Plane Crash : నూతన సంవత్సరం ప్రారంభం నుంచే వరుస ప్రమాదాలు జరుగుతున్న అమెరికాలో తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియాలో ఫుల్లర్టన్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఓ బిల్డింగ్ పై చిన్న సైజు విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 18 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదంలో 181 మంది మరణించిన ఘటన మరువకముందే.. కెనడాలో విమాన ప్రమాదం జరిగింది. అయితే ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక ఈ ఘటనలతో హడాలెత్తిపోతున్న ప్రయాణికులకు తాజాగా అమెరికాలో జరిగిన మరో విమాన ప్రమాద ఘటన మరింత భయాందోళనకు గురిచేసింది.
తాజాగా అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియాలోని ఫుల్లర్టన్ లో ఓ బిల్డింగ్ పై చిన్న సైజు విమానం కూలిపోయింది. సింగిల్ ఇంజన్ 4 సీట్లతో ఉన్న చిన్న సైజు విమానం ఆకస్మాత్తుగా ఈ బిల్డింగ్ పై కూలిపోయింది. కమర్షియల్ బిల్డింగ్ కావడంతో ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం విమానం గాలిలో ఉన్నప్పుడే నిప్పులు చెలరేగాయని.. చూస్తుండగానే కూలిపోయిందని.. మంటలు తీవ్ర స్థాయిలో చెలరేగాయని తెలిపారు.
ఇక ఈ ప్రమాదం మధ్యాహ్నం 2:10 గంటల సమీపంలో జరిగినట్లు తెలుస్తుంది. దక్షిణ కాలిఫోర్నియాలోని గిడ్డంగి పై కప్పుపై ఈ విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేటంతో.. భవనం పైకప్పుకు పెద్ద రంధ్రం పడింది. అయితే ఈ సంఘటనను మొదటగా స్ట్రక్చర్ ఫైర్‌గా వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో గోదాం లోపల మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమీపంలోని భవనాలను ఖాళీ చేయించారు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు విమానం కూలిన ప్రదేశం లాస్ ఏంజెల్స్ కు ఆగ్నేయంగా 25 మైళ్ళ దూరంలో ఉందని తెలిపారు. విమానం కూలిపోయిన భవనం ఫర్నిచర్ తయారు చేసేది కావడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఇక ప్రమాద సమయంలో భవనంలో కార్మికులతో సహా ఎక్కువమంది ఉండటంతో ప్రమాద స్థాయి పెరిగిందని.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 18 మందికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించామని.. ప్రామాద స్థాయి ఎక్కువగానే ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేయనున్నామని తెలిపారు.
ALSO READ : భార్యతో గొడవపడి ట్రంప్ హోటల్ ముందు బాంబు పేల్చాడు.. టెస్లా సైబర్ ట్రక్కు పేలుడు ఘటన రిపోర్ట్
అగ్రరాజ్యం అమెరికాలో సైతం ఈ మధ్య కాలంలో వరుస ప్రమాదాలు ఆ దేశ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వరసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ ట్రక్కు బీభత్సం సృష్టించిన ఘటనతో పాటు కాల్పులు, పేలుళ్లకు అమెరికన్స్ ను వణికిపోయారు. వీటిని మరువకముందే ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది.