US Work Permits Indian Students| అమెరికాలో ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారిన హెచ్1బీ వీసాలకు మరో అంశం చేరింది. అమెరికన్ యువత ఉద్యోగాలను విదేశాల నుంచి వస్తున్న వారికి ఇచ్చేస్తున్నారని యూఎస్‌లో కొందరు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే.. ఇప్పుడు దీనికి ఇంకో అంశాన్ని చేర్చారు. అదే ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ యువతకు ఉద్యోగం చేసే నిపుణత రావడం కోసం ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఓపీటీ) ఉపయోగపడుతుంది. దీంట్లో భాగంగా ఎఫ్1 వీసాపై యూఎస్‌లో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమ్యాటిక్స్) కోర్సులు చదువుకుంటున్న విద్యార్థులు జాబ్ ట్రైనింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం వారు యూఎస్ కంపెనీల్లో ఉద్యోగాలు చెయ్యొచ్చు. అయితే ఓపీటీ కింద కేవలం విద్యార్థులకే జాబ్స్ ఇవ్వాలి.
Also Read : డబ్బుల కోసం వ్యభిచారం చేస్తున్న టీచర్లు, డాక్టర్లు.. ఆ దేశంలో దిక్కుతోచని స్థితిలో మహిళలు!
అయితే ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, టెంపరరీగా విద్యార్థుల స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించాల్సిన ప్రోగ్రాంను ఉపయోగించి ఏకంగా ఫుల్‌టైం ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఉద్యోగాల కోసం ‘బ్యాక్‌డోర్’గా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్ తాజాగా ఎక్స్‌లో ఇవే ఆరోపణలతో పోస్టు పెట్టింది. వచ్చే ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రోగ్రాంపై ఫోకస్ పెట్టాలని, అసలు దీన్ని తీసేయాలని డిమాండ్ చేసింది.
అయితే అలా చేస్తే భారతీయ విద్యార్థులకు కూడా పెద్ద సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భారతీయ విద్యార్థుల్లో చాలామంది ఓపీటీ ప్రోగ్రాం ద్వారా లబ్దిపొందుతున్నారు. హెచ్1బీ వీసాలు పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ ప్రోగ్రాంపై గొడవ జరగడం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో అంటే 2023లో వాషింగ్టన్ అలియన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ (వాష్ టెక్).. ఈ ప్రోగ్రాం అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను నాశనం చేస్తోందని కోర్టుకెక్కింది. కానీ ఈ ప్రోగ్రాం సరైనదేనని లోయర్ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ ప్రోగ్రాం ఫ్యూచర్ ఏంటో ఇప్పుడే ఏం చెప్పలేం. ఎందుకంటే ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. దీనిపై ఎలా స్పందిస్తారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పటికే కొంతమంది పాలసీ మేకర్స్ ఈ ప్రోగ్రాంను తొలగించేయాలని డిమాండ్లు చేస్తున్నారు. మరికొందరేమో ట్యాలెంట్ ఉన్న విదేశీ యువతను అమెరికాకు ఆకర్షించడానికి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుందని వాదిస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్లు ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఆర్థిక, కల్చరల్ లాభాలు చూపిస్తూ ఈ ప్రోగ్రాంను కొనసాగిస్తూనే వచ్చారు.
ఒకవేళ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తే.. అమెరికా యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులు రావడం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. అమెరికాలో బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించారు. ఓపీటీ వంటి ప్రోగ్రాంను తొలగిస్తే.. అంతర్జాతీయ విద్యార్థులు తగ్గి, అది అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది.
అయితే తను అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్1బీ వీసా నిబంధనలను సడలించి, నైపుణ్యం ఉన్న యువతకు అమెరికాలో ఎప్పుడూ అవకాశాలు ఇస్తామని ట్రంప్ అంటున్నారు. మరి ట్రంప్ సర్కారు ఓపీటీ ప్రోగ్రాంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా.. అసలే హెచ్1బీ వీసా గొడవతో వేడెక్కుతున్న అమెరికా రాజకీయ వేదిక ఈ ఓపీటీ ప్రోగ్రాంపై విమర్శలతో ఈ గొడవ మరో మలుపు తిరిగిందనే చెప్పాలి.