Ginger garlic soup for immunity: బయట టపటపా వాన పడుతుంటే.. కిటికీ పక్కన కూర్చుని వేడి వేడిగా ఏదైనా తాగితే ఆ కిక్కే వేరు కదా! అయితే సమోసాలు, పకోడీలు తింటే బరువు, కొలెస్ట్రాల్ పెరుగుతాయనే భయం ఉంటుంది. అందుకే.. ఈ వర్షాకాలంలో అటు నాలుకకు రుచిని, ఇటు శరీరానికి బోలెడంత రోగనిరోధక శక్తిని ఇచ్చే ఒక సూపర్ ఆప్షన్ ఉంది. అదే ‘అల్లం-వెల్లుల్లి సూప్’. వాతావరణం మారగానే వచ్చే జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్ వంటి సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని కాపాడే ఈ హెల్తీ అండ్ టేస్టీ సూప్‌ను ట్రెండీగా, రెట్టింపు పోషకాలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సహజసిద్ధమైన ఆహార పదార్ధాల ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. అల్లం , వెల్లుల్లి లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ అనే సమ్మేళనం శరీరంలో వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అలాగే అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్‌లో సూప్ తీసుకుంటే బాడీకి ఒక పవర్‌ఫుల్ షీల్డ్ దొరికినట్లే.
కావలసిన పదార్థాలు:
ఈ హెల్తీ సూప్ కోసం మీకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే వస్తువులతోనే దీనిని రెడీ చేయవచ్చు. సన్నగా తరిగిన అల్లం (ఒక చెంచా), సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు (రెండు చెంచాలు), ఉల్లిపాయ ముక్కలు, మీకు నచ్చిన కూరగాయలు (క్యారెట్, క్యాబేజీ, స్వీట్ కార్న్, బీన్స్ వంటివి సన్నగా తరిగినవి), కొద్దిగా మిరియాల పొడి, వెన్న లేదా ఆలివ్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, గార్నిషింగ్ కోసం కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్.
తయారుచేసే విధానం:
ముందుగా ఒక పాన్ లేదా గిన్నెలో ఒక చెంచా వెన్న లేదా నూనె వేసి వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు మీరు తీసుకున్న క్యారెట్, క్యాబేజీ, బీన్స్ వంటి వెజిటబుల్స్ అన్నింటినీ వేసి లైట్‌గా ఫ్రై చేయండి. కూరగాయలు మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా క్రంచీగా ఉంటేనే సూప్ తాగేటప్పుడు బాగుంటుంది.
ఇప్పుడు ఇందులో రెండు నుంచి మూడు కప్పుల నీళ్లు (లేదా వెజిటబుల్ స్టాక్) పోసి బాగా మరిగించాలి. సూప్ కాస్త చిక్కగా కావాలనుకునే.. వారు ఒక చెంచా కార్న్ ఫ్లోర్‌ను కొద్దిగా నీళ్లలో కలిపి ఈ మరుగుతున్న సూప్‌లో పోయవచ్చు (వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కార్న్ ఫ్లోర్ స్కిప్ చేయవచ్చు). సూప్ బాగా మరిగాక అందులో రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా మిరియాల పొడి వేసి కలపాలి. మిరియాల పొడి ఈ సూప్ రుచిని, ఘాటును రెండింతలు చేస్తుంది. చివరగా స్టవ్ ఆఫ్ చేసి, కొద్దిగా నిమ్మరసం పిండి, కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి అల్లం-వెల్లుల్లి సూప్ రెడీ.
స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి:
ఈ సూప్‌ను మరింత హెల్తీగా మార్చడానికి మీరు ఇందులో కొద్దిగా పుట్టగొడుగులు లేదా పనీర్ ముక్కలను యాడ్ చేయవచ్చు. నాన్-వెజ్ ప్రియులైతే చికెన్ ముక్కలను ఉడికించి ఆ చికెన్ స్టాక్‌తో ఈ సూప్ చేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అలాగే నిమ్మరసం స్టవ్ ఆఫ్ చేసాకే వేయాలి. దీనివల్ల విటమిన్-సి పోకుండా ఉంటుంది.
కలుషితమైన ఆహారం, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే ఈ వర్షాకాలంలో బయటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి, ఇలాంటి హెల్తీ హోమ్‌మేడ్ సూప్స్ తాగడం ఎంతో మంచిది. రోజూ సాయంత్రం వేళ టీ, కాఫీలకు బదులుగా ఈ అల్లం-వెల్లుల్లి సూప్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇది మీ శరీరానికి కావలసిన వేడిని ఇవ్వడమే కాకుండా మిమ్మల్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది.