Digital chemistry gap in relationships| ఫోన్‌లో గంటల తరబడి చాట్ చేస్తే ఆ వ్యక్తి మనకు చాలా దగ్గరైనట్లు అనిపిస్తుంది. ప్రతి మెసేజ్‌కు వెంటనే నవ్వడం, సరదాగా మాట్లాడటం, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకోవడం వల్ల మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. అయితే, మొదటిసారి ఎదురుగా కలిసినప్పుడు పరిస్థితి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. చాట్‌లో సులభంగా సాగిన సంభాషణ ఒక్కసారిగా నెమ్మదిస్తుంది. ఇద్దరి మధ్యలో వచ్చే నిశ్శబ్దం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిని డిజిటల్ కెమిస్ట్రీ గ్యాప్ అని అంటారు.
ఆన్‌లైన్‌లో ఉన్న అనుబంధం, నిజ జీవితంలో వెంటనే కనిపించకపోవడం దీనికి కారణం. అయితే, మొదటి మీటింగ్ ఆక్వర్డ్‌గా ఉందని కనెక్షన్ లేదని వెంటనే నిర్ణయించకూడదు.
చాటింగ్ చేసేటపప్పుడు ఏం రాయాలి, ఏం చెప్పాలి అని బాగా ఆలోచించి అందంగా మీ భావాలను వ్యక్తపరచవచ్చు. దీనికి కావాల్సిన సమయం ఉంటుంది. దీని వల్ల చాలామంది తమ భావాలను మరింత సులభంగా వ్యక్తపరుస్తారు. సరదాగా మెసేజ్‌లు పంపే వ్యక్తి నిజంగానే హాస్యభరితమైన వ్యక్తి కావచ్చు. కానీ ఎదురుగా మాట్లాడేటప్పుడు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. అందరూ అలాంటి పరిస్థితుల్లో సహజంగా మాట్లాడలేరు. అందువల్ల చాట్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించే వ్యక్తి, ఎదురుగా కొంత నర్వస్‌గా ఉండే అవకాశం ఉంది.
మెసేజింగ్‌లో ముఖ కవళికలు, కంటి చూపు, బాడీ లాంగ్వేజ్ కనిపించవు. ఒక వ్యక్తి నర్వస్‌గా ఉన్నాడో లేదో కూడా వెంటనే అర్థం కాకపోవచ్చు. ఎదురుగా కలిసినప్పుడు మాత్రం ప్రతి స్పందన స్పష్టంగా కనిపిస్తుంది. చిన్న నిశ్శబ్దం కూడా పెద్ద సమస్యలా అనిపించవచ్చు. చాట్‌లో ఇద్దరూ చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ డిన్నర్‌కు ఎదురుగా కూర్చున్నప్పుడు ఇద్దరూ కొత్త వ్యక్తుల్లా ఫీల్ కావచ్చు. నిజ జీవితంలో కలిసి గడిపే సమయం, అనేక విషయాలు స్క్రీన్ చూపించలేదు.
వారాల తరబడి చాట్ చేసిన తర్వాత తొలిసారి ప్రత్యక్షంగా కలవడం కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. అప్పటికే ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఒక అభిప్రాయం ఏర్పర్చుకుంటారు. దీని వల్ల ప్రతి మాట, ప్రతి క్షణంలో నిశ్శబ్దాన్ని మీరు ఎక్కువగా విశ్లేషించే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి సాధారణ సంభాషణను కూడా ఇబ్బంది కరంగా మార్చే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త వ్యక్తిని ఎదురుగా కలవడం నిజంగానే నర్వస్‌గా ఉంటుంది. అలాంటి వారికి మొదటి మీటింగ్‌లో సౌకర్యంగా ఉండటానికి సమయం అవసరం. కాబట్టి మొదటి మీటింగ్ బాగా సాగకపోతే వెంటనే నిర్ణయం తీసుకోకండి.
చాటింగ్‌లో కనిపించే వ్యక్తిత్వం నకిలీ అని దీని అర్థం కాదు. కానీ అది ఆ వ్యక్తి.. వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే. మెసేజ్‌ల ద్వారా వారి హాస్యం, ఆసక్తులు, ఆలోచనలు తెలుసుకోవచ్చు. నిజ జీవితంలో కలిసి గడిపినప్పుడు వారి మరో కోణం తెలుస్తుంది. కాలక్రమేణా ఇద్దరి మధ్య సౌకర్యం పెరుగుతుందో లేదో గమనించడం ముఖ్యం. ఫోన్ పక్కన పెట్టిన తర్వాత కూడా కనెక్షన్ సహజంగా అనిపిస్తే, బంధం మరింత బలపడే అవకాశం ఉంటుంది. అయితే కెమిస్ట్రీ కేవలం చాట్‌లోనే ఉంటే, దాన్ని కూడా గమనించాలి. మంచి అనుబంధానికి ఆన్‌లైన్‌తో పాటు నిజ జీవితంలో కూడా సౌకర్యం అవసరం.
Also Read: మీరూ మతిమరుపుతో బాధపడుతున్నారా? డిమెన్షియా వ్యాధిని ముందుగానే నివారించడానికి ఇలా చేయండి