Curd In Rainy Season: వర్షాకాలం వచ్చిందంటే ఆహారం విషయంలో చాలామందిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. వర్షాకాలంలో పెరుగు తినొచ్చా?” అనేది తరచుగా ఎదురయ్యే ప్రశ్న. ఆయుర్వేదం.. ఆధునిక పోషకాహార నిపుణుల మధ్య ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే.. వాస్తవాలను, అపోహలను పరిశీలించి చూస్తే పెరుగును వర్షాకాలంలో కూడా సరైన పద్ధతిలో తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదం:
ఆయుర్వేదం వర్షాకాలంలో వాత, పిత్త, కఫ దోషాలు అసమతుల్యతకు గురవుతాయి. ఈ సమయంలో జీర్ణశక్తి మందగిస్తుందని, అందుకే తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తుంది. పెరుగు చల్లగా, జిగురుగా, పుల్లగా ఉంటుంది కాబట్టి, ఇది కఫాన్ని, అమాన్ని పెంచుతుందని చెబుతుంటారు. అందుకే.. ముఖ్యంగా రాత్రిపూట పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆర్థరైటిస్ వంటి సమస్యలు రావచ్చని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తారు.
ఆధునిక పోషకాహార నిపుణులు:
ఆధునిక పోషకాహార నిపుణులు మాత్రం పెరుగు పోషకాల గని అని, వర్షా కాలంలో కూడా దీన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని నొక్కి చెబుతున్నారు.
ప్రోబయోటిక్స్: పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వర్షాకాలంలో నీరు, ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి జీర్ణ వ్యవస్థను రక్షించడంలో ఇవి సహాయపడతాయి.
రోగనిరోధక శక్తి: పెరుగులో ఉండే పోషకాలు, ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది వర్షాకాలంలో వచ్చే సాధారణ జలుబు, ఫ్లూ వంటి వాటిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు పెరుగు వర్షకాలంలో తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
కాల్షియం, విటమిన్లు: పెరుగు కాల్షియం, విటమిన్ బి12, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి, మొత్తం శారీరక విధులకు అవసరం.
వర్షాకాలంలో పెరుగు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పైన పేర్కొన్న భిన్నాభిప్రాయాల దృష్ట్యా.. వర్షాకాలంలో పెరుగు తినాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది:
తాజా పెరుగు: ఎల్లప్పుడూ ఇంట్లో తోడు పెట్టిన తాజా పెరుగును మాత్రమే తినండి. పులిసి పోయిన లేదా ప్యాకెట్ పెరుగును తినకపోవడమే బెటర్.
పగటిపూట తినండి: రాత్రిపూట కాకుండా.. పగటిపూట మాత్రమే పెరుగు తినండి. సాయంత్రం 5 గంటల తర్వాత పెరుగు తినడం మానుకోండి.
Also Read: రాజ్మా తింటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
వెచ్చగా ఉన్నప్పుడు తినండి: నేరుగా ఫ్రిజ్ నుంచి తీసిన చల్లని పెరుగును తినడం మానుకోండి. పెరుగును గది ఉష్ణోగ్రత వచ్చాక, లేదా కొద్దిగా వెచ్చగా చేసి (చల్లగా ఉన్నపుడు) తినడం మంచిది.
మసాలాలు చేర్చండి: జీర్ణశక్తిని పెంచడానికి పెరుగులో చిటికెడు మిరియాల పొడి, జీలకర్ర పొడి లేదా అల్లం పేస్ట్ కూడా పెరుగులో కలుపుకోవచ్చు.
తక్కువ పరిమాణం: వర్షాకాలంలో పెరుగును మితంగా తీసుకోవడం మంచిది. అతిగా తినడం మానుకోండి.
తీపి వద్దు: పంచదార లేదా ఇతర తీపి పదార్థాలు కలిపిన పెరుగును నివారించండి. ఎందుకంటే అవి కఫాన్ని పెంచుతాయి.