Kidney Disease: మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడతాయి. అయితే.. కొన్నిసార్లు కిడ్నీల పనితీరు మందగిస్తే, దాని ప్రభావం మన ముఖం, మెడపై స్పష్టంగా కనిపిస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధి ప్రారంభ దశలో ఉన్నప్పుడు కనిపించే ఐదు ముఖ్యమైన లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ ఫేయిల్యూర్ లక్షణాలు:
ముఖం, కళ్ళ చుట్టూ వాపు (ముఖం ఉబ్బడం):
కిడ్నీ వ్యాధికి ఇది ఒక ప్రధాన లక్షణం. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు, శరీరంలో అదనపు ద్రవాలు, సోడియం పేరుకుపోతాయి. ఈ ద్రవాలు ముఖం మీద.. ముఖ్యంగా కళ్ళ చుట్టూ (కనురెప్పల కింద) వాపుకు కారణమవుతాయి. ఉదయం నిద్ర లేవగానే ముఖం ఉబ్బినట్లు అనిపించడం దీనికి ఒక సంకేతం. ఈ వాపును “ఎడెమా” అని అంటారు.
చర్మం పొడిబారడం, దురద:
కిడ్నీలు శరీరంలోని మలినాలను తొలగించలేనప్పుడు, ఆ మలినాలు రక్తంలో పేరుకుపోతాయి. ఇది చర్మం పొడిబారడానికి, దురదకు , దద్దుర్లు రావడానికి కారణమవుతుంది. ఈ సమస్య ముఖంతో పాటు శరీరమంతా కనిపిస్తుంది. కానీ మెడ, ముఖం చుట్టూ స్పష్టంగా గుర్తించవచ్చు. చర్మం రంగులో కూడా మార్పులు రావచ్చు.
పాలిపోయిన చర్మం :
కిడ్నీలు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడే “ఎరిత్రోపొయిటిన్” అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. కిడ్నీ వ్యాధితో బాధపడేవారిలో ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల రక్తహీనత (అనీమియా) వస్తుంది. రక్తహీనత కారణంగా ముఖం పాలిపోయినట్లు, బలహీనంగా కనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే.. వారి చర్మం రంగు లేనట్లుగా ఉంటుంది.
మెడ మీద, గొంతు కింద వాపు:
శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల మెడ, గొంతు కింద భాగంలో కూడా వాపు వస్తుంది. ఇది థైరాయిడ్ సమస్యలా అనిపించవచ్చు. కానీ ఇది కిడ్నీ సమస్య వల్ల కూడా రావచ్చు. ఈ వాపును గమనిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
Also Read: వావ్, చెప్పులు లేకుండా నడిస్తే.. మతిపోయే లాభాలు !
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
కొన్ని సందర్భాల్లో.. కిడ్నీలు పని చేయకపోవడం వల్ల శరీరంలో ద్రవం ఊపిరితిత్తులలోకి చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. దీని వల్ల ముఖం, మెడపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే.. ఇది మూత్రపిండాల సమస్యకు సంకేతం కావచ్చు.
ఈ లక్షణాలు కేవలం మూత్రపిండాల వ్యాధికే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. ఈ లక్షణాలలో ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలో గుర్తించడం వల్ల చికిత్స చేయడం సులభంగా ఉంటుంది.