US Supports India Against Terrorism| పహల్గాం మారణహోమం తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఇండియాకు బాసటగా నిలిచింది. ప్రధాన మంత్రి మోడీకే తమ పూర్తి మద్దతు అని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. శుక్రవారం ఉదయాన్నే (భారత కాలామనం) అమెరికా ప్రభుత్వ ప్రతినిధి టామీ బ్రూస్ వాషింగ్టన్ లో ఒక మీడియా సమావేశం నిర్వహించారు.
“ఉగ్రవాద దాడుల తరువాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇరు దేశాలతో మా ప్రభుత్వం దౌత్య పరంగా చర్చలు సాగిస్తోంది. పరిస్థితులను మేము మానిటర్ చేస్తున్నాం. నిన్న అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహ్ బాజ్ షరీఫ్ లో చర్చలు జరిపారు. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకే తన పూర్తి మద్దతు అని చెప్పారు. ఇండియాలో జరిగిన ఉగ్రవాద దాడిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న భారత్ కు తోడుగా నిలుస్తాం. ప్రధాన మోడీకి అండగా ఉంటాం” అని టామీ బ్రూస్ అన్నారు.
అంతకుముందు రోజు అమెరికా ప్రభుత్వ సెక్రటరీ, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్–పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న మారణహోమాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతు ప్రకటించారు.
ఈ దాడి పై భారత్ చేస్తున్న దర్యాప్తునకు పాకిస్తాన్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించాలని, భారత్‌తో నేరుగా చర్చలు జరిపి ఉద్రిక్తతలు తగ్గించాలన్నారు. వీలైనంత త్వరగా పరిస్థితులు సాధారణ స్థాయికి తీసుకురావాలన్నారు.
Also Read: బార్డర్ మూసివేసిన పాకిస్తాన్.. వందలాది పాక్ పౌరులు ఎండలో నడిరోడ్డపైనే విలవిల
ఈ చర్చల్లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని, తమకు పెద్ద నష్టం జరిగిందని చెప్పారు. మరోవైపు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ కూడా భారత్‌కి మద్దతు ప్రకటించారు. భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడి ఇండియాకు కచ్చితంగా మద్దుత ఇస్తామని తెలిపారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్ కు సింధూ జలాల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. పాకిస్తాన్ లోని ఇండియన్ అంబాసిడర్, హై కమిషన్ అధికారులను వెనక్కు రప్పించింది. పాకిస్తాన్ తో ఉన్న రోడ్డు మార్గం అటారి వాఘా బార్డర్ ను మూసివేసింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఉగ్రవాదులను అంతం చేసేందుకు పాకిస్తాన్ ను కూడా ఉపేక్షించవద్దని ప్రధాన మంత్రి మోడీ భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సైన్యాధికారులు తమకు తోచినట్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.