Healthy Relationship: ప్రేమ, అనుబంధాలు మన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి. అయితే, మనం కొనసాగిస్తున్న బంధం నిజంగా ఆరోగ్యకరమైనదేనా? అందులో పరస్పర గౌరవం, నమ్మకం, ఆనందం ఉన్నాయా? అనే సందేహాలు ఒక్కోసారి మనసులో మెదులుతుంటాయి. మంచి బంధంలో ప్రతిదీ సహజంగా సాగిపోతుందని కొందరు భావిస్తే.. ప్రేమను నిలబెట్టుకోవాలంటే ఇద్దరూ నిరంతరం ప్రయత్నించాల్సిందేనని మరికొందరు అంటారు. వాస్తవానికి.. ఈ రెండింటి సమతుల్యతే బలమైన బంధానికి పునాది. కాలం గడిచేకొద్దీ మన అనుబంధం మరింత బలపడుతోందా, ఒకరికొకరం అండగా నిలుస్తున్నామా అనేది గుర్తించడం ఎంతో ముఖ్యం. మరి, మీ భాగస్వామితో మీ బంధం ఆరోగ్యకరంగా ఉందో లేదో తెలిపే 7 ముఖ్యమైన సంకేతాలు ఏమిటో తెలుసుకుందామా.
ప్రతి బంధంలోనూ గొడవలు రావడం సహజం. కానీ, కోపంలో ఉన్నప్పుడు కూడా మీ భాగస్వామి మిమ్మల్ని గౌరవంగా చూస్తున్నారా లేదా అనేది ముఖ్యం. మనస్పర్థలు వచ్చినప్పుడు హుందాగా, ఓపికగా ఉండటం ఒక మంచి బంధానికి నిజమైన సంకేతం.
ఒకే ఇంట్లో ఉండే ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. వేర్వేరు అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోవడమే అసలైన బంధం. మీ నిర్ణయాలను భాగస్వామిపై బలవంతంగా రుద్దకుండా, వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ కలిసి సాగడమే ఆరోగ్యకరమైన సంకేతం.
Also Read: ఆఫీస్‌లో తెలియక చేసే ఈ 5 తప్పులు కెరీర్‌ను దెబ్బతీస్తాయి.. జాగ్రత్త!
బంధంలో ఉండటమంటే కేవలం మంచి రోజుల్లోనే కాదు, కష్ట సమయాల్లో కూడా ఒకరికొకరు తోడుగా నిలబడటం. ఇద్దరూ సమానంగా ప్రయత్నిస్తూ.. సగం దూరం అడుగులు వేస్తూ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడమే అసలైన కమిట్‌మెంట్.
మీ భాగస్వామి వద్ద మీరు ఎలాంటి ముసుగు లేకుండా, మీలా మీరు ఉండగలుగుతున్నారా? మీ లోపాలు, అలవాట్లతో సహా మిమ్మల్ని వారు స్వీకరించినప్పుడు మాత్రమే ఆ బంధంలో పూర్తి స్వేచ్ఛ, సంతోషం లభిస్తాయి.
కలిసి ఉన్నప్పుడు ఇంటి బాధ్యతలను పంచుకోవడం చాలా ముఖ్యం. ఒకరు వంట చేస్తే మరొకరు ఇల్లు సర్దడం వంటి చిన్న చిన్న పనుల్లో తోడుగా నిలవడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది.
ఎంత కలిసి ఉన్నా.. ప్రతి ఒక్కరికీ కొంత వ్యక్తిగత సమయం, ఆసక్తులు అవసరం. మీ స్నేహితులు, వ్యాపకాల కోసం సమయం కేటాయించినప్పుడు భాగస్వామి అనుమానించకుండా ప్రోత్సహించడమే నిజమైన నమ్మకానికి నిదర్శనం.
మంచి బంధం మిమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. మీ భాగస్వామి తోడు వల్ల మీరు మరింత ప్రశాంతంగా, ఉత్సాహంగా మారుతుంటే.. ఆ సంబంధం మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతోందని అర్థం.
Also Read: ఆధ్యాత్మికత కాదు.. దేవుడిని పూజించేటప్పుడు కళ్లు మూసుకోవడం వెనుకున్న పక్కా సైన్స్ ఇదే!