Pure Ghee: దేశీ నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే దీనిని ఎక్కువగా తింటూ ఉంటారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు దేశీ నెయ్యి ఇంట్లోనే తయారయ్యేది. మారుతున్న జీవనశైలి కారణంగా ఇంట్లో నెయ్యి తయారు చేయడం చాలా అరుదుగా మారింది.
దీంతో నెయ్యి అలవాటు ఉన్న వారు నెయ్యిని మార్కెట్ నుంచి కొని తెచ్చుకుంటారు. ఇలాంటి సమయంలో బయట కొని తెచ్చిన నెయ్యి స్వచ్ఛమైనదా, కల్తీయా అనే సందేహం చాలాసార్లు వస్తుంది. అలాంటి సమయంలోనే కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వాలి. వీటి ద్వారా ఈజీగా కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు.
మీరు కూడా దేశీ నెయ్యి యొక్క స్వచ్ఛత గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే కనక ఇంట్లోనే దేశీ నెయ్యి యొక్క స్వచ్ఛతను సులభంగా తెలుసుకోవచ్చు. మరి దేశీ నెయ్యి స్వచ్ఛతను గుర్తించే 4 పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశీ నెయ్యి యొక్క స్వచ్ఛతను ఈ 4 విధాల్లో గుర్తించండి..
మొదటి పద్ధతి : దేశీ నెయ్యి స్వచ్ఛమైనదా కాదా అనేది ఆహారంలో ఉపయోగించే ఉప్పు ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక చెంచా మార్కెట్ నుంచి తీసుకువచ్చిన నెయ్యిని ఒక గిన్నెలో వేయండి. దీని తరువాత ఈ నెయ్యిలో అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపండి. ఆ తర్వాత దీనిని 20 నిమిషాల పాటు వదిలివేయండి. నెయ్యి రంగు మారితే అది కల్తీ అని అర్థం చేసుకోండి. నిజమైన నెయ్యి రంగు మారదు.
రెండవ పద్ధతి: దేశీ నెయ్యి యొక్క స్వచ్ఛతను గుర్తించడానికి మరొక మార్గం మీ అరచేతులపై కొంత నెయ్యిని తీసుకోండి. ఆ తర్వాత నెయ్యిని కొన్ని సెకన్ల పాటు వదిలేయండి. నెయ్యి స్వచ్ఛంగా ఉంటే, అరచేతిపై పోసుకున్న కొద్దిసేపటికే అది కరిగి ప్రవహిస్తుంది. అది కల్తీ అయితే అరచేతిలో అలాగే ఉంటుంది.
Also Read: ప్రతి రోజు ఉదయం నానబెట్టిన శనగలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?
మూడవ పద్ధతి: నీటి ద్వారా కూడా నెయ్యి యొక్క స్వచ్ఛతను గుర్తించవచ్చు. దీని కోసం, ఒక గ్లాసు నీరు తీసుకుని అందులో ఒక టీస్పూన్ నెయ్యి కలపండి. నీళ్లలో నెయ్యి కలిపిన తర్వాత అది పైకి తేలుతూ కనిపిస్తే నెయ్యి కల్తీ కాలేదని అర్థం చేసుకోండి. కల్తీ అయితే, అది నీటిలో తేలకుండా నీటిలో అడుగుకు చేరుకుంటుంది.
నాల్గవ పద్ధతి: దేశీ నెయ్యి అసలైనదో కాదో దాని రంగును చూసి గుర్తించవచ్చు. దీని కోసం, ఒక చెంచా నెయ్యిని వేడి చేయండి. నెయ్యి కరిగినప్పుడు, దాని రంగును గుర్తించండి. నెయ్యి రంగు నిండుగా కనిపిస్తే, స్వచ్ఛమైనదని అర్థం చేసుకోండి. నెయ్యి పూర్తిగా పసుపు రంగులో కనిపిస్తే అది కల్తీ అయిందని గుర్తించాలి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.