Navratri Fasting: ఉపవాసం అనేది మన దేశంలో ఒక ఆధ్యాత్మిక సంప్రదాయంగా ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో ఆరోగ్యం, బరువు తగ్గడం వంటి ప్రయోజనాల కోసం ఉపవాసం ఒక ట్రెండ్‌గా మారింది. ఈ సందర్భంలో.. రెండు రకాల ఉపవాస పద్ధతులు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, నవరాత్రి ఫాస్టింగ్. ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న తేడాలు, వాటి లక్ష్యాలు, ప్రభావాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్:
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే.. ఒక నిర్దిష్ట సమయం వరకు ఆహారం తీసుకోకుండా ఉండటం. ఇది ఒక రకమైన ఆహారపు అలవాటు. ఇది ఆహారంలో ఏ పదార్థాలను తగ్గించాలో చెప్పదు. కానీ ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అనేది తెలియజేస్తుంది. దీని ప్రధాన లక్ష్యం బరువు తగ్గడం, జీవక్రియను మెరుగుపరచడం అంతే కాకుండా ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడం.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ముఖ్య పద్ధతులు:
16/8 పద్ధతి: ఈ పద్ధతిలో.. రోజులో 16 గంటలు ఉపవాసం ఉండి, మిగిలిన 8 గంటల సమయంలో మాత్రమే ఏదైనా ఆహారం తీసుకుంటారు. ఉదాహరణకు.. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తినడం, మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉండటం.
5:2 పద్ధతి: ఈ పద్ధతిలో.. వారంలో 5 రోజులు సాధారణంగా ఆహారం తీసుకుని, మిగిలిన 2 రోజులు చాలా తక్కువ కేలరీలు (500-600 కేలరీలు) మాత్రమే తీసుకుంటారు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రయోజనాలు:
బరువు తగ్గడం.
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడం
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం
జీవక్రియను వేగవంతం చేయడం
శరీరంలో వాపు తగ్గించడం.
నవరాత్రి ఫాస్టింగ్:
నవరాత్రి ఉపవాసం అనేది ప్రధానంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది దుర్గామాతను పూజించే తొమ్మిది రోజుల పండుగలో కూడా భాగం అని చెప్పవచ్చు. ఈ ఉపవాసంలో ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మిక శుద్ధి అంతే కాకుండా దేవత పట్ల భక్తి. ఈ ఉపవాసంలో కొన్ని ఆహార నియమాలను కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
నవరాత్రి ఫాస్టింగ్‌లో ముఖ్య నియమాలు:
ధాన్యాలు తినకూడదు: నవరాత్రి ఉపవాసంలో సాధారణంగా గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలను తినరు.
పండ్లు, కూరగాయలు: ఈ సమయంలో సాబుదానా, కుట్టు కా అట్టా, సింఘాడా కా అట్టా వంటి వాటితో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. అలాగే పండ్లు, పాల ఉత్పత్తులు, కొన్ని రకాల కూరగాయలు, ఆలు గడ్డ, చిలగడదుంప, పన్నీర్ వంటివి తీసుకుంటారు.
ఉప్పు వాడకం: సాధారణ ఉప్పుకు బదులుగా రాళ్ళ ఉప్పు ఉపయోగిస్తారు.
అధిక నూనె వాడకం: కొన్ని సందర్భాల్లో నవరాత్రి ఉపవాసంలో నూనె ఎక్కువగా వాడిన ఆహారాలు (ఉదాహరణకు, సబుదానా వడ) తింటారు.
నవరాత్రి ఫాస్టింగ్ ప్రయోజనాలు:
ఆధ్యాత్మిక శుద్ధి.
శారీరక, మానసిక ఆరోగ్యం.
శరీరాన్ని డీటాక్స్ చేయడానికి సహాయ పడుతుంది.
సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి మంచిది.
ముఖ్య తేడాలు:
లక్ష్యం: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఆరోగ్య ప్రయోజనాలు, బరువు తగ్గడం. నవరాత్రి ఉపవాసం యొక్క లక్ష్యం ఆధ్యాత్మిక, మతపరమైనది.
ఆహార నియమాలు: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలాంటి ఆహారం తినాలనే విషయంలపై షరతులు ఏమి ఉండవు కానీ.. కేవలం ఎప్పుడు తినాలి అనేది మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నవరాత్రి ఉపవాసంలో ఏ ఆహారం తినాలి, ఏది తినకూడదు అనే స్పష్టమైన నియమాలు ఉంటాయి (ఉదాహరణకు, ధాన్యాలు నిషిద్ధం, రాళ్ళ ఉప్పు వాడకం).
Also Read: పెసరట్టు చేయడం చాలా ఈజీ.. ఇంట్లో ఈ పొడి ఉంటే క్షణాల్లోనే రెడీ !
పద్ధతి : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఒక నిర్దిష్ట ఉపవాస సమయం ఉంటుంది (ఉదాహరణకు 16 గంటలు), ఆ తర్వాత ఏదైనా తినవచ్చు. నవరాత్రిలో ఆహారాన్ని పూర్తిగా మానేయకుండా.. కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రమే తీసుకుంటారు.
సమయం: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒక దీర్ఘకాలిక ఆహారపు అలవాటు. నవరాత్రి ఉపవాసం ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే (సాధారణంగా 9 రోజులు) పాటిస్తారు.
ఈ రెండు రకాల ఉపవాస పద్ధతులు వేర్వేరు లక్ష్యాలను కలిగి ఉన్నప్పటికీ.. రెండూ కూడా శరీరంపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాటు అయితే.. నవరాత్రి ఫాస్టింగ్ అనేది సంప్రదాయం, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది. ఎంచుకున్న ఉపవాస పద్ధతి ఏదైనా, శరీరానికి సరిపడే విధంగా, ఆరోగ్యానికి హాని కలగకుండా చూసుకోవడం ముఖ్యం. ఉపవాసం మొదలుపెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.