Japanese Interval Walking: ఈ మధ్య కాలంలో ‘జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్’ (Japanese Interval Walking) అనే కొత్త రకం వ్యాయామం ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఫిట్‌నెస్ నిపుణులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ పద్ధతిని ప్రస్తుతం ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఏంటీ జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ , దీని ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్వెల్ వాకింగ్ (Japanese Interval Walking) అంటే ఏమిటి ?
ఇంటర్వెల్ వాకింగ్ అంటే ఒకే వేగంతో నడవకుండా, నెమ్మదిగా కాసేపు, వేగంగా కాసేపు ఇలా మార్చి మార్చి నడవడం. జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ కూడా అదే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో.. 3 నిమిషాల పాటు సాధారణ వేగంతో నడిచి, ఆ తర్వాత 3 నిమిషాల పాటు వేగంగా నడుస్తారు. ఈ ప్రక్రియను కనీసం 5 సార్లు రిపీట్ చేస్తారు.
ఈ పద్ధతిని జపాన్లోని షిన్షు విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని ప్రధాన లక్ష్యం గుండె సంబంధిత సమస్యలు తగ్గించడం, రోగనిరోధక శక్తి పెంచడం, అంతే కాకుండా శరీర బరువును నియంత్రించడం.
ఎలా చేయాలి ?
మొదట సాధారణ వేగంతో 3 నిమిషాలు నడవండి. ఇది శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేస్తుంది.
వేగంగా నడవడం:
తర్వాత.. 3 నిమిషాల పాటు వేగంగా నడవండి. మీరు ఎంత వేగంగా నడుస్తున్నారంటే, మీకు కొద్దిగా శ్వాస తీసుకోవడం కష్టం అనిపించాలి. కానీ మీరు మాట్లాడగలిగేలా ఉండాలి. ఇది మీ గుండె కొట్టుకునే రేటును పెంచుతుంది.
నెమ్మదిగా నడవడం :
ఆ తర్వాత, తిరిగి 3 నిమిషాల పాటు నెమ్మదిగా నడవండి. ఇది మీ గుండె కొట్టుకునే రేటును సాధారణ స్థితికి తీసుకొస్తుంది.
పునరావృతం :
ఇలా నెమ్మదిగా, వేగంగా నడవడం 5 సార్లు రిపీట్ చేయండి. అంటే.. మొత్తం 30 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
Also Read: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?
ప్రయోజనాలు:
శరీర బరువు తగ్గడం: వేగంగా నడవడం వలన కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. తద్వారా.. బరువు తగ్గడానికి ఇది బాగా సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం:
ఈ వ్యాయామం గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణ:
ఈ పద్ధతి ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
మానసిక ఆరోగ్యం:
వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఫలితంగా బీపీ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా కూడా ఉంటాము.
జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ అనేది ఖర్చులేని, సులభమైన, శక్తివంతమైన వ్యాయామం. ఈ పద్ధతిని పాటించడం ద్వారా కేవలం కొద్ది కాలంలోనే మీరు మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త సంవత్సరం నుంచి దీనిని మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉండవచ్చు.