Drinking Water: వేసవికాలం(Summer) వచ్చేసింది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడిని తట్టుకోవడానికి నీళ్లు చాలా అవసరం. అయినప్పటికీ, అధిక మొత్తంలో వాటర్ తీసుకోవడం వల్ల ఊహించని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండ వేడిమి నుంచి తప్పించుకోవాలని చాలా మంది నీళ్లు తాగడమే పనిగా పెట్టుకుంటారు. ఈ అలవాటు మంచిదే అయినప్పటికీ అతిగా నీళ్లు తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓవర్ హైడ్రేషన్ కారణంగా హైపోనాట్రేమియా వంటి సమస్యలు వస్తాయట.
బాడీ హైడ్రేషన్ లెవెల్స్‌తో పాటు కండరాలు, నరాల పనితీరును కంట్రోల్ చేయడానికి సోడియం చాలా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల సోడియం లెవెల్స్ పడిపోతాయట. దీని వల్ల మెదడు పనితీరుపై చెడు ప్రభావం పడుతుందట. అంతేకాకుండా ఇతర కణాలలో వాపుకు కారణమవుతుందని అంటున్నారు. ఇది తలనొప్పి, గందరగోళం, మూర్ఛ వచ్చే ఛాన్స్ ఉందట. తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నీళ్లను కూడా మితంగా తీసుకోవడమే మంచిది.
ALSO READ: యాపిల్స్ ఇలా ఉంటే అస్సలు కొనొద్దు..!
వేడి వాతావరణంలో చాలా సమయం గడిపి ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మితిమీరి నీళ్లు తాగడం వల్ల తలనొప్పి, వికారం, ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట. అంతేకాకుండా ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణంగా కండరాల తిమ్మిరి వస్తుందని అంటున్నారు.
సాధారణంగా అయితే మూత్రపిండాలు గంటకు 0.8 నుండి 1 లీటరు నీటిని మాత్రమే ప్రాసెస్ చేయగలవట. అంతకంటే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కిడ్నీల పనితీరుపై తీవ్రమైన ఒత్తిడి పడే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎన్ని నీళ్లు తాగితే మంచిది?
వాతావరణానికి అనుగూనంగా హైడ్రేషన్ అవసరాలు మారుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆడ, మగ కూడా నీళ్లు తాగే విషయంలో కొన్ని కొలతలను ఫాలో అయితే మంచిదని US నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నిపుణులు చెబుతున్నారు. పురుషులు రోజుకు దాదాపు 3.7 లీటర్లు నీళ్లు తాగాలట. మహిళలు రోజుకు దాదాపు 2.7 లీటర్ల వాటర్ తీసుకోవడం మంచిది.
అయితే, నీళ్లను తాగే విషయంలో కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం మంచిది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే వికారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే రోజు మొత్తంలో అరగంటకు ఒక సారి కొన్ని నీళ్లు తాగడం మంచిది. ఎండలో ఎక్కువ సమయం గడిపే వారు, వర్కౌట్స్ చేసే వారు ఎలక్ట్రోలైట్‌లను తీసుకోవడం ఉత్తమం. అలాగే నీళ్లు మాత్రమే కాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, చెరకు రసం వంటివి తీసుకోవడం కూడా అలవాటు చేసుకుంటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.