Ayurvedic Herbs: ప్రస్తుతం చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కడుపు ఉబ్బరం, మలబద్దకం, అసిడిటీ, వాంతుల వంటి సమస్యలను ఎప్పుడో ఒకప్పుడు మనం ఎదర్కుంటూనే ఉంటాం. అయితే ఇందుకు అనేక రకాల కారణాలు ఉంటాయి. వీటిని తెలుసుకుని సమయానికి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యం. కొన్ని సార్లు వీటిని తగ్గించుకోవడానికి హోం రెమెడీస్ కూడా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా.. ఆయుర్వేద మూలికలు ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇంతకీ జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఆయుర్వేద మూలికలు ఏవో తెలుసుకుందామా..
1. అల్లం:
అల్లం అనేది జీర్ణక్రియకు అత్యంత ప్రభావ వంతమైన మూలికలలో ఒకటి. ఇది ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అల్లం రసాన్ని లేదా అల్లం టీని తీసుకోవడం మంచిది. ఇవి మీ జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.
2. జీలకర్ర:
జీలకర్ర జీర్ణక్రియ ప్రక్రియను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా ఇది జీర్ణ రసాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్‌ను కూడా నివారిస్తుంది. జీలకర్రను వేయించి పొడి చేసి మజ్జిగలో లేదా వేడి నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు.
3. వాము:
వాము కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, పేగుల కదలికలను సక్రమంగా ఉంచుతుంది. ఒక టీస్పూన్ వామును వేడి నీటితో తీసుకోవడం తక్షణ ఉపశమనం ఇస్తుంది.
4. త్రిఫల :
త్రిఫల అనేది మూడు పండ్ల మిశ్రమం: ఉసిరి, కరక్కాయ, తానికాయలను త్రిఫల అని పిలుస్తారు. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి. త్రిఫల చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి.
5. మెంతులు :
మెంతులు జీర్ణక్రియను సులభతరం చేయడమే కాకుండా.. కడుపులో మంటను తగ్గిస్తాయి. ఇవి పేగులలోని మంచి బాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. మెంతులను రాత్రిపూట నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం లేదా వాటిని వంటలలో ఉపయోగించడం మంచిది.
ఈ మూలికలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే.. ఏదైనా కొత్త ఆహారపు అలవాట్లను ప్రారంభించే ముందు నిపుణులను తప్పకుండా సంప్రదించడం మంచిది.