Health Tips: మంచి ఆరోగ్యం కోసం మనం కేవలం సరైన ఆహారం తీసుకోవడమే కాకుండా.. భోజనం తర్వాత కొన్ని అలవాట్లను పాటించడం కూడా చాలా ముఖ్యం. అనేక మంది తెలియకుండానే చేసే కొన్ని పనులు జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి.. భోజనం తర్వాత చేయకూడని పనుల గురించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం తర్వాత వెంటనే పడుకోవడం:
చాలా మంది భోజనం చేయగానే పడుకుంటారు. ఇది జీర్ణక్రియకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. పడుకోవడం వల్ల ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిస్తుంది. అంతే కాకుండా ఇది అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి.. భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటలు ఆగి పడుకోవాలి.
ధూమపానం:
భోజనం తర్వాత సిగరెట్ తాగడం చాలా మందికి అలవాటు. కానీ.. ఇది చాలా ప్రమాదకరం. భోజనం తర్వాత స్మోకింగ్ చేయడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. ఇది అసిడిటీని పెంచడమే కాకుండా.. పెద్దపేగు క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు కూడా కారణం కావచ్చు.
పండ్లు తినడం:
పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. భోజనం తర్వాత వెంటనే తినడం అంత మంచిది కాదు. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. కానీ భోజనంతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది. పండ్లు తినాలంటే భోజనానికి ఒక గంట ముందు లేదా రెండు గంటల తర్వాత తినడం మంచిది.
వెంటనే వ్యాయామం చేయడం:
భోజనం తర్వాత వెంటనే శారీరక శ్రమ చేయడం, వ్యాయామం చేయడం మంచిది కాదు. వ్యాయామం చేయడానికి శరీరానికి రక్తం ఎక్కువగా అవసరం అవుతుంది. కానీ.. భోజనం తర్వాత రక్తం జీర్ణ క్రియ కోసం కడుపు వైపు వెళ్తుంది. ఇలా చేయడం వల్ల కండరాలకు తగినంత రక్తం అందక అలసట, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. భోజనం తర్వాత కనీసం ఒక గంట విరామం తీసుకోవాలి.
Also Read: అలోవెరా ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది
టీ లేదా కాఫీ తాగడం:
భోజనం తర్వాత వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ వంటి పోషకాలను శరీరం గ్రహించలేదు. టీ, కాఫీల్లో ఉండే టానిన్స్ ఈ ప్రక్రియకు అడ్డు పడతాయి. ఇది ఐరన్ లోపానికి దారి తీయవచ్చు. అంతే కాకుండా పోషకాహార లోపం వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్నానం చేయడం:
భోజనం తర్వాత స్నానం చేయడం వల్ల శరీరం ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
ఈ అలవాట్లను మానుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. భోజనం తర్వాత కాసేపు నడవడం, తేలిక పాటి పనులు చేయడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. చిన్న మార్పులతో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.