Get Rid of Pimples: ముఖంపై వచ్చే మొటిమలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మొటిమలను త్వరగా తగ్గించుకోవడానికి కొన్ని సులువైన పాటించాలి. రసాయనాలతో తయారు చేసిన క్రీములు వాడటానికి బదులుగా వీటిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆ చిట్కాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. టీ ట్రీ ఆయిల్ :
టీ ట్రీ ఆయిల్ మొటిమలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తాయి. ఒక కాటన్ బాల్ తీసుకుని దానిపై రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి, మొటిమల మీద రాయాలి. ఇలా రోజుకు ఒకటి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టీ ట్రీ ఆయిల్‌ను నేరుగా వాడకుండా కొద్దిగా నీటిలో లేదా ఆలివ్ ఆయిల్‌లో కలిపి వాడటం మంచిది.
2. కలబంద:
కలబంద జెల్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని చల్లగా ఉంచుతుంది. మొటిమల వల్ల వచ్చే మంటను కూడా తగ్గిస్తుంది. రాత్రి పడుకునే ముందు కలబంద జెల్‌ను మొటిమల మీద రాసి.. ఉదయం లేవగానే కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు త్వరగా తగ్గుతాయి.
3. ఐస్ :
మొటిమలు వచ్చినప్పుడు మంట, నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఐస్ క్యూబ్ మొటిమల వాపును, ఎర్రదనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక చిన్న క్లాత్ లో ఐస్ క్యూబ్ తీసుకుని, మొటిమ మీద సున్నితంగా కొన్ని సెకన్ల పాటు అద్దాలి. ఇలా రోజుకు రెండు మూడుసార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
4. తేనె:
తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. కొద్దిగా తేనె తీసుకుని దాన్ని మొటిమల మీద అద్దాలి. 15-20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
5. బెంజాయిల్ పెరాక్సైడ్:
మొటిమలను త్వరగా తగ్గించడంలో బెంజాయిల్ పెరాక్సైడ్ క్రీమ్స్ బాగా పనిచేస్తాయి. ఇవి చర్మ రంధ్రాలను శుభ్రం చేసి, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తాయి. మార్కెట్లో తక్కువ కాన్సంట్రేషన్ ఉన్న క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని వాడటం మంచిది.
Also Read: ఉదయం పూట గోరు వెచ్చని నీరు తాగితే.. ?
6. వేప ఆకుల పేస్ట్:
వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మానికి చాలా మంచివి. కొన్ని వేప ఆకులను తీసుకుని పేస్ట్‌లా చేసి మొటిమల మీద రాయాలి. 15-20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు ఒకటి రెండుసార్లు చేస్తే మొటిమల సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.
ఈ చిట్కాలతో పాటు.. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నీళ్లు తాగడం, ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మొటిమలను గిల్లడం వల్ల అవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ముట్టుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ మొటిమల సమస్య తీవ్రంగా ఉంటే, డెర్మటాలజిస్టును సంప్రదించడం ఉత్తమం.