Summer Health: వేసవి కాలం కాలం వచ్చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం ఎక్కువగా వేడిగా ఉండడం వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్, తలనొప్పి, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ఈ వేడి కాలంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేసవిలో శరీరం నుండి ఎక్కువ చెమట రావడంతో చాలా నీరు బయటికి పోతుంది. అందుకే రోజు కనీసం 3 నుండి 4 లీటర్ల వరకు నీళ్లు తాగాలని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా నారింజ రసం, కొబ్బరి నీళ్లు, బెల్లం కలిపిన నీళ్లు తాగడం మంచిది. వీటి వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుందట. దీంతో డీహైడ్రేషన్ సమస్య నుంచి ఈజీగా బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో బయటకు వెళ్లకూడదు. ఒకవెళ బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం టోపీ, కూలింగ్ గ్లాస్‌లు, స్కార్ఫ్‌లు వాడడం మంచిది.
ఎక్కువ సమయం ఎండలో గడిపే వారు వేసుకునే బట్టల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో శరీరానికి బాగా గాలి తగిలేలా ఉండే తేలికపాటి, తెల్లటి లేదా లైట్ కలర్ బట్టలు వేసుకోవాట. ముఖ్యంగా కాటన్ బట్టలు ధరించడం మంచిది. ఇవి చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
వేసవి రోజుల్లో అతి వేడి, తీపి లేదా మసాలా ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. త్వరగా జీర్ణమయ్యే టిఫిన్స్, పండ్లు, కూరగాయలు తీసుకోవాలని చెబుతున్నారు.
చాలా సమయం ఎండలో గడిపి ఇంటికి వెళ్లగానే ఫ్రిడ్జ్‌లో ఉన్న నీళ్లు తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వేడి వాతావరణంలో ఉండి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ నీరు లేదా ఐస్ వాటర్ తాగితే గొంతు సమస్యలు, జలుబు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
ALSO READ: వీకెండ్ కదా అని పీకల దాకా తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?
వెసవి కాలంలో వ్యక్తిగత శుభ్రత పాటించడం కూడా చాలా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకి కనీసం రెండు సార్లు స్నానం చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. చెమట వల్ల వచ్చే దుర్వాసన, చర్మ వ్యాధులు దూరం అవుతాయి.
బయటికి వెళ్తే ముఖానికి సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల చర్మం ట్యాన్ అవ్వకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎండ వల్ల పిల్లలు, వృద్ధులపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. వాళ్లకు తరచూ నీరు ఇవ్వడం, బయటకి ఎక్కువసేపు తీసుకెళ్లకపోవడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.