Train Platform Accident Death| రైల్వే స్టేష్టన్లలో గత కొంతకాలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రైన్‌లో ఎక్కుతున్న సమయంలో లేదా దిగుతున్న సమయంలో చాలా మంది జారి పడి రైల్వే స్టేష్టన్ ప్లాట్ ఫామ్, ట్రైన్ మధ్య ఉన్న గ్యాప్ లో పడుతున్నారు. అక్కడ చిక్కుకుపోతే ప్రాణలతో బయటపడడం చాలా కష్టం.
ఇలాంటి ఘటనే తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగింది. మే 2, 2025న రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై పవన్ కుమార్ అనే 30 ఏళ్ల యువకుడు ట్రైన్ కోసమే వేచి ఉన్నాడు. ప్లాట్ ఫామ్ నెంబర్ 8 పై దానాపూర్ ఎక్స్ ప్రెస్ రాగానే అతను త్వరగా ట్రైన్ ఎక్కాలనే ప్రయత్నంలో జారిపడి ట్రైన్, ప్లాట్ ఫామ్ మధ్యలో ఉన్న గ్యాప్ లో పడ్డాడు. పవన్ కుమార్ అక్కడే చిక్కుకుపోగా.. ఆ స్థితిలో ట్రైన్ కదిలింది. కొంత దూరం వరకు అలాగే ఈడ్చుకుంటే వెళ్లింది. పవన్ కుమార్ ప్రమాదంలో ఉన్న విషయాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు వెంటనే ఆర్‌పిఎఫ్, రైల్వే అధికారులకు తెలియజేశారు. దీంతో ట్రైన్ ఆపేసి అతడిని బయటికి తీశారు. అప్పటికే పవన్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు.
ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్ మృతిపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Read: యువతిపై కత్తితో దాడి చేసిన ఇంటి ఓనర్.. కోరికలు తీర్చాలని బ్లాక్ మెయిల్
ఇలాంటి ఘటన ఒకటి రెండు వారాల క్రితం కూడా జరిగింది. ముంబైలోని అంబర్ నాథ్ రైల్వే స్టేషన్ లో 40 ఏళ్ల రోహిత్ యాదవ్ అనే వ్యక్తి ట్రైన్ ఎక్కుతూ జారి ప్లాట్ ఫామ్, ట్రైన్ మధ్యలో ఉన్న గ్యాప్ లో పడ్డాడు. రోహిత్ యాదవ్ ఊబకాయుడు కావడంతో అక్కడే చిక్కుకొని పోయాడు. ఈ ఘటన ఉదయం 8 గంటలకు జరిగింది. స్టేషన్ లో జనం భారీ సంఖ్యలో ఉండడం కారణంగా పోలీసులు అతడిని గమనించడంలో ఆలస్యం జరిగింది. ఆ తరువాత సమాచారం అందుకొని అతడిని బయటకి తీసి ఆస్పత్రికి తరలించగా గాయాల కారణంగా చికిత్స పొందుతూ రోహిత్ మరణించాడు.
ఇలాంటి ఘటన అంతకుముందు మార్చి నెలలో కూడా ముంబైలో జరిగింది. ఆ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. కదులుతున్న ట్రైన్ లో అలా త్వరపడి ఎక్కడం లేదా దిగడం చాలా ప్రమాదకరమని తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారని.. అలా చేయడం ప్రాణాంతకమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.