సాధారంగా చాలా మంది ఉదయం పూట స్నానం చేస్తారు. నిద్ర నుంచి లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి ఫ్రెష్ గా వాష్ రూమ్ నుంచి బయటకు వస్తారు. ఆ తర్వాత టిఫిన్ చేసి ఆఫీస్ కు వెళ్తారు. సాయంత్రం వచ్చాక.. మరోసారి స్నానం చేస్తారు. అయితే, స్నానం ఎప్పుడు చేస్తే మంచిది? ఎలా చేస్తే మంచిది? చన్నీళ్లు వాడాలా? వేడినీళ్లు వాడాలా? అనే సవాలక్ష అనుమానాలు ఎప్పుడూ కలుగుతూనే ఉంటాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే, తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. డార్క్ షవరింగ్. చీకటిలో స్నానం చేయడం. ఇంతకీ డార్క్ షవరింగ్ అంటే ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మసక మసక పరిసరాల్లో, సువాసన గల కొవ్వొత్తులను వెలిగించి స్నానం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. మనస్సు, శరీరం ఆహ్లాదకరంగా మారి, చక్కటి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయంటున్నారు. షవర్ లో లైట్లను డిమ్ చేసినప్పుడు లేదంటే ఆపివేసి స్నానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందంటున్నారు. “రాత్రిపూట చీకటిగా లేదంటే మసక వెలుతురులో స్నానం చేయడం వల్ల ఇంద్రియ ఉద్దీపన తగ్గుతుంది. మెదడు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సూచిస్తుంది” అంటున్నారు న్యూరాలజీ నిపుణులు డాక్టర్ S. K. జైస్వాల్.
నిజానికి లైట్ అనేది సిర్కాడియన్ లయను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. సాయంత్రం వేళల్లో ప్రకాశవంతమైన కాంతికి లేదంటే స్క్రీన్ల నుండి వచ్చే బ్లూ లైట్ కు ఎక్కువ సేపు గురికావడం వల్ల నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది నిద్రను మరింత ఆలస్యం చేస్తుంది. మానసిక స్థితి, జ్ఞాపకశక్తి పనితీరును దెబ్బతీస్తుంది. అందువల్ల నిద్రకు ముందు చీకటిలో స్నానం చేయడం వల్ల అన్ని ఇబ్బందుల నుంచి లాభం పొందే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. డార్క్ షవరింగ్ లో ఎక్కువ లైట్ లేకపోవడం వల్ల మెలటోనిన్ స్థాయిలు సహజంగా పెరుగుతాయంటున్నారు. త్వరగా చక్కటి నిద్ర రావడంలో సాయపడుతుందంటున్నారు.
డార్క్ షవరింగ్ కారణంగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉందంటున్నారు. ఈ పద్దతి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఆలోచనాత్మక, ఓదార్పునిచ్చే వాతావరణాన్ని సృష్టిస్తుందంటున్నారు సైకాలజిస్ట్ శివానీ త్రిపాఠి. విశ్రాంతిని ప్రోత్సహించడంతో పాటు ఆందోళనను తగ్గిస్తుందంటున్నారు. భావోద్వేగ సమతుల్యతకు కారణం అవుతుందంటున్నారు.
డార్క్ షవరింగ్ అనేది.. పూర్తి చీకటిలో కాకుండా మృదువైన తక్కువ లైటింగ్ లో చేయాలంటున్నారు నిపుణులు. తక్కువ లైటింగ్ మెలటోనిన్ ఉత్పత్తికి కారణం అవుతుందంటున్నారు. చక్కటి నిద్రకు గోరు వెచ్చని నీరు చాలా ముఖ్యం అంటున్నారు. హడావిడిగా కాకుండా నెమ్మదిగా స్నానం చేయాలని సూచిస్తున్నారు. ప్రతి సాయంత్రం ఒకే సమయంలో డార్క్ షవరింగ్ వల్ల సిర్కాడియన్ లయను రీసెట్ చేయవచ్చంటున్నారు. ఫలితంగా చక్కటి నిద్రపడుతుందంటున్నారు నిపుణులు.
Read Also: టేస్ట్ బాగుందని.. భర్త అస్థికలను తినేసిన భార్య.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే వణికిపోతారు!