వేసవి కాలంలో చాలా మంది తలనొప్పి, శరీర నొప్పులకు పెయిన్‌కిల్లర్లు వాడుతారు. ఈ మందులు త్వరగా ఉపశమనం ఇచ్చి సురక్షితంగా అనిపిస్తాయి. అయితే వేడి వాతావరణం ఈ మందుల ప్రభావాన్ని మార్చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి, డీహైడ్రేషన్ వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చునని చెబుతున్నారు.
వేసవి వేడి వల్ల ఎక్కువ చెమట పట్టి శరీరం నుంచి నీరు. ఖనిజాలు తగ్గుతాయి. దీని వల్ల రక్తం మొత్తం తగ్గి అవయవాల పనితీరు ప్రభావితం అవుతుంది. ఇబుప్రోఫెన్, డిక్లోఫెనాక్ వంటి నాన్ స్టెరాయిడల్ యాంటి ఇన్‌ప్లమెటరీ డ్రగ్స్ (ఎన్‌సెయిడ్) మందులు కిడ్నీలకు రక్తప్రవాహం తగ్గిస్తాయి. డీహైడ్రేషన్‌తో కలిసినప్పుడు ఈ రిస్క్ బాగా పెరుగుతుంది. కిడ్నీలు వ్యర్థ పదార్థాలను సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవచ్చు.
కిడ్నీలకు సరైన రక్తప్రవాహం అవసరం. వేడి వల్ల ముందుగానే రక్తప్రవాహం తగ్గుతుంది. ఎన్‌సెయిడ్ మందులు దాన్ని మరింత తగ్గిస్తాయి. ఈ కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పెరిగి అవి దెబ్బతినవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో కిడ్నీలలో ఎక్కువ ఒత్తిడి వల్ల లోపల గాయాలు జరిగే ప్రమాదముంది.
డీహైడ్రేషన్ ఈ రిస్కులకు ప్రధాన కారణం. చెమటతో నీరు, మినరల్స్ కోల్పోతాం. నీరు తక్కువైతే రక్తం గట్టిపడి నెమ్మదిగా ప్రవహిస్తుంది. దీని వల్ల ముఖ్య అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. డీహైడ్రేషన్‌లో పెయిన్‌కిల్లర్లు తీసుకుంటే సమస్యలు పెరుగుతాయి.
వేసవి కాలంలో అధిక వేడి వల్ల వృద్ధులు, పిల్లలకు ఎక్కువ ఆరోగ్య సమస్యలొస్తాయి. వృద్ధుల్లో కిడ్నీ సమస్యలు లేదా డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. నిరంతరం మందులు వాడేవారికి కూడా రిస్క్ ఎక్కువ. ఈ అంశాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలు వస్తాయి.
కిడ్నీలపై ఒత్తిడి వచ్చినప్పుడు తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. కారణం లేకుండా అలసట, బలహీనత అనిపించవచ్చు. మూత్రం తగ్గడం ముఖ్యమైన సంకేతం. కాళ్లు వాపు లేదా గందరగోళం కూడా రావొచ్చు. ఈ లక్షణాలు శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియలో కలిగే ఒత్తిడితో వస్తాయి. వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే తీవ్ర నష్టం నివారించవచ్చు.
ఎన్‌సెయిడ్ మందులు దీర్ఘకాలం వాడితే గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. అధిక మోతాదులో తీసుకుంటే గుండె సమస్యలు పెరిగే అవకాశం ఉంది. తీవ్రమైన వేడి వాతావరణంలో ఈ రిస్క్ మరింత పెరుగుతుంది.
రోజంతా తగినంత నీరు తాగండి. దాహం వేసినప్పుడు మాత్రమే కాకుండా తరుచుగా తాగుతూ ఉండాలి.
అసలైన అవసరం లేకుండా మందులు వాడకండి. డాక్టర్ సలహా లేకుండా పదేపదే వాడకండి.
శరీరంలో నీరు తక్కువగా ఉంటే పెయిన్‌కిల్లర్లు వాడకండి. మందులు తీసుకునే ముందు హైడ్రేట్ అవ్వండి.
Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి
నొప్పి ఎక్కువ కాలం కొనసాగితే వైద్య సలహా తీసుకోండి. తీవ్రమైన వేడిలో స్వయం చికిత్స చేసుకోవడం ప్రమాదకరం.
విశ్రాంతి, నొప్పిగా ఉండే ప్రాంతంలో కోల్డ్ ప్రెస్, తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు నొప్పిని తగ్గించవచ్చు. ఇవి మందులపై ఆధారపడకుండా సహాయపడతాయి.