Buttermilk: మజ్జిగ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కేవలం వేడిని తగ్గించడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం రోజుకో గ్లాసు మజ్జిగ తాగడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి ఈజీగా బయటపడవచ్చు. అంతే కాకుండా శరీరానికి అవసరం అయిన కొన్ని రకాల పోషకాలు వీటి నుంచి లభిస్తాయి. రోజుకో గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల మన ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మజ్జిగ తాగితే ప్రయోజనాలు :
జీర్ణక్రియకు సహాయం:
మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఫలితంగా.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా.. భోజనం తరువాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నప్పుడు మజ్జిగ తాగితే కడుపులో మంట తగ్గుతుంది.
శరీరాన్ని చల్లగా ఉంచుతుంది:
వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇలాంటప్పుడు మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీనిలోని హైడ్రేటింగ్ గుణాలు శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడతాయి. ముఖ్యంగా.. మధ్యాహ్నం పూట ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది.
బరువు తగ్గడానికి తోడ్పడుతుంది:
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మజ్జిగ మీకు మంచి డ్రింక్. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పైగా.. కడుపు నిండిన భావనను కలిగించి అనవసరంగా తినడాన్ని తగ్గిస్తుంది. దీనిలోని పోషకాలు శరీరానికి శక్తినిచ్చి, బరువు తగ్గించే ప్రక్రియలో సహాయపడతాయి.
ఎముకల ఆరోగ్యానికి మేలు:
మజ్జిగలో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు, వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత (ఆస్టియోపొరోసిస్) సమస్య ఎక్కువగా ఉంటుంది. మజ్జిగను నిత్యం తీసుకోవడం వల్ల ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు.
చర్మ సౌందర్యానికి మేలు:
మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. ఫలితంగా.. చర్మం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది. వేసవిలో వచ్చే మొటిమలు, దద్దుర్లు వంటి వాటిని నివారించడంలో కూడా మజ్జిగ ఉపయోగపడుతుంది.
Also Read: స్ట్రెస్ ఎక్కువైతే.. హర్ట్ ఎటాక్ వస్తుందా ?
ఎలా తయారు చేసుకోవాలి ?
ఒక గ్లాసు చల్లని మజ్జిగను తయారు చేసుకోవడానికి ఒక కప్పు పెరుగు, రెండు కప్పుల నీళ్లు, కొంచెం ఉప్పు లేదా సైంధవ లవణం, తరిగిన అల్లం, పుదీనా ఆకులు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పద్ధతిలో తయారు చేసుకున్న మజ్జిగ తాగితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
రోజుకు ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడటంతో పాటు.. శరీరానికి శక్తి, చల్లదనం అందుతాయి. ఇది ఒక సాధారణ డ్రింక్ అయినా, దాని ప్రయోజనాలు మాత్రం అసాధారణం. కాబట్టి.. కోల్డ్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్‌లను పక్కన పెట్టి, రోజుకు ఒక గ్లాసు మజ్జిగను తాగడం అలవాటు చేసుకోండి.