Ukraine Drone Attack Kremlin| ఒకవైపు ఉక్రెయిన్ యుద్దంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. వారం వ్యవధిలో ఉక్రెయిన్ రష్యాపై రెండోసారి డ్రోన్ల దాడులకు పాల్పడింది. అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ సమీపంలో దాదాపు 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఒక భవనంపై ఈ డ్రోన్ దాడి జరిగింది. రష్యా అధికారులతో చర్చల కోసం అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ మాస్కోకు రహస్యంగా వెళ్లినట్లు వార్తలు వచ్చిన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ డ్రోన్లను రష్యా వైమానిక దళం అడ్డుకుందని మాస్కో మేయర్ వెల్లడించారు.
మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ అత్యంత పెద్ద దాడిని చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, సోమవారం రాత్రి వందల డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడింది. 10 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన ఈ దాడులను రష్యా విజయవంతంగా అడ్డుకుంది. క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా 337 డ్రోన్లను కూల్చివేసింది. ఈ దాడుల వల్ల ఒకరు మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. అనేక భవనాలు మరియు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని 70 డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులు చేసిందని, వాటిని కూల్చివేశామని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాల్లో కొద్దిసేపు విమానాలను నియంత్రించాల్సి వచ్చింది. మాస్కో ప్రాంతంలోని డొమోడెడోవో రైల్వే స్టేషన్‌లో రైళ్లను కొద్దిసేపు నిలిపివేయవలసి వచ్చింది.
Also Read: ఉక్రెయిన్ ప్రజలను చంపాలనే రష్యా ఆలస్యం.. పుతిన్‌పై జెలెన్‌స్కీ ఆరోపణలు
పుతిన్‌తో చర్చలు ఫలప్రదం: ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలు జరిపానని, అవి ఫలప్రదంగా జరిగాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సైన్యం ప్రమాదంలో ఉందని చెప్పిన ట్రంప్, వారి ప్రాణాలను కాపాడాలని పుతిన్‌ను కోరారు.
“రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నిన్న ఫలప్రదమైన చర్చలు జరిపాను. భయంకరమైన, రక్తపాతం సృష్టిస్తున్న ఈ యుద్ధం ఎట్టకేలకు ముగిసే అవకాశం ఉంది. కానీ, ఇదే సమయంలో వేలాది మంది ఉక్రెయిన్ బలగాలను రష్యా సైన్యం చుట్టుముట్టింది. వారంతా ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నారు. వారి ప్రాణాలు కాపాడాలని పుతిన్‌ను గట్టిగా అభ్యర్థించాను. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎవ్వరూ చూడని భయంకరమైన ఊచకోతగా మారొచ్చు. వారికి భగవంతుడు అండగా ఉంటాడని ఆశిస్తున్నాను,” అని డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడిన తర్వాత ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ బలగాలు లొంగిపోతే వారి ప్రాణాలను కాపాడతామని తెలిపారు.
మరోవైపు, అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంపై పుతిన్ స్పందిస్తూ, దానికి అనుకూలంగా మాట్లాడారు. ఈ కాల్పుల విరమణ శాశ్వత శాంతికి దారితీయాలని, సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఇలా స్పందించిన కొన్ని గంటలకే ట్రంప్‌తో సంభాషించినట్లు వెల్లడైంది.