని మేం చెప్పగానే ఆయన వాటిని తొలగించారు. ప్రపంచం మొత్తం చర్చించుకునేలాంటి రాజధానిని మేం కోరుకుంటున్నాం’’ అని ట్రంప్ వెల్లడించారు.
‘‘భారత ప్రధాన మంత్రి మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, యూకే ప్రధాని కార్మార్ వీరంతా ఇటీవల అమెరికా పర్యటనకు వచ్చారు. వారు వచ్చినప్పుడు టెంట్లు, గ్రాఫిటీ, విరిగిన బారికేడ్లు, రోడ్లపై గుంతలు ఉండకూడదనుకున్నాను. అలాగే అవి లేకుండా సుందరంగా మార్చగలిగాం. వాషింగ్టన్ డీసీని నేర రహిత రాజధానిగా మార్చనున్నాం. ప్రజలు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు వారు ఎలాంటి నేరాల బారినపడకుండా చూసుకుంటాం. ఎప్పుడూ లేనంత శుభ్రంగా, మెరుగ్గా, సురక్షితంగా తీర్చిదిద్దుతాం. పూర్తిస్థాయిలో అలా మార్చేందుకు మాకు ఎక్కువ సమయమేమీ పట్టదు’’ అని అన్నారు.
ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ట్రంప్-మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఆయన రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన వారాల వ్యవధిలోనే పలు దేశాల నాయకులతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్, జపాన్ ప్రధానులు, జోర్డాన్ రాజుతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో పలువురు అధినేతలు రానున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందన వచ్చింది.