Puppies Cradle Ceremony: ఉదయం నుండి ఆ ఇంట హడావుడి అంతా ఇంతా కాదు. ఎవరు చూసినా బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు సమీప బంధువులు రానే వచ్చారు. ఇంతకు ఈ సందడికి కారణం ఏమిటంటే ఆ ఇంట బారసాల జరుగుతోంది. అట్లాంటి ఇట్లాంటి బారసాల కాదండోయ్.. ఇదో వెరైటీ బారసాల. వాస్తవంగా బారసాలే కానీ, నిర్వహించింది కూడా పిల్లలకే కానీ మీరనుకున్న పిల్లలు మాత్రం కాదు.
సాధారణంగా మనం బారసాల పిల్లలు పుట్టిన సమయంలో నిర్వహిస్తాం. అది కూడా పిల్లలు పుట్టిన 21 రోజులకు అంగరంగ వైభవంగా జరుపుతాం. అంటే ఉయ్యాలలో వేసి చిన్నారులను ఊపుతూ.. అదొక పండుగలా నిర్వహిస్తాం. కానీ ఇక్కడ సేమ్ టు సేమ్ అట్లాంటిదే బారసాల కార్యక్రమం సాగింది కానీ, అది పిల్లలకు కాదు.. శునకం పిల్లలకు. ఔను మీరు చదివింది నిజమే.. వీరు తమ పెంపుడు శునకం పిల్లలకు పండుగ వాతావరణంలా బారసాల నిర్వహించారు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట పెంపుడు శునకం ఉండడం కామన్ గా మారింది. ఆ శునకాన్ని ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటారు. కారణం శునకం విశ్వాస జంతువు. ఆ విశ్వాసంకు తగినట్లుగానే ఇంటి వారితో ఆప్యాయత చూపడంలో శునకాలు ఎప్పుడూ ముందుంటాయి. అందుకే కాబోలు.. తమ ఆకలి కంటే శునకం కడుపు నిండిందా లేదా అన్నది గమనిస్తారు ఎవరైనా. ఇలా తమ పిల్లలతో సమానంగా ఆ కుటుంబం తమ పెంపుడు శునకానికి ప్రేమ పంచుతుంది.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌లో నివాసముంటున్న రాపెల్లి వినోద్, లావణ్య దంపతులు నివసిస్తున్నారు. వీరు ఏడాది నుంచి షీజూ జాతికి చెందిన కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ శునకం అంటే వారికి ప్రాణం కంటే మిన్న. ఇటీవల ఈ కుక్క నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ నాలుగు పిల్లలకు బారసాల నిర్వహించాలని ఆ దంపతులు భావించారు. అలా భావించి తేదీని కూడా నిర్ణయించారు. అలా నిర్ణయించుకున్న తేదీ రానే వచ్చింది. ఇక ఆ ఇంట సందడి మొదలైంది. ఉదయాన్నే నాలుగు శునక బేబీలకు స్నానం చేయించారు. పూజలు నిర్వహించారు. ఒక పండుగ వాతావరణంలో వారు.. ఆ శునక పిల్లలకు బారసాల నిర్వహించి, తమ ప్రేమను చాటుకున్నారు. ఆ తర్వాత బారసాలకు వచ్చినవారు కూడా దీవించి వెళ్లిపోయారు.
కుక్కపిల్లలకు బారసాల
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌లో నివాసముంటున్న రాపెల్లి వినోద్-లావణ్య దంపతులు
ఏడాది నుంచి షీజూ జాతికి చెందిన కుక్కను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుటుంబం
ఇటీవలే ఈ కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో బారసాల నిర్వహించిన కుటుంబం… pic.twitter.com/GmGrgtEG6r
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2024