సాధారణంగా అవాంఛిత గర్భం, లైంగిక సంబంధ సమస్యలు రాకుండా ఉండేందుకు కండోమ్ ఉపయోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, ఈ కండోమ్స్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయి అనేది చాలా మందికి తెలియదు. ఫస్ట్ టైమ్ ఎక్కడ ఉపయోగించారు అనే విషయంలోనూ క్లారిటీ లేదు. కచ్చితమైన సమాచారం లేకపోయినప్పటికీ 200 ఏళ్ల నుంచి కండోమ్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. తాజాగా నెదర్లాండ్స్ లో దాదాపు 2 శతాబ్దాల నాటి కండోమ్ వెలుగులోకి వచ్చింది. ఈ కండోమ్ ను ఓ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. దీనిని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.
ఆమ్ స్టర్ డ్యామ్ మ్యూజియంలో ప్రదర్శన
ఈ అరుదైన కండోమ్ ను ఆమ్ స్టర్ డ్యామ్ లోని ఓ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. దీనిని 1830లో తయారు చేసినట్లు సమాచారం. ఈ కండోమ్ పై ప్రింటెడ్ చిత్రాలు ఉండడం విశేషం. ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు అర్ధనగ్నంగా నిలబడి ఉన్నారు. ఇందుతో ఒక నన్, ముగ్గురు మతాధికారులు ఉన్నారు. ఈ చిత్రం గ్రీకు పురాణాల నుంచి ప్రేరణ పొంది ఉంటారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ కండోమ్ పొడవు ఏకంగా 20 సెంటీ మీటర్లు ఉంది. తొలి గర్భనిరోధక సాధకం ఇదే కావచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
గొర్రె అపెండిక్స్ తో కండోమ్ తయారీ
ఇక ఈ అరుదైన కండోమ్ గొర్రె అపెండిక్స్ తో తయారు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఉన్న ఈ పెయింటింగ్ ను లగ్జరీ సావనీర్ గా గుర్తిస్తూ వేలానికి ఉంచారు.ఈ కండోమ్, 19వ శతాబ్దపు వ్యభిచారం, లైంగికతపై జరిగే ప్రదర్శనలో భాగంగా దీనిని అందుబాటులో ఉంచినట్లు మ్యూజియం నిర్వాహకులు వెల్లడించారు. ఈ కండోమ్ కోసం మ్యూజియంలో ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించినట్లు వెల్లడించారు. ఈ మ్యూజియంలో దాదాపు 7,50,000 వరకు ప్రింట్లు, డ్రాయింగ్‌లు, ఫోటోలు ప్రదర్శనకు ఉన్నట్లు వెల్లడించారు.
మ్యూజియానికి పోటెత్తిన జనం
ఈ అరుదైన కండోమ్ ను చూసేందుకు మ్యూజియానికి వయసుతో సంబంధం లేకుండా జనాలు క్యూ కడుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ కండోమ్ ప్రదర్శనకు అనూహ్య స్పందన లభిస్తోందని మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ వెల్లడించారు. నిజానికి ఈ కండోమ్ ను తొలిసారి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినప్పుడు అందరూ నవ్వుకున్నట్లు వెల్లడించారు. కానీ, ఇప్పుడు ఈ కండోమ్ మ్యూజియానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలిపారు. 2024లో జరిగిన ఒకవేలంలో మ్యూజియం దీనిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పరీక్షల్లో ఈ కండోమ్ ఎవరూ ఉపయోగించలేదని తేలిందన్నారు. ఈ కండోమ్ ను లైంగిక సుఖం కోసం, అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు తయారు చేశారని వివరించారు. అప్పట్లో కొన్ని నగరాల్లో వ్యభిచారం బాగా జరిగేదని, వాళ్లు వీటిని ఎక్కువగా ఉపయోగించే వారని వివరించారు. నవంబర్ చివరి వరకు ఈ కండోమ్ ను మ్యూజియంలో ప్రదర్శించనున్నట్లు జాయిస్ జెలెన్ తెలిపారు.
Read Also: ఉమెన్ సేఫ్టీలో వైజాగ్ బెస్ట్, మరి వరెస్ట్ నగరం ఏదో తెలుసా?