Diabetes: డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన సమస్య. ప్రస్తుతం కోట్ల మంది ఈ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. జీవనశైలి లేదా ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ వంటివి మిమ్మల్ని డయాబెటిస్ రోగిగా మారుస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ దాని లక్షణాలను గుర్తించడం, నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
డయాబెటిస్ బాధితుల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ స్వల్ప అజాగ్రత్త కూడా తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. కొంతమందికి మధుమేహం కారణంగా కాళ్ళు కూడా తీసేయాల్సి రావచ్చు.
డయాబెటిస్ కాలు తీసేసేంత తీవ్రంగా ఎలా మారుతుంది ?
డయాబెటిస్ వల్ల కలిగే నరాల సమస్యను డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఈ సమస్య పాదాలు నల్లబడటం, కుళ్లిపోవడం లాంటి సమస్యలను పెంచుతాయి. డయాబెటిస్ వల్ల పాదాలలో వచ్చే ఈ సమస్యను డయాబెటిక్ ఫుట్ అంటారు. దీని వలన పాదాలలో పూతలు ఏర్పడతాయి . తీవ్రమైన పరిస్థితులలో పాదాలను తొలగించాల్సి రావచ్చు
డయాబెటిస్ మీ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే చక్కెర స్థాయిలు తరచుగా ఎక్కువగా ఉండే వ్యక్తులకు కళ్ళు, మూత్రపిండాలు, నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
అధిక చక్కెర స్థాయిలు డయాబెటిక్ న్యూరోపతికి దారితీస్తాయి. ఇది నరాలను దెబ్బతీస్తుంది. అంతే కాకుండా పాదాలలో రక్త ప్రసరణను దెబ్బతీస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించకపోతే.. కాలి భాగాలు లేదా వేళ్లు నల్లగా మారడం ప్రారంభమవుతాయి. క్రమంగా కాళ్లు కుళ్ళిపోవచ్చు కూడా. చికిత్స తీసుకోకపోతే.. అది ప్రభావిత భాగాలను పూర్తిగా పాడు చేస్తుంది.
భారతదేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారిలో 6.2% మంది ఈ సమస్యకు గురయ్యే ప్రమాదం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
డయాబెటిక్ న్యూరోపతి సమస్య ఉన్నవారికి తరచుగా పాదాలలో నొప్పి, జలదరింపు ఉంటుంది. దీన్ని సకాలంలో పరిష్కరించకపోతే.. కాలి వేళ్లు , ఇతర భాగాలలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల కణాలు చనిపోవడం ప్రారంభిస్తాయి. పాదాలపై నల్లటి మచ్చలు కనిపించడం దీనికి సంకేతం. చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఇవి అల్సర్లుగా మారడం ప్రారంభిస్తాయి. ఈ పరిస్థితిలో.. అది ప్రభావిత భాగాన్ని కత్తిరించే స్థాయికి కూడా రావచ్చు. దీని ప్రభావం కాళ్లపై ఎక్కువగా కనిపించింది.
కొంతమందికి కాళ్ళ నుండి ఒక రకమైన ద్రవం రావడం ప్రారంభం అవుతుంది. ఈ సమస్య వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. తర్వాత మొత్తం కాలుకు వ్యాపిస్తుంది. డయాబెటిక్ పేషెంట్ పాదాలపై నల్ల మచ్చలు, బొబ్బలు, అసాధారణ వాపు, చికాకు, ఎరుపు, నీలిరంగు మచ్చలు, పాదాలపై వింత వాసన వంటి వాటిని అస్సలు లైట్ తీసుకోవద్దు.
మీ పాదాలను జాగ్రత్తగా చూసుకోండి:
డయాబెటిక్ న్యూరోపతితో బాధపడేవారు తమ పాదాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పాదాలను గోరువెచ్చని నీరు ,సబ్బుతో కడిగి, పూర్తిగా తుడవండి. కాలి వేళ్ల మధ్య శుభ్రతపై శ్రద్ధ వహించండి.
Also Read: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2025, ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా ?
పాదాల చర్మాన్ని తేమ లేకుండా జాగ్రత్తపడండి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయండి.
దీంతో పాటు.. చెప్పులు లేకుండా నడవకపోవడం, సరైన సైజు బూట్లు ధరించడం , పాదాలకు గాయాలు కాకుండా రక్షించుకోవడం చాలా ముఖ్యం.
మీ చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోండి. ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి.