యాంటీమైక్రోబయల్ లక్షణాలు, జీర్ణక్రియలో కీలక పాత్ర పోషించడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా చాలా మంది కాపర్ బాటిళ్లలో వాటర్ తాగడం మొదలుపెట్టారు. గత కొద్ది సంవత్సరాలుగా చాలా మంది కాపర్ సీసాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ బాటిళ్లలో నీళ్లు తాగడం అందరికీ మంచిది కాదంటున్నారు నిపుణులు. కొంత మంది కాపర్ బాటిళ్లలో నీల్లు తాగడం వల్ల రాగికి అతిగా ఎక్స్పోజర్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. దీని కారణంగా పలు ఆరోగ్య సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఈ 5 రకాల వ్యక్తులు రాగి సీసాల్లో నీళ్లు తాగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలంటున్నారు.
మూత్రపిండాల సమస్య ఉన్నవారు తరచుగా కాపర్ తో సహా వారి శరీరంలోని ఖనిజాలు, ట్రేస్ ఎలిమెంట్లను నియంత్రించడంలో ఇబ్బంది పడతారు. అధిక రాగి పేరుకుపోయి మూత్రపిండాల పనితీరును మరింత దిగజారే అవకాశం ఉంటుంది. సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న వారిలో రాగి సీసాలో నీళ్లు తాగడం మంచది కాదని వైద్య నిపుణులు వెల్లడించారు. వీళ్లు గాజు లేదంటే BPA లేని ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించాలంటున్నారు.
విల్సన్స్ వ్యాధి అనేది రాగి స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన రుగ్మత. ఈ సమస్య ఉన్న వ్యక్తులు కాలేయం, మెదడు సహా ఇతర అవయవాలలో రాగి పేరుకుపోయి ఇబ్బంది పడుతారు. ఈ విధానాన్ని సరిగా మెయింటెయిన్ చేయకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. విల్సన్స్ వ్యాధి ఉన్న వ్యక్తులకు రాగి సీసాలను ఉపయోగించడం వల్ల రాగి తీసుకోవడం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అందుకే, వీలైనంత వరకు వీళ్లు రాగి బాటిళ్లను ఉపయోగించకపోవడం మంచిది.
అసాధారణమైనప్పటికీ కొంతమందికి కాపర్ అలెర్జీని కలిగిస్తుంది. రాగి సీసాలలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల చర్మ సంబంధ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దద్దుర్లు, దురద, జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. రాగి బాటిళ్లు ఉపయోగించిన తర్వాత ఎవరైనా ఈ ప్రతిచర్యలను గమనించినట్లయితే, వాడకాన్ని నిలిపివేయడంతో పాటు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. వీళ్లు స్టెయిన్ లెస్ స్టీల్ లాంటి ప్రత్యామ్నాయ వాటర్ బాటిళ్లను ఉపయోగించడం మంచిది.
గర్భిణీ, పాలిచ్చే స్త్రీలు రాగి బాటిళ్లలో నీళ్లు తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక రాగి వినియోగం తల్లి, బిడ్డ ఇద్దరినీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి తక్కువ మొత్తంలో రాగి అవసరం అయినప్పటికీ, రాగి సీసాలను ఉపయోగించడం వల్ల రాగి స్థాయిలు ఊహించని విధంగా పెరగవచ్చు. గర్భిణీలు, పాలిచ్చే మహిళలు రాగి సీసాలను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
పిల్లలు, శిశువుల శరీరాలు అభివృద్ధి చెందే దశలో ఉంటాయి. వారి శరీర వ్యవస్థలు రాగితో సహా కొన్ని ట్రేస్ ఎలిమెంట్లకు మరింత సున్నితంగా ఉంటాయి. అధికంగా రాగి తీసుకోవడం వల్ల రాగి విషంగా మారే అవకాశం ఉటుంది. తీవ్రమైన సందర్భాల్లో వికారం, వాంతులు, కడుపు నొప్పి, కాలేయం దెబ్బతినడం వంటి లక్షణాలను కలిగిస్తుంది. అందుకే శిశువులు, చిన్న పిల్లలకు రాగి సీసాలు సాధారణంగా సిఫార్సు చేయబడవు.