Trump vs Zelenskyy : రెండు ధృవాల ప్రపంచంలో అమెరికా ఓవైపు ఉంటే.. రష్యా మరోవైపు. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా అనేక విషయాలో పోటీ, ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తూనే ఉంది. రెండేళ్ల క్రితం మొదలైన ఉక్రెయిన వార్ కూడా ఇందులో ఓ భాగమే. రష్యాను ఆర్థికంగా వెన్నువిరిచేందుకు ఉక్రెయిన్ కు కొండంత అండగా నిలిచి, ఆయుధాలు, ఆర్థిక భరోసా కల్పించిన ఆమెరికా.. ట్రంప్ కారణంగా సరికొత్త పల్లవి అందుకుంది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక వివాదాస్పద, తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్.. తాజాగా ఉక్రెయిన అధ్యక్షుడు జెలెన్స్కీని నియంత అంటూ తీవ్రంగా విమర్శించారు. ఆయన అమెరికా డబ్బులు తీసుకుని.. తన దేశాన్ని యుద్ధ సంక్షోభంలోకి మరింతగా నెడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో.. అసలు ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుంది అంటూ అంతర్జాతీయంగా ఆసక్తి ఏర్పడింది.
రెండేళ్లకు పైగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ చర్చల విషయంలో ట్రంప్ – జెలెన్స్కీకి మధ్య విభేదాలు తలెత్తాయి. అవి తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జెలెన్స్కీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. జెలెన్స్కీనే యుద్ధాన్ని ప్రారంభించిందన్న ట్రంప్ వాదనలను.. ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత ట్రంప్ మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. ఇటీవల సౌదీ రాజధాని రియాద్‌లో జరిగిన రష్యా-అమెరికా చర్చల్లో జెలెన్స్కీని స్థానం కల్పించకపోవండతో.. ఆయన ఈ చర్చలను వ్యతిరేకించారు. దాంతో.. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది.
జెలెన్స్కీ గురించి ట్రంప్ ఏం అన్నారు?
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ లో ఓ పోస్ట్ చేసిన ట్రంప్.. గెలిచే అవకాశం లేని, అసలు ప్రారంభించాల్సిన అవసరం లేని యుద్ధం చేసేందుకు అమెరికాను $350 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని అడిగారు అంటూ విమర్శించారు. అక్కడ ఖర్చు చేసిన నిధుల గురించి మాట్లాడుతూ.. యూరోప్ కంటే అధికంగా $200 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నారు. అతను ఉక్రెయిన్ లో ఎన్నికలకు అనుకూలంగా లేడన్న ట్రంప్.. బైడెన్ ను పొగడడంతోనే కాలం గడిపేశారంటూ వ్యాఖ్యానించారు.
అతను ఓ నియంతలా ఎన్నికలు లేకుండా పరిపాలించాలని భావిస్తున్నారు అంటూ విమర్శించారు. కానీ.. రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా విజయవంతంగా చర్చలు జరుపుతోందని, బైడెన్ ఈ పని ఎప్పుడూ చేయలేదని అన్నారు. మయామిలో సౌదీ మద్దతుగల ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ (FII) ఇన్‌స్టిట్యూట్ సమ్మిట్ సందర్భంగా వేదికగా చర్చలు జరపడాన్ని ట్రంప్ స్వాగతించారు. ఈ చర్చలకు అమెరికా, రష్యన్ అధికారులు హాజరయ్యి.. చర్చలు జరిపారు.
Also Read : Pope Francis : విషమంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం – చివరిగా ఆయనేమన్నారంటే.?
మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై మాస్కో దాడి చేసిన తర్వాత తొలిసారి.. రష్యా-అమెరికా దౌత్యవేత్తలు ముఖాముఖి చర్చలు జరిపారు. నాలుగు గంటల చర్చల తర్వాత.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత ఘోరమైన సంఘర్షణను ముగించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని రెండు వర్గాలు అంగీకారానికి వచ్చాయి. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత.. చరిత్రలోనే అత్యంత దారుణ స్థాయికి పడిపోయిన దౌత్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చారు.