Used Tea Bags: ఈరోజుల్లో టీ బ్యాగ్స్ వాడకం క్రమంగా పెరిగిపోయింది. అయితే వాటిని వినియోగించిన తర్వాత చాలామంది చెత్త బుట్టలో పారేస్తుంటారు. ఇలా మీరు చేస్తుంటే పెద్ద పొరపాటు చేస్తున్నట్లే. ఎందుకంటే ఈ టీ బ్యాగ్స్ వల్ల కలిగే ప్రయోజనాలను పారేయడం ద్వారా ఒక్కసారిగా కోల్పోతున్నట్లు గుర్తించాలి. వాడేసిన టీ బ్యాగ్‌ను పారేసే ముందు దానితో పొందగలిగే 7 అద్భుతమైన ప్రయోజనాలేంటో ఈ కథనంలో చూద్దాం.
వాడేసిన టీ ఆకులలో నైట్రోజన్, టానిక్ యాసిడ్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. టీ బ్యాగ్‌ను చింపి ఆ తడి ఆకులను పూల కుండీలు, మెుక్కల మెుదళ్ల వద్ద ఉన్న మట్టిలో కలిపేయండి. గులాబీలు వంటి ఆమ్లత్వాన్ని ఇష్టపడే మొక్కలకు ఇది బాగా పనిచేస్తుంది. ఇది మొక్కల ఎదుగుదలకే కాక మట్టి తేమను ఎక్కువ సేపు పట్టి ఉంచేలా చేస్తుంది.
ఎండబెట్టిన టీ బ్యాగ్‌లు దుర్వాసనను పీల్చుకోవడంలో ‘బేకింగ్ సోడా’ లాగా అద్భుతంగా పనిచేస్తాయి. ఫ్రిజ్‌లో ఉండే ఆహార పదార్థాల వాసనలు పోవడానికి కొన్ని పొడి టీ బ్యాగ్‌లను మూలల్లో ఉంచండి. అలాగే రోజంతా వేసుకున్న షూస్ నుండి వచ్చే దుర్వాసనను తొలగించడానికి రాత్రి వేళల్లో ఒక్కో టీ బ్యాగ్‌ను షూస్‌లో ఉంచితే సరి.
రాత్రి సరిగ్గా నిద్రలేక కళ్లు ఉబ్బిపోయినా లేదా అలసటగా అనిపించినా టీ బ్యాగ్‌లు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. వాడిన టీ బ్యాగ్‌లను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి, ఆపై కళ్లపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. టీలోని టానిన్లు కళ్ల వాపును తగ్గించడమే కాకుండా, చల్లదనంతో కళ్లకు ప్రశాంతతను అందిస్తాయి.
టీలోని టానిక్ యాసిడ్.. జిడ్డును, మొండి మరకలను వదిలించడంలో బాగా పనిచేస్తుంది. వాడిన టీ బ్యాగ్‌లతో కాషాయం కాచి అది చల్లారిన తర్వాత ఒక మెత్తని గుడ్డను అందులో ముంచి అద్దాలు, కిటికీలను తుడవాలి. ఆ తర్వాత పొడి గుడ్డతో తుడిస్తే మరకలు లేకుండా అద్దాలు కొత్తవాటిలా మెరిసిపోతాయి. కెమికల్స్ ఘాటైన వాసన లేకుండా ఇంట్లోనే తేలికగా అద్దాలను శుభ్రం చేసుకోవడానికి ఇదొక మంచి చిట్కా.
అద్దాలనే కాకుండా చెక్క ఫర్నిచర్‌ను శుభ్రం చేయడానికి కూడా టీ బ్యాగ్ ఉపయోగపడుతుంది. బాగా మరిగించి చల్లార్చిన టీ నీళ్లలో గుడ్డను తడిపి.. టేబుళ్లు, తలుపులు, కబోర్డులను తుడిస్తే వాటికి సహజమైన మెరుపు వస్తుంది. అంతేకాకుండా చెక్కపై పడిన చిన్న చిన్న గీతలు, మచ్చలు కూడా మాయమవుతాయి.
సాధారణంగా వంట పాత్రలకు పట్టిన జిడ్డును వదిలించడం కాస్త కష్టమైన పనే. అయితే సబ్బుతో కడిగే ముందే వాడిన టీ బ్యాగ్‌తో పాత్రల జిడ్డును రుద్దితే టీలోని టానిక్ యాసిడ్ ఆ జిడ్డును తేలికగా వదిలిస్తుంది. దీనివల్ల తర్వాత తోమేటప్పుడు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా నాన్-స్టిక్, కాస్ట్ ఐరన్ పాత్రల కోటింగ్ పాడవకుండా జిడ్డు వదిలించడానికి ఇది చక్కటి మార్గం.
Also Read: బిగ్ టీవీ ఎఫెక్ట్.. మత్తు వదిలిన యంత్రాంగం.. రాత్రికి రాత్రే మెట్రో పిల్లర్ గుంతల పూడ్చివేత!
ఎండబెట్టిన టీ ఆకులను మొక్కల మొదళ్లలో చల్లడం వల్ల మట్టికి పోషకాలు అందడమే కాకుండా తోటలోకి వచ్చే పురుగులు, కీటకాలను అడ్డుకోవచ్చు. టీ ఆకుల ఘాటైన వాసన, టానిన్ల ప్రభావం వల్ల సాధారణ చీడపీడలు మొక్కల జోలికి రావు. పెద్ద పెద్ద తెగుళ్లకు ఇది పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ రోజువారీ గార్డెనింగ్‌లో ఇదొక మంచి సహజ రక్షణగా ఉపయోగపడుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఉపయోగించే టీ రకం, ఉపరితలం, మొక్కలను బట్టి ఫలితాలు మారవచ్చు. సున్నితమైన చర్మం, కంటి సమస్యలు ఉన్నవారు కళ్లపై ఉపయోగించే ముందు జాగ్రత్త వహించాలి.
Also Read: శాస్త్రవేత్తల సంచలనం.. చేపల పొలుసులతో సరికొత్త ప్లాస్టిక్.. మట్టిలో వేస్తే 8 వారాల్లోనే మాయం!