Trump Warning Hamas| అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హమాస్ పై లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. తమ వద్ద మిగిలి ఉన్న ఇజ్రాయెల్ బందీలను వెంటనే విడుదల చేయాలని హమాస్ కు హెచ్చరించారు. లేకుంటే వారి అంతు చూస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే తన చివరి హెచ్చరిక అని కూడా పేర్కొన్నారు.
హమాస్ విడుదల చేసిన ఎనిమిది మంది బందీలతో ఇటీవల ట్రంప్ వైట్ హౌస్ లో సమావేశం జరిపారు. ఆ తర్వాత ఆయన ఎక్స్ (Twitter) లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. “హలోనా? గుడ్ బైనా?.. ఏదో మీరే ఎంచుకోండి. బందీలందరినీ వెంటనే విడుదల చేయండి. మీరు చిధ్రం చేసిన కొందరు బందీలను నేను కలిశాను. ఇదే మీకు నా చివరి హెచ్చరిక. గాజాను వెంటనే వీడండి. ఇదే మీకు చివరి అవకాశం. మీరు చంపిన వారి మృతదేహాలను కూడా తిరిగి అప్పగించండి. లేకుంటే మీ కథ ముగిసినట్లే. మానసిక ఉన్మాదులు మాత్రమే ఇలా మృతదేహాలను తమ వద్ద ఉంచుకుంటారు. నేను చెప్పింది చేయకుంటే, ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగలడు. అందుకే.. పని పూర్తి చేయడానికి అవసరమైన వన్నీ ఇజ్రాయెల్ కు పంపుతున్నాను. ” అని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
హమాస్ తో పాటు గాజా ప్రజలకు కూడా ట్రంప్ హెచ్చరించారు. బందీలను హమాస్ విడుదల చేయకుంటే.. గాజా వారికి దక్కదని చెప్పారు. ” గాజా ప్రజలారా, మీ కోసం అందమైన భవిష్యత్తు ఎదురు చూస్తోంది. బందీలను విడుదల చేయకుంటే, అది మీకు దక్కదు. బందీలందరినీ ఇప్పుడే విడుదల చేయండి. లేదంటే తర్వాత దాని పరిణామాలు అనుభవించాల్సి ఉంటుంది,” అని పదే పదే హెచ్చరించారు.
2023 అక్టోబర్ 7న గాజా యుద్ధం ప్రారంభమైంది. హమాస్ జరిపిన మెరుపు దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. అదే సమయంలో.. కొందరు ఇజ్రాయెల్ పౌరులు, విదేశీయులను బందీలుగా హమాస్ పట్టుకుని తమ చెరలో పెట్టింది. ఈ దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ గాజాపై జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 46 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. ఇందులో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. లక్షల మంది ప్రాణభయంతో గాజాను విడిచి పారిపోయారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టే ముందు నుంచే హమాస్ ను బందీల విడుదల విషయంలో హెచ్చరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. పాలస్తీనా ఖైదీలు, యుద్ధ ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందం అమలు నిదానంగా జరుగుతుండగా.. హమాస్ బందీల విడుదలను నిలుపుదల చేసింది. దీంతో ట్రంప్ తన చివరి హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు, గాజా నుంచి పాలస్తీనా ప్రజలను తరలించి, ఆ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకొని.. పునర్నిర్మించాలని ట్రంప్ వ్యాఖ్యానించడం. ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేయడం విమర్శలను ఎదుర్కొంది.
Also Read: అమెరికాకు కరెంటు కోతలు.. స్టార్ లింక్ డీల్ రద్దు చేసిన కెనెడా
ట్రంప్ వీడియోకు చెక్ పెట్టిన అరబ్ దేశాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యొక్క గాజా స్వాధీన ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. బదులుగా, ఈజిప్టు నాయకత్వంలో అరబ్ దేశాలు గాజా పునర్నిర్మాణానికి 53 బిలియన్ డాలర్ల ప్రతిపాదనను ముందుకు తెచ్చాయి. ఈ ప్రణాళిక ప్రకారం.. పాలస్తీనా అథారిటీ (పీఏ) పరిపాలనలో గాజా పునర్నిర్మాణం జరగనుంది. ట్రంప్ ప్రతిపాదించిన “మిడిల్ ఈస్ట్ రివేరా” ప్రణాళికకు ఇది ప్రత్యామ్నాయంగా ఉంది. కొన్ని రోజుల క్రితమే గాజా నుంచి పాలస్తీనా వాసులను వెళ్లగొట్టి వారి ప్రదేశంలో తాను నగరం నిర్మిస్తానని ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి గాజా విలాసవంతమైన పాశ్చాత్య జీవితాన్ని ప్రతిబింబిస్తూ ఒక ఏఐ జెనెరేటెడ్ వీడియోని కూడా ట్రంప్ విడుదల చేశారు.
అరబ్ లీగ్ సదస్సులో, గాజా పునర్నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికకు అంతర్జాతీయ మద్దతు కోసం పిలుపునిచ్చారు. ప్రణాళికకు సంబంధించి 115 పేజీ డాక్యుమెంట్‌ని కూడా విడుదల చేసింది. పునర్నిర్మాణం కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఈ ప్రణాళికలో గాజాను అభివృద్ధి చేయడానికి వివిధ ప్రాజెక్టులు, వాణిజ్య నౌకాశ్రయం, టెక్నాలజీ హబ్, బీచ్ హోటళ్లు.. విమానాశ్రయం ఉన్నాయి.
హమాస్ ఈ ప్రణాళికను స్వాగతించింది, కానీ పీఏ పర్యవేక్షణలో పనిచేసే కమిటీలో తమ ప్రతినిధులను ఉంచాలని డిమాండ్ చేసింది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కూడా ఈ ప్రణాళికను సమర్థించారు.
అయితే.. ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రణాళికను తిరస్కరించింది. గాజాను అమెరికా యాజమాన్యంలోని “రివేరా”గా మార్చే తన ప్రణాళికకే కట్టుబడి ఉందని తెలిపింది. ఇజ్రాయెల్ కూడా ఈ ప్రణాళికను తిరస్కరించింది. హమాస్ సైనిక, పాలనా సామర్థ్యాలను నాశనం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ తెలిపింది.