CM Chandrababu: కుప్పం ప్రజలకు వరాలు కురిపించారు సీఎం చంద్రబాబు. సోమవారం కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు, ద్రవిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో కుప్పం విజన్ – 2029 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. అనంతరం నియోజకవర్గ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సంధర్భంగా కుప్పం అభివృద్దికి సంబంధించి తీసుకున్న అన్ని చర్యల గురించి సీఎం వివరించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పంలోని నడుమూరులో సోలార్ పవర్ పైలెట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సూర్యఘర్ పథకం కింద వంద ఇళ్లకు సోలార్ పవర్ అందించనున్నట్లు, ఏపీని అభివృద్ధి, సంక్షేమం దిశగా తీసుకెళ్తున్నామన్నారు. గతంలో జన్మభూమి, శ్రమదానం కుప్పం నుంచే ప్రారంభించామన్న సీఎం, పేదవాళ్లను ఆర్థికంగా పైకి తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు. ఎక్కడికక్కడ మొక్కలు పెంచాలి.. నీరు నిల్వ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వచ్చే జూన్‌లోగా హంద్రీనీవా పూర్తి చేసి కుప్పంకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చే సోలార్ ద్వారా, ప్రతి ఇల్లూ నెలకు 200 యూనిట్లు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని, 60 యూనిట్లు వాడుకోవచ్చని సీఎం అన్నారు. 140 యూనిట్లు గ్రిడ్‌కు ఇవ్వవచ్చుని, ఏడాదికి రూ.4 వేల విలువైన కరెంట్ ఉచితంగా వాడుకోవచ్చన్నారు. లబ్దిదారులకు అదనంగా ఏడాదికి రూ.5 వేల వరకు ఆదాయం వస్తుందని ఇదొక శుభపరిణామం అంటూ సీఎం అన్నారు.
Also Read: AP Scheme: ఏపీలో మరో స్కీమ్.. ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ..!
తన చిన్నప్పుడు కరెంట్ ఉంటే గొప్పగా చెప్పుకునేవాళ్లమని, ఇప్పుడు మన ఇళ్లపై మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకొనే స్థాయికి రావడం ఆనందంగా ఉందన్నారు. సౌర, పవన విద్యుత్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు సౌర, పవన విద్యుత్ వల్ల ప్రజలకు బిల్లుల భారం తగ్గుతుందని సీఎం అన్నారు. కుప్పంకు పెట్టుబడులు తెచ్చి ఉపాధి కల్పిస్తామని, కష్టపడితేనే అభివృద్ధి ఉంటుందన్నారు. కాగా కుప్పం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అలాగే కుప్పం ప్రజలను సీఎం ఆత్మీయంగా పలకరించారు.